– గిరిజన ప్రాంతాల అభివృద్ధే చంద్రబాబు ధ్యేయం
– గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా గతంలో చంద్రబాబు పనిచేశారు
– జగన్ పాలనలో గిరిజన సంక్షేమ పథకాలు రద్దు చేశారు
– గిరిజనుల భవితవ్యం చంద్రబాబు గెలుపుతో సాధ్యం
– లీడర్ అంటే చంద్రబాబా? జగనా?
– గిరిజన మహిళల ముఖాముఖిలో భువనేశ్వరి వ్యాఖ్య
నిజం గెలవాలి – పాడేరు
గిరిజన ప్రాంతాల అభివృద్ధే చంద్రబాబు ధ్యేయమని, గిరిజిన ప్రాంతాలపై చంద్రబాబుకు ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పాడేరు నియోజకవర్గ పర్యటన సందర్భంగా పాడేరులోని గిరిజన మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ….
గిరిజనులకు చంద్రబాబు పథకాలు తెస్తే జగన్ రద్దు చేశాడు
గిరిజనులు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలనే దూర దృష్టితో చంద్రబాబు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. గిరిజనులు విదేశాల్లో చదువుకోవాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని అమలు చేశారు. గిరిజన గర్భిణీలు, బాలింతలకు గిరిగోరుముద్ద, చిన్నారులకు బాలామృతం పథకాలు అమలు చేశారు. పుట్టిన బిడ్డల కోసం ఎన్టీఆర్ బేబీకిట్ పథకాన్ని అమలు చేశారు.
ప్రసవించిన అనంతరం తల్లిబిడ్డను ఇంటికి సురక్షితంగా చేర్చేందుకు తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ పథకాన్ని అమలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్సులు పెట్టి వైద్యసదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు. గిరిజన బిడ్డల కోసం బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేశారు. ఇలాంటి మంచి మంచి పథకాలను జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రద్దు చేసి గిరిజనులకు సంక్షేమాన్ని దూరం చేశాడు. వైసీపీ ప్రభుత్వం పని రద్దు చేయడం, కూలదోయడమే.
అరకును ప్రమోట్ చేసిన వ్యక్తి చంద్రబాబు…:
అరకు ప్రాంతం విశిష్టతను ఈ దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పేందుకు చంద్రబాబు ఎంత కష్టపడ్డారో అరకు ప్రాంతం ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు గిరిజన ప్రాంతాలకు చేసిన అభివృద్ధిపై నాకు దాదాపు పావుగంట పాటు వివరించారు.
తెలుగుదేశం పాలనలో అభివృద్ధిలో దూసుకుపోయిన గిరిజన ప్రాంతాలు నేడు సరైన రోడ్లు కూడా లేని దుస్థితికి వచ్చాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అరకు అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది అరకు కాఫీ…అరకు కాఫీ అభివృద్ధికి చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహం గతంలో ఎవరూ ఇవ్వలేదు…వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు.
అరకు ప్రాంతంలో పండే పంటలకు అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లో గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబుది. అరకు కాఫీకి యూకే, ప్యారీస్, ఇతర దేశాల్లో ప్రమోట్ చేసి అంతర్జాతీయంగా అరకు కాఫీకి ఖ్యాతిని సంపాదించిన వ్యక్తి చంద్రబాబు.
కుటుంబాన్ని, సన్నిహితులను ప్రక్కనపెట్టి రాష్ట్రం కోసం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం చంద్రబాబు కష్టపడి పనిచేశారు.
గిరిజనులు కూడా చంద్రబాబుపై ఎనలేని ప్రేమాభిమానాలు చాటుకున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో గిరిజన ప్రాంతాలన్నీ తల్లడిల్లాయి. శాంతియుత ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేసి మాకు అండగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వం శాంతియుత నిరసనలు చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపింది…మహిళలను స్టేషన్లకు తీసుకెళ్లి అర్ధరాత్రి వరకు స్టేషన్లలోనే నిర్బంధించి కర్కశంగా వ్యవహరించారు.
జగన్ పాలనలో గంజాయి, లిక్కర్, శాండ్ మాఫియాలో ఏపీ నంబర్ వన్:
చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన, యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు తీసుకురావడంలో నంబర్ వన్ గా ఉండేది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీని గంజాయి, డ్రగ్స్, కల్తీ లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మహిళలపై అఘాయిత్యాలు, రైతుల ఆత్మహత్యల్లో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రజలకు తాత్కాలిక పథకాలను ఇచ్చి, దీర్ఘకాలిక ప్రయోజనాలను దూరం చేస్తున్న మోసకారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.
