-ఓటమి భయంతోనే వైసీపీ దొంగ ఓట్ల అక్రమాలు
-వాలంటీర్లను విధుల్లో ఉంచి ఎన్నికలను అపహాస్యం చేస్తారా?
-సజావుగా ఎన్నికలు జరగకపోతే ప్రజాస్వామ్య ఖూనీ
-మీడియాతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్
-కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఓటరు జాబితా అక్రమాలపై ఫిర్యాదు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అమరావతి :- ‘ఓటరు జాబితాలో ఎప్పడూ లేనన్ని అవకతవకలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది..అది చూసే దొంగఓట్లు చేర్చుతున్నారు. టీడీపీ-జనసేన శ్రేణులపై బైండోవర్ కేసులు పెట్టి, ఎన్నికల్లో పనిచేసుకోనివ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలను అపహాస్యం చేసేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో పాల్గొనేలా చేస్తారా.? ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజీలేకుండా పోరాడతాం’’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని నోవాటెల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
హోల్ సేల్ గా ఓటరు జాబితా మార్పు
నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో అచాకాలు జరగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తునారు. మాపై కేసులు విపరీతంగా పెట్టి పని చేయనీయకుండా చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, కార్యకర్తలు పని చేసుకోనివ్వకపోవడమే కాకుండా వ్యవస్థలను సర్వనాశనం చేయాలని ప్రయత్నించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూశాక హోల్ సేల్ గా ఓటర్ల జాబితాను మార్చుతున్నారు. ఎలాగైనా గెలవాలనే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే ఫామ్ – 6 కింద 1.15 లక్షల ఓట్లు చేర్చారు..అందులో 33 వేల ఓట్లు ఆమోదించారు. పనుల నిమిత్తం ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించారు.
ఎన్నికల అధికారులే రక్షణ కోరే పరిస్థితి
ఒక ఛీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి ఎన్నికల కమిషన్ గా ఉంటే..కేంద్రాన్ని రక్షణ కోరే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎన్నికల విధులకు పంపే అధికారులను ఎంపిక విధానంలో కాకుండా దేశం మొత్తంమీద విధులు ఉత్తమంగా నిర్వహించిన వారిని తీసుకోవాలి. దేశంలో టీచర్లు, ప్రభుత్వ అధికారులు, అనుభవం ఉన్న వారిని ఎన్నికల విధుల్లో ఉపయోగించుకుంటారు.. కానీ రాష్ట్రంలో మాత్రం వాళ్లను ఎన్నికల విధులకు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్తోంది.
నామినేటెడ్ చేసిన వాలంటీర్లను పెట్టుకుని తప్పుడు పనులు చేయాలని చూస్తున్నారు. బీఎల్వోలుగా గతంలో ప్రభుత్వ అధికారులు మాత్రమే ఉండేవారు..దీంతో ఎక్కడా ఒక్క తప్పూ జరిగేది కాదు. పొరపాటు సరిగా నిర్వహించకపోతే యాక్షన్ తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు 2,600 మంది మహిళా పోలీసులను బీఎల్వోలుగా పెట్టారు..ఇది ఆశ్చర్యకర అంశం. 83 నియోజకవర్గాల్లో బిఎల్వోలుగా మహిళా పోలీసులను పెట్టారు..ఎన్నికల విధానాలు వాళ్లకు ఎలా తెలుస్తాయి.?
స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ కార్యక్రమంలాగా వై ఏపీ నీడ్స్ జగన్ కు కలెక్టర్లు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చేసిన అరాచకం చాలక..మళ్లీ రాతియుగంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ-జనసేన శ్రేణులపై 7 వేల కేసుల దాకా పెట్టారు..ఒక్క పుంగనూరులో 250 మందిపై కేసులు పెట్టి జైలుకు పంపారు. తెలంగాణలో ఎన్నికలు సజావుగా జరిగాయి. ఓటరు జాబితా పర్యవేక్షణలో అవకతవకలు, బీఎల్వోల తప్పులు లేకుండా జరిగాయి..కానీ చరిత్రలో ఏనాడూ లేని విధంగా ఏపీలో ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి.
ప్రజాస్వామ్యాన్ని కాపాడతాము, మీరే చూస్తారు అని కేంద్ర ఎన్నికల అధికారి హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో అవసరమైతే కేంద్ర పోలీసు పరిశీలులను పంపాలి.. స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలి. ఎక్కిడికక్కడ పర్యవేక్షణ చేసి అవకతవకలకు ఆస్కారం లేకుండా చేయాలి. ఒక్క దొంగ ఓటు ఉన్నా..ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి తప్పుడు పనులు ప్రతిఘటిస్తాం. కోర్టుకు వెళ్లి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తాం..నాలుగు కోట్ల మంది ఓటర్లకు భరోసా ఇచ్చారు..దాన్ని నమ్ముతున్నాం. ఎన్నికల కమిషన్ పై మాకు నమ్మకం ఉంది.
బోగస్ ఓట్లపై పోరాడేవారి కేసులు, అరెస్టులు
ఎన్నికల అధికారులు చేసే పనిని వైసీపీ నేతలు ఎలా చేస్తారు? అమెరికాలో ఉన్న వాళ్లు కూడా జన్మభూమికి వచ్చి ఓటేస్తారు..అక్కడ ఉన్నవాళ్లు ఇక్కడ ఓటేయకూడదని ఎలా చెప్తారు? ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉంటారు..బయటకు ఎందుకు వెళ్తారు.? ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బందిని తీసుకోవడం సమంజసం కాదు. తప్పు చేసిన ప్రతి అధికారిపై ఆధారాలతో ఫిర్యాదు చేశాం..దానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరాం. తిరుపతి ఉప ఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, 2019లోనూ దొంగఓట్లుకు పాల్పడ్డారు.
అప్పుడేమీ చర్యలు తీసుకోలేదు కాబట్టి ఏమీ కాదనే ధైర్యంతో ఇప్పుడు ఉన్నారని చెప్పాం. బోగస్ ఓట్లపై పోరాడుతున్నవారిని అరెస్టు చేస్తున్నారు. చాలా మంది అధికారులపైనా బెదిరింపులకు దిగుతున్నారు. కలెక్టర్ దగ్గర నుండి ఎస్పీలపైనా బెదిరింపులకు దిగి..లొంగకపోతే కేసులు పెడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఎంత త్వరగా చర్యలు తీసుకుంటే అంత సున్నితంగా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కమిషన్ లేని సమయంలో కూడా నేను పోటీ చేశాను..ఆనాడు ఇంతటి ఘోరాలు జరగలేదు.’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…
‘ఏపీ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతోనే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి వచ్చింది. చంద్రబాబు 3 సార్లు సీఎంగా చేశారు..ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఉప్పుడున్నన్ని అవకతవకలు జరగలేదు. వైసీపీ దొంగ ఓట్లను చేర్చుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక శాంతి భద్రతలు దిగజారాయి. వ్యక్తులపై అక్రమంగా బైండోవర్ కేసులు పెడుతున్నారు. పోలీసు అధికారులను హుటాహుటిన ఒకచోట నుండి మరో చోటకు విధులు మార్చుతున్నారు.
వైసీపీకి కావాల్సిన అధికారులను తెచ్చుకుంటున్నారు. వాలంటీర్ల నియామకమే ప్రజాస్వామ్య విరుద్ధం..అలాంటప్పుడు వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి. పారదర్శకంగా ఎన్నికలు జరక్కపోతే ప్రజాస్వామ్యం ఖూనీతో హింస ఎక్కువ అవుతుంది. స్థానిక ఎన్నికల్లోనూ దళితులు నామినేషన్ వేసిన పరిస్థితి లేదు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది.’ అని వివరించారు.