అమరావతి : అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ కార్యాలయం ఇచ్చిన నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పందించలేదు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే..అయితే విచారణకు హాజరుకాకూడదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే లు నిర్ణయించారు. తుది విచారణకు హాజరుకాకపోతే స్పీకర్ తీసుకునే నిర్ణయానికి బాధ్యులు అవుతారని నోటీసుల్లో పేర్కొన్నారు.
పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, చానల్స్‌లో వచ్చిన విజువల్స్‌ను ఆయా సంస్థల యాజమాన్యాలు సర్టిఫై చేయాల్సి ఉందని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గత విచారణ సందర్భంగా ఆనం తన వాదనలు వినిపించారు. ఆయా సంస్థలు సర్టిఫై చేయకుండా వారిని ఎలా పరిగణలోకి తీసుకుంటారని రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు తాము హాజరుకావడం లేదని స్పీకర్ కార్యాలయానికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు సమాచారం పంపించారు.
మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో విచారణకు రాకపోవడంతో వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా బాలవీరంజనేయ స్వామి కోరారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్వామి విజ్ఞప్తి చేశారు.