ప్రశ్నిస్తున్నారనే చంద్రబాబు అరెస్టు:
వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్నారనే కోపంతో చంద్రబాబుపై ఆధారాలు లేని కేసులు పెట్టి అక్రమంగా 53రోజులు జైల్లో నిర్బంధించారు. చంద్రబాబును అరెస్టు చేసి మా కుటుంబాన్ని, చంద్రబాబును రోడ్డుమీదకు రాకుండా చేయాలని జగన్ ప్రభుత్వం కుట్ర చేసింది.
చంద్రబాబు, మేము ఎక్కడా అధైర్యపడలేదు…చంద్రబాబు అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మనస్తాపంతో మరణించిన కార్యకర్తల గురించి చంద్రబాబు జైల్లో ఉండి ఆలోచించారు తప్ప అప్పుడు కూడా మా కుటుంబం గురించి ఆలోచించలేదు. చనిపోయిన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి, పరామర్శించి వారికి పార్టీ అండగా నిలబడుతుందనే ధైర్యాన్ని నింపాలని చంద్రబాబు తాను కష్టంలో ఉన్న సమయంలో నాతో చెప్పారు. పార్టీ అంటే, కార్యకర్తలంటే చంద్రబాబుకు అంత ప్రాణం..ఆయన బలం కార్యకర్తలు, మహిళలు. చంద్రబాబును మరిన్ని కేసుల్లో ఇరికించి ప్రజలకు దూరం చేయాలని వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు పన్నింది కానీ…వాళ్ల వల్ల కాలేదు.
లీడర్ అంటే చంద్రబాబా? జగనా?:
ప్రజల కోసం ఏ కష్టమొచ్చినా నిలబడి, పోరాడి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేవాడే నిజమైన లీడర్. ఏ తప్పూ చేయకుండా, కుటుంబాన్ని సైతం ప్రక్కనపెట్టి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపించిన వ్యక్తి చంద్రబాబు.
కష్టకాలంలో ఉండి కూడా ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై, ప్రభుత్వ దోపిడీ విధానాలపై పోరాడిన వ్యక్తి చంద్రబాబు. డబ్బులు కోసం, తమ ఖజానాలు నింపుకోవడం కోసం అడ్డొచ్చిన వారిని తొలగించుకుంటూ వెళ్లేవారిని ఏమనాలి?
వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి డబ్బు ఎక్కడుంటే అక్కడుంటారు. పేదలు, బడుగు బలహీన వర్గాలు, అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన వర్గాల పక్షాన నిలబడే వ్యక్తి చంద్రబాబు. 2014-19 పాలనలో ఏపీకి అనేక పరిశ్రమలు, కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు తీసుకొచ్చిన కంపెనీలను కమీషన్ల కోసం వేధించి ప్రక్కనున్న రాష్ట్రాలకు వాటిని తరిమేసి రాష్ట్ర యువతను నిరుద్యోగులుగా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
రాష్ట్ర ప్రజలు నేడు మన చేతిలోకి ఎన్ని డబ్బులు పథకాల ద్వారా వచ్చాయి అనేది కాకుండా…దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేసే నిజమైన నాయకుడు ఎవరో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రజలే లీడర్ ఎవరో, దోపిడీదారుడు ఎవరో తేల్చుకోవాలి.
వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ శూన్యం
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర మహిళలకు రక్షణ కరువైంది. పంచాయతీ పంపు రావడం లేదని, ప్రభుత్వ అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని తమ సమస్యకు పరిష్కారం చూపాలని చిత్తూరుజిల్లా, బంగారుపాళ్యం కు చెందిన హంసవేణి టీడీపీ నేతలకు ఫిర్యాదు చేసింది. తమకు వ్యతిరేకంగా టీడీపీ నేతలకు ఫిర్యాదు చేసిందనే కోపంతో అక్కడి వైసీపీ నేతలు హంసవేణి రెండు కళ్లను పీకేశారు.
హంసవేణికి ఓ వికలాంగుడైన కుమారుడు ఉన్నాడు…భర్త లేడు. ఈ కుటుంబానికి దిక్కెవరు? ఆ కుటుంబం ఎలా బ్రతకాలి? ఇవేవీ వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి పట్టవు. తమను ప్రశ్నిస్తే, తమకు అడ్డొస్తే మహిళలు అని కూడా చూడకుండా దాడులు, అకృత్యాలకు పాల్పడుతున్నారు. జగన్ పాలనలో మహిళలపై దాడుల్లో ఏపీని ముందు వరుసలో నిలబెట్టారు.
మహిళల మిస్సింగ్ కేసులు ఏపీలోనే ఎక్కవ నమోదవుతున్నాయి. మహిళలంతా ఒక్కసారి ఆలోచించాలి…చంద్రబాబు పరిపాలనలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదు. ఎవరి పరిపాలన వస్తే మహిళలు సురక్షితంగా, ధైర్యంగా ఉంటారో మహిళలే తేల్చుకోవాలి.
మహిళాశక్తి చాలా బలమైనది…మహిళలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు. పురుషులకు మహిళలు ఎందులోనూ తీసిపోరు అనే విషయాన్ని ప్రతి మహిళ గుర్తుపెట్టుకోవాలి.
నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలపై హింసాకాండ
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ కార్యకర్తలపై దాడులు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అవినీతిని, దోపిడీ విధానాలను ప్రశ్నించిన వారిని వైసీపీ నేతలు దారుణంగా చంపేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలను, కల్తీ మద్యాన్ని ప్రశ్నించిన కార్యకర్తలను వైసీపీ నేతలు అత్యంత క్రూరంగా రోడ్డుపైనే చంపేశారు.
నాలుగున్నరేళ్లలో టీడీపీ కార్యకర్తలపై దాడి జరగని రోజు లేదు. అక్రమ కేసులు పెట్టి జైళ్లలో మగ్గబెడుతున్నారు. టీడీపీ కార్యకర్తలంతా ఒక్కటవ్వాల్సిన సమయం వచ్చింది. రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తును నిలబెట్టుకునే అవకాశం త్వరలో మన చేతికి రాబోతోంది. రానున్న ఎన్నికలను ప్రశాంతంగా, నిజాయితీగా జరిగేలా ప్రతి కార్యకర్త చొరవ తీసుకోవాలి.
రాష్ట్రం బాగుండాలనే భార్య,బిడ్డను వదిలి లోకేష్ పాదయాత్ర
వైసీపీ చేతిలో నలిగిపోతున్న రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రచేయాలని నిర్ణయించుకుని మాతో చెప్పాడు. పదవుల కోసం కుటుంబ సభ్యులనే చంపుకుంటున్న ఈ వైసీపీ నేతలు..పాదయాత్ర చేస్తే ఏమైనా చేస్తారేమో అని భయపడ్డాను. రాష్ట్ర యువత, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే అన్ని వర్గాలను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో లోకేష్ ను ఆశీర్వదించి ముందుకు పంపించాను.
226రోజులు, 3132 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేశాడు…ఇది సామాన్యమైన విషయం కాదు. భార్య, చిన్న బిడ్డను వదిలేసి 8నెలలు రోడ్డుపైనే లోకేష్ మీలో ఒకడిగి తిరిగాడు. అన్నివర్గాల ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకున్నాడు…వారికి బంగారు బాటలు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.
ఎన్నికల్లో అడ్డు తగిలితే తొక్కుకుంటూ ముందుకెళ్లడమే
రానున్న ఎన్నికలు చాలా ముఖ్యమైనవి…రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవి. దోపిడీదారులు మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలంతా ఏకతాటిపైకి రావాలి…పార్టీని గెలిపించుకునేందుకు ముందుకు కదలాలి. ఎన్నికల్లో అధికారపార్టీ ఏదైనా అవకతవకలకు పాల్పడితే సైకిల్ తొక్కుకుంటూ ముందుకెళ్లినట్లు అవినీతిపరుల ఆగడాలను తొక్కుకుంటూ ముందుకెళ్లిపోవాలి. ఎక్కడా వెనకడుగు వేయొద్దు.
రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని బలంగా వాడాలి…ప్రజావ్యతిరేకులను ఓటు అనే ఆయుధంతో ఓడించాలి. రాష్ట్రం బాగుపడాలంటే…యువత, మహిళల భవిష్యత్తు బాగుండాలంటే పసుపుజెండా ఎగరాలి..చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. గిరిజనుల భవితవ్యం చంద్రబాబు గెలుపుతోనే సాధ్యం అని ప్రతి గిరిజన బిడ్డ గుర్తు పెట్టుకోవాలి.
నేను శాశ్వతం కాదు…ఈ రాష్ట్రం శాశ్వతం: రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సందేశం
‘‘మీ పిల్లలు పెద్దవాళ్లు అయ్యేసరికి నేను ఉంటానో లేదో తెలియదు. కానీ ఈ తరం బాగుండాలి, వచ్చే తరం చల్లగా ఉండాలనేదే నా ఆలోచన. రాష్ట్ర కుటుంబ పెద్దగా దీన్ని నా బాధ్యతగా భావిస్తున్నాను. నేను శాశ్వతం కాదు…ఈ రాష్ట్రం శాశ్వతం..పూర్తవ్వనున్న పోలవరం శాశ్వతం…నిర్మితమవుతున్న అమరావతి శాశ్వతం…రాయలసీమలో పారే నీరు శాశ్వతం…మాతృభాష శాశ్వతం..తెలుగుతల్లి, తెలుగునేల శాశ్వతం…అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను.’’ అని చంద్రబాబు ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ఆయనకు కుటుంబం, పదవులు ముఖ్యం కాదు. ఈ రాష్ట్రం, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు ముఖ్యం. అంతిమ నిర్ణయం మీదే…