Suryaa.co.in

Andhra Pradesh

పల్నాడులో జగన్ రక్తం పారించారు, నేను నీళ్లు పారిస్తా

-అభివృద్దికి మారుపేరు టీడీపీ, విధ్వంసానికి ప్రతిరూపం వైసీపీ
-పల్నాడులో నరహంతకుల్ని ఎవరినీ వదలిపెట్టను
-జగన్ తో వేగలేక 6 మంది ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు
_వరికెశెలపూడి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత టీడీపీ – జనసేనదే
-క్లీన్ ఇమేజ్ ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వంటి నేతల్నే పార్టీలో చేర్చుకుంటాం
-గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ కుడి కాలువకి తెస్తాం
-రా..కదలిరా సభలు సూపర్ హిట్, జనసేన టీడీపీ పొత్తు బంపర్ హిట్
-గురజాల నియోజకవర్గ రా..కదలిరా సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం నాడు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో నిర్వహించిన రా..కదలిరా సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ……నేడు వైసీపీ ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లు టీడీపీలో చేరారు.

స్వలాభం కోసం కాకుండా ప్రజా సేవ కోసం వీరు పార్టీలో చేరారు. మీ అందరి ఆమోదంతోనే ఐవీఆర్ ఎస్ సర్వే నిర్వహించి వీరిని పార్టీలో చేర్చుకున్నాం. రేపు మరో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పార్టీలో చేరుతున్నారు. వైసీపీ లో సీటు కావాలంటే డబ్బులు కట్టాలి, చంద్రబాబు, పవన్ ని తిట్టాలన్నారు. అవన్నీ మేం చేయలేమని వీరు టీడీపీలో చేరారు.

వరికెశెలపూడి ప్రాజెక్టుకి లావు కృష్టదేవరాయలు అన్ని అనుమతులు తెచ్చారు. దాన్ని పూర్తి చేసే బాధ్యత టీడీపీ జనసేనదే. అభివృద్దికి మారుపేరు టీడీపీ, విధ్వంసానికి ప్రతిరూపం వైసీపీ. పల్నాడులో నాకు ప్రాణసమానమైన నాయకులు, కార్యకర్తల్ని పోగుట్టుకున్నాను.పల్నాడు పులి కోడెల శివప్రసాద్ ని మానసికంగా వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారు. ఎంతో మంది కార్యకర్తలు టీడీపీ జెండా కోసం ఇక్కడ బలయ్యారు.

తోట చంద్రయ్య జై తెలుగుదేశం అంటూ ప్రాణాలొదిలారు. అలాంటి కార్యకర్తల్ని నా జీవితంలో మర్చిపోను. జంగమహేశ్వరపాడులో జల్లయ్య యాదవ్, దాచేపల్లిలో పురంశెట్టి అంకుల్, అంబాపురంలో దోమతోటి విక్రమ్, నరసరావుపేటలో మైనార్టీ సోదరుడు ఇబ్రహీంను చంపారు. నకరేకల్ లో మంత్రిబాయి అనే ఎస్టీ మహిళను అప్పు తీర్చనందుకు ట్రాక్టర్ తో తొక్కించి చంపారు. నిన్న రెంటచింతల మండలం మల్లవరంలో సామినిబాయిని నీళ్లు అడిగితే ట్రాక్టర్ తో తొక్కి చంపారు.

ఇవన్నీ నేను మర్చిపోను. గురజాలలో 11 మంది, మాచర్లలో 8 మందిని జిల్లా వ్యాప్తంగా 30 మంది టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు పొట్టనపెట్టుకున్నారు. గ్రామాల్లో ఉండనీయకుండా టీడీపీ కార్యకర్తల్ని వేధించారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఖబడ్డార్…నేను కన్నెర్ర చేస్తే వైసీపీ నేతలు బయట తిరగలేరు. పల్నాడులో నరహంతకుల్ని ఎవరినీ వదలిపెట్టను.

పల్నాడు పరిరక్షణ కోసం కుల,మత,పార్టీలకతీతంగా ప్రజలంతా ఏకమవ్వాలి. 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా…నాపై అనేక అక్రమ కేసులు పెట్టారు, నా ఇంటికి తాళ్లు కట్టిన నాడే…అవి జగన్ ప్రభుత్వానికి ఉరితాళ్లని చెప్పాను. పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ ప్రతి సారి మాట్లాడుతుంటే…నాలుగో భార్య నువ్వే జగన్ అంటూ పవన్ అన్నారు. జగన్ కి సిగ్గుందా? బుల్లెట్ దిగిందా అన్న వ్యక్తి బుల్లెట్ దిగి నెల్లూరు నుంచి నరసరావుపేటలో వచ్చి పడ్డాడు.

ఇక్కడ ప్రజలు మళ్లీ బుల్లెట్ దించితే రేపు చైన్నై లో పడతాడు. వైసీపీ పని అయిపోయింది, ఇక పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఏ తప్పు చేయని ప్రత్తిపాటి పుల్లారావు కొడుకుని అరెస్ట్ చేశారు, మరి జగన్ చేసిన నేరాలు, ఘోరాలకు ఏం శిక్ష వేయాలి? జగన్ బెదిరింపులకు భయపడేవారెవరూ లేరు.

నేను ప్రజాస్వామ్యవాదిని నా దగ్గర పులివెందుల పంచాయితీలు చేస్తే…కుర్చీని మడచినట్టు మడచి నీ ఊరికి పంపిస్తా. జగన్ దేనికి సిద్దం ఓడిపోవడానికా? 6 మంది ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి దగ్గర ఉండలేక వచ్చిన వీరందరికీ అభినంధనలు. పల్నాడుకి జగన్ కి ఏం చేశారు? యువతకు ఉధ్యోగాలు ఇచ్చారా? ఒక్క పరిశ్రమ తెచ్చారా?

పల్నాడుకి నీళ్లిచ్చే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశాడా? నాగార్జున సాగన్ నుంచి నకిరేకల్ కి నీళ్లు తేవాలని నేను ప్రారంభించిన గోదావరి లిప్ట్ ఇరిగేషన్ ని ఆపేశారు. దాన్ని పూర్తి చేసే బాధ్యత టీడీపీ జనసేనదే. వరికెలపూడిసెల లిప్ట్ ఇరిగేషన్ ని ఏడాదిలో పూర్తి చేస్తాం. రూ. 600 కోట్లతో త్రాగునీటికోసం వాటర్ గ్రిడ్ తెస్తే…దాన్ని పూర్తి చేయలేకపోయారు. మేమే దాన్ని పూర్తి చేస్తాం. జగన్ మాయమాటలతో ప్రజల కడుపు నిండుతుందా?

టీడీపీ హయాంలో పల్నాడులో దాడులున్నాయా? నేడు ఇంటికొక సైకో తయారయ్యాడు. బలహీన వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. వీరిపై దాడులు జరుగుతుంటే అనిల్ కుమార్ ఎక్కడున్నాడు? బడుగు,బలహీన వర్గాలు పుట్టింది తెలుగుదేశంలోనే వారి నర నరాల్లో టీడీపీ జీర్ణించుకుపోయింది. వారిని కాపాడుకునే బాధ్యత టీడీపీ జనసేనదే. మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి పులిలా తిరుగుతుంటే…మేకలు పారిపోతున్నాయి.

మాచర్ల నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు స్టేషన్ లో కాళ్లు పైకి వేలాడ తీసి కొట్టారు. ఇది నేను మర్చిపోతానా? గురజాల నియోజకవర్గంలో 11 మంది కార్యకర్తలను చంపినపుడు యరపతినేని శ్రీనివాసరావు పడ్డ బాధ, ఆవేధన నా కళ్ల ముందు ఇంకా కన్పిస్తూనే ఉంది.

కార్యకర్తల కోసం ఎన్నో త్యాగాలకు సిద్దపడ్డ బ్రహ్మారెడ్డి, యరపతినేనిని నేను మర్చిపోలేను. టీడీపీలో కులాలు, మతాలు లేవు. ఎవరినైనా చంపి పోస్టు మార్టంకి పంపిస్తే.. వాళ్లది పోస్టు మార్టం బ్రతుకే. మీరు నీతిగా ఉంటే మేం నీతిగా ఉంటాం. వైసీపీ పని అయిపోయింది, నూటికి వెయ్యి శాతం టీడీపీ జనసేనదే గెలుపు. ఇప్పుడు వీస్తున్న ఈ గాలి తుఫాన్ గా మారుతుంది. ఈ తుఫాన్ కి ఎవరైనా అడ్డొస్తే కొట్టుకుని పోవటం ఖాయం. మా తపనంతా ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసమే.

హు కిల్డ్ బాబాయి..జగన్ ఇప్పటికైనా సమాధానం చెప్పి ఓటు అడగాలి. హత్యలు చేసే వాళ్లు రాజకీయాలకు పనికిరారని జగన్ కి ఓటెయెద్దని సొంత చెల్లెలే చెప్పింది. వివేకాను చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ డ్రామాలాడారు. ఆస్తి కోసం సొంత చెల్లెల్నే గెంటేశాడు. అలాంటి వ్యక్తి మీకు న్యాయం చేస్తాడా?

జగన్ , ఆయన చెల్లెలు వ్యక్తిగత గొడవలు, ఆస్తి తగాదాలు వారిద్దరే చూసుకోవాలి. మద్యలోకి నన్ను లాగొద్దు. తల్లిని విమర్శించేవారిని ఏమనాలి? అలాంటి వాళ్లకు సపోర్ట్ చేయాలా? వైసీపీకి ఉంది 40 రోజులే. జగన్ ని ఇంటికి పంపేందుకు జనం సిద్దంగా ఉన్నారు. పెత్తందారులకు పేదలకు మద్య యుద్దం అంటూ జగన్ మాయమాటలు చెబుతున్నారు.

పేద అరుపులు అరుస్తున్న జగన్ రెడ్డికి బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, చెన్నై, ఇడుపులపాయలో ప్యాలెస్ లు ఉన్నాయి. ఇప్పుడు రుషికొండకు గుండు కొట్టేసి రూ.500 కోట్లతో మరో ప్యాలెస్ కట్టుకున్నాడు. ప్రజలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కనీసం నేను కట్టిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేయకపోగా వాటిని తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చాడు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.1.50 లక్షల సాయం తప్ప ఇళ్ల నిర్మాణానికి జగన్ ఒక్క పైసా ఇవ్వలేదు. టీడీపీ హయాంలో కేంద్ర సాయానికి తోడు ఒక్కో లబ్దిదారుడికి గ్రామాల్లో రూ.50 వేలు, పట్టణాల్లో లక్ష రూపాయిల సాయం అందించాం.

వైసీపీ పాలనలో నిత్యవసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, మద్యం రేట్లు పెరిగాయి. నాసిరరకం మద్యంతో ఆడబిడ్డలు తాళిబొట్టును తెంచేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డికి ఓటు అడిగే అర్హత లేదు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల ఆస్తుల కంటే జగన్ ఆస్తే ఎక్కువ. కాన ఈయన పేదవాడంటా? సాక్షి పత్రిక తనది కాదంటున్నాడు. మరెవరిది? పేద వాడి గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు.

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి తలసరి ఆదాయం వ్యత్యాసం ఉంది. హైదరాబాద్ అభివృద్ధికి ఫౌండేషన్ వేసింది నేనే. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్ కట్టిందెవరు అని ఎవరినడిగినా నా పేరే చెప్తారు. దానికంటే మిన్నగా అమరావతిని తీర్చుదిద్దుదాం అనుకున్నా. 2029 నాటికి అమరావతి, పోలవరం పూర్తి చేసి, నదుల అనుసందానంతో ప్రతి ఎకరాకి నీళ్లు ఇచ్చి, ఉద్యోగాలు ఇద్దామని కలలు కన్నాను.

కానీ ప్రజలు ఒక్క ఛాన్స్ అని ముద్దులకు మోసపోయి ఇప్పుడు జగన్ చేతిలో గుద్దులు తింటున్నారు. నేను పవన్ రాష్ట్రాన్ని కాపాడాలనే ధృడ సంకల్పంతో పని చేస్తున్నాం. నీ ఆటలు సాగనివ్వం జగన్! మాలో విభేదాలను పెట్టలేవు. నాది, పవన్ కళ్యాణ్ ఆలోచన, దారి ఒకటే. అదే 5 కోట్ల ప్రజలు గెలవాలి – సైకో జగన్ పోవాలి. అందుకు ప్రజలు సిద్ధం.

బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ
ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంతమంది మహిళలుంటే వారికి నెలకు రూ. 1500 ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్దులున్నా ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేలిస్తాం. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. యువగళం నిధి కింద నెలకు రూ. 3 వేలు యువతకు నిరుద్యోగ భృతి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. యువత సైకిలెక్కి టీడీపీ జనసేన జెండా పట్టి ప్రజలను చైతన్యం చేయాలి.

అన్నదాత కింద రైతుకు ఏడాదికి రూ. 20 వేలిస్తాం. కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరిస్తాం. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నది ఎన్టీఆర్ కల. దాన్ని నిజం చేస్తాం. కుటుంబ వికాసం, జన్మభూమి స్పూర్తితో పేదల్ని ధనికులుగా చేస్తాం. దీనికి మీ అందరి సహకారం కావాలి.బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం బీసీ డిక్లరేషన్ ను మార్చి 5న ప్రకటన చేస్తున్నాం.

దోపిడిదారులు వైసీపీ ఎమ్మెల్యేలు
మాచర్లలో మారీచుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెయ్యని దోపిడి లేదు. చేయని కబ్జా లేదు. హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ప్యాలెస్ ను కట్టుకుంటున్నాడు. మాచర్ల దారిలో గ్రానైట్ లారీలు వస్తే ఇతనికి కప్పం కట్టాల్సిందే. మాచర్ల ఇతని అబ్బ సొమ్ము అనుకుంటున్నాడా? ఎస్సీ ఎమ్మెల్యేలను మార్చడం కాదు జగన్ రెడ్డి.. నీకు చెతనైతే మారీచుడు పిన్నెల్లిని మార్చు. మారీచుడు తమ్ముడు దందాలు మొత్తం అతనే చూసుకుంటాడు.

అక్రమ మద్యం, రేషన్ మాఫియాకు కేరాఫ్ అతను. తెలంగాణ మద్యం ఏరులై పారుతుంటే జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మాచర్లలో 150 ఎకరాలు, 7 ఎకరాల వినాయకుడు గుడి భూమి, వెల్దుర్తిలో 30 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి వెంచర్లు వేసి అమ్ముకుంటున్నారు. గురజాలలో కాసుల మహేష్ రెడ్డి పేరును సార్ధకం చేసుకున్నాడు. సున్నపు రాయి, ముగ్గు రాళ్ల వ్యాపారం ఏది దొరికితే అది అన్నట్లు దోచుకున్నాడు.

ఆ డబ్బుతో గురజాల, నరసరావుపేటలో షాపింగ్ మాల్స్ కడుతున్నాడు. వినుకొండలో బొల్లా బ్రహ్మ నాయుడి అరాచకాలన్నీ రాసుకుంటున్నా. ఎమ్మెల్యే ట్యాక్స్ ను ప్రజలు భరించలేక వణికిపోతున్నారు. 3 ఎకరాల ముస్లీంల భూమి, తెల్లపాడులో 8 ఎకరాల ఆర్యవైశ్యల భూమి, బ్రాహ్మణపల్లిలో 170 ఎకరాల జాగాను కబ్జా చేశాడు. అక్రమ భూ పట్టాల ద్వారా రూ.100 కోట్లు దోచుకున్నాడు.

పేద వాడి ఇంటి జాగాను కూడా బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి డబ్బులు గుంజుకున్నాడు. గిట్టు బాట ధర అడిగిన రైతును చెప్పుతో కొడతా.. జైల్లో పెడతానంటున్నాడు. మా రైతులు అనుకుంటే శాశ్వతంగా నిన్ను జైల్లో పెడతారు జాగ్రత్తా బొల్లా గుర్తుంచుకో. పెదకూరపాడులో శాండ్ శంకర్రావు మాఫియా కృష్ణ నదినే తవ్వేసింది. రోజుకు రూ.30 కోట్లు ఇసుక దోచుకుంటున్నాడు. దీనిలో జగన్ రెడ్డికి వాటా ఉంది.

400 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకున్నాడు. నరసరావుపేటలో గోపిరెడ్డి అరాచక వాది. ప్రతీ పనికి కప్పం కట్టాల్సిందే ఇతనికి. చిలకలూరిపేటలో సైబరాబాద్ మొక్క రజినికిఓడిపోయే గుంటూరు-2 సీటు ఇచ్చారు. సైబారాబాద్ మొక్క మళ్లీ సైబారాబాద్ కే పోతుంది. ఒక ఊర్లో చెత్త మరో ఊర్లో బంగారమవుతుందా? దోపిడిదారులు మనకు అవసరమా? గంజాయి వనంలో తులసి మొక్క శ్రీకృష్ణదేవరాయలు అక్కడ ఉండలేక తులసివనంలోకి వచ్చాడు.

పల్నాడు జిల్లాకు హామీలు
నాగార్జున సాగన్ రైట్ కెనాల్ కి గోదావరి నీళ్లు తెస్తాం. వరికెసెలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. వాటర్ గ్రిడ్ పూర్తి చేసి