• టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు పక్కన నిలబడ్డ వ్యక్తి, నేడు వైసీపీ ఛోటా నాయకుల భజన చేసే దుస్థితికి వచ్చాడు
• కల్తీ మద్యం క్వార్టర్ రూ.200లకు ఎందుకు అమ్ముతున్నారో, లారీ ఇసుక రూ.12వేలు అంతకుమించి అమ్మడంపై కేశినేని నానీ మాట్లాడాలి
• తెలంగాణలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చయితే, జగన్ రెడ్డి సర్కార్ రూ.400కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిందో నానీ చెప్పాలి
• వచ్చే ఎన్నికల్లో నానీపై టీడీపీ అభ్యర్థి 2 లక్షల మెజారిటీతో గెలుస్తాడు
• కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంలో నానీ పాత్ర చంద్రబాబుకి కాగితాలు అందించడమే
– టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా
తెలుగుదేశంలో ఉన్నప్పుడు కేశినేని నానీకి మోసగాడిగా..ద్రోహిగా కనిపించిన జగన్ రెడ్డి, నేడు గొప్పవ్యక్తిగా కనిపించడం హాస్యాస్పదమని, పీఆర్పీ.. టీడీపీల మాదిరే త్వరలోనే వైసీపీ కూడా నానీని భరించలేమనే స్థితికి వస్తుందని, నానీకి నైతిక విలువలు లేవు అనడానికి అతను చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ ప్రజలు నానీకి ఘోర పరాభవాన్ని కానుకగా ఇవ్వనున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి నానీపై 2లక్షల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాడు. తెలుగుదేశంలో ఉంటే చంద్రబాబు పక్కన నిలబడే వ్యక్తి, నేడు వైసీపీలో విజయసాయిరెడ్డి వెనకాల నిలబడే స్థితికి వచ్చాడు. విజయవాడ పార్లమెంట్ ను శాసిస్తానని చెప్పుకున్న నానీ, నేడు వైసీపీలోని చిన్నాచితకా నేతలకు భజన చేసే దుస్థితికి దిగజారాడు.
చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మొదట ప్రారంభమయ్యేది రాజధాని పనులేనని నానీ తెలుసుకోవాలి
రాజధాని అమరావతి గురించి నానీ చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ అసంబద్ధమైనవి. అమరావతిలో చదరపు గజం భూమి రూ.8వేలు ఉందంటున్న నానీకి విజయవా డలో చదరపు గజం ఎంత ఉందో తెలియదా? విజయవాడలో రూ.10వేలు ఉంటే, హైదరాబాద్ లో రూ.18వేలు ఉంది. భూములపై నిరాధార ఆరోపణలు చేసిచేసి.. వైసీపీ వాళ్లు తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు నానీ గతంలో వారు చేసిన నిరాధార ఆరోపణలనే మళ్లీ చేస్తున్నాడు.
అమరావతి రైతులు, మహిళలపై ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చేసిన దాష్టీకం, దమనకాండ నానీకి కనిపించలేదా? జరిగిన దారుణాలు ఆయన మర్చిపోయాడా? రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు అమరావతి రైతులు పక్షాన నిలిస్తే, ఆ ప్రాంతంపై కక్షతో భూములిచ్చిన రైతులు, మహిళల్ని జగన్మోహన్ రెడ్డి దారుణంగా హింసించాడు. పోలీసులతో చిత్రహింసలకు గురిచేసి, వారిపై తప్పుడు కేసులు మోపి అన్యాయం గా జైళ్లకు పంపాడు. ప్రజారాజధాని అమరావతి పేరెత్తే అర్హత నానీకే కాదు, వైసీపీ నేతలెవరికీ లేదు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే మొదట ప్రారంభించేది రాజధాని పనులేనన్న వాస్తవాన్ని నానీ గ్రహించాలి.
అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి తెలంగాణలో రూ.150కోట్లు ఖర్చయితే, జగన్ రెడ్డి సర్కార్ రూ.400 కోట్లు ఎందుకు పెట్టిందో నానీ చెప్పాలి
తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను అంటున్న నానీ.. రాష్ట్రంలో కల్తీ మద్యం ఎందుకు అధిక ధరకు అమ్ముతున్నారో చెప్పాలి. జగన్ రెడ్డి క్వార్టర్ మద్యాన్ని రూ.200లకు ఎందుకు అమ్మిస్తున్నాడో నానీ సమాధానం చెప్పాలి. అదే విధంగా లారీ ఇసుక రూ.12 నుంచి రూ.15వేలకు ఎందుకు అమ్ముతున్నారో కూడా చెప్పాలి. ఒకే ఎత్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు పెడితే, జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.400కోట్లు ఎందుకు ఖర్చుచేసిందో కూడా నానీ సమాధానం చెప్పాలి.
కేంద్ర నిధుల్ని వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తోంది అన్న కేంద్రమంత్రుల వ్యాఖ్యలపై, ఒక పార్లమెంటేరియన్ గా నానీ స్పందించాలి. నానీ ఎక్కడున్నా చేసేది కోవర్ట్ ఆపరే షనే. వైసీపీలో ఉండి మరోపార్టీకి కోవర్ట్ గా పనిచేస్తాడు. గతంలో టీడీపీలో ఉంటూ వైసీపీ కోవర్ట్ గా పనిచేశాడు. తెలుగుదేశం గెలవదని సర్వేలు చెబుతున్నాయి అంటున్న నానీ.. అదే పార్టీ బీ ఫామ్ కోసం ఎందుకు వెంపర్లాడాడు? తెలుగుదే శంలో ఉన్నప్పుడు తన పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల అభ్యర్థుల్ని పిలిచి వారితో మాట్లాడి, వారికి ఏనాడూ భోజనం పెట్టించని కేశినేని నానీ, ఇప్పు డు వైసీపీవారికి బ్రహ్మండంగా భోజనాలు పెడుతున్నాడు. ఢిల్లీలో కూడా ఇలానే వ్యవహరించాడు.
కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంలో నానీ పాత్ర ఏదైనా ఉందంటే.. అది చంద్రబాబుకి కాగితాలు అందించడమే
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నగరం కళకళలాడితే, నేడు వెలవెలబోతున్నది నిజం కాదా నానీ? విజయవాడ నగరంలో రోడ్లు వేసింది, డ్రైనేజ్ లు నిర్మించింది, మొక్కలు నాటించింది టీడీపీ ప్రభుత్వంలో కాదా నానీ? కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టింది చంద్రబాబు అయితే, అంతా తనవల్లేనని నానీ చెప్పుకోవడం హాస్యాస్పదం. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కనకదుర్గ ఫ్లై ఓవర్ గురించి మాట్లాడినప్పుడు నానీ ఆయనకు కాగితా లు అందించి ఉండొచ్చుగానీ, దాని నిర్మాణంలో నానీ పాత్ర శూన్యం. విజయవాడ పార్లమెంట్ పరిధి లోని ఏడు నియోజకవర్గాల్లో నానీని పట్టించుకునే నాథుడే లేడు. అవినీతి, దోపిడీ, కుంభకోణాల్లో కూరుకుపోయిన వైసీపీలో చేరిన నానీ కూడా త్వరలోనే రాజకీయ జీవితానికి ముగింపు పలికి పాతాళంలోకి కూరుకు పోవడం ఖాయం.
ఏ రోటికాడ ఆ పాట పాడే నానీ లాంటి వారిని ప్రజలు పట్టించుకోరు మరలా జగన్ కు ఓటేస్తే రాష్ట్రం ఖాళీ అని ప్రజలు గ్రహించారు
టీడీపీలో ఉన్నప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి కేవలం 25 స్థానాలు మాత్రమే వస్తాయన్ననానీ, ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాక టీడీపీకి 40 స్థానాలు మాత్రమే దక్కుతాయంటున్నాడు. ఏ రోటికాడ ఆ పాట పాడే నానీ లాంటి వారిని ప్రజలు పట్టించుకోరు. రాష్ట్రమంతా తమ బతుకులు, తమ బిడ్డల భవిష్యత్ బాగు పడాలని కోరుకుంటోంది. ప్రజలంతా చంద్రబాబు గెలిస్తేనే తమకు భవిష్యత్ అని గట్టిగా నమ్ముతున్నారు. మరలా జగన్ రెడ్డికి ఓటేస్తే రాష్ట్రం ఖాళీ అవుతుందని ప్రజలకు అర్థమైంది.
టీడీపీ రా..కదలిరా సభకు వచ్చిన జనాన్నిచూసి గుడివాడ నానీకి గుండెలు అదిరిపోయాయి. కొడాలినానీ ఎప్పుడూ గుడివాడలో ఉండడు. సభకు వెళ్లిన మేమే 2 కిలోమీటర్లు నడిచి సభా ప్రాంగణానికి వెళ్లాం. నానీ జబ్బుతో బాధపడుతూ.. చంద్రబాబు సభకు జనమే రాలేదంటే ఎవరు నమ్ముతారు? నందమూరి తారకరాముడిని గెలిపించిన గుడివాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో రాముని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నానీ చేసిన పనులు…అతని బూతు లతో గుడివాడ ప్రజలు సిగ్గుతో చచ్చిపోతున్నారు. తాను గెలవనని అర్థమయ్యే నానీ నోటికి పనిచెబుతూ పబ్బం గడుపుకుంటున్నాడు.” అని నాగుల్ మీరా ఎద్దేవా చేశారు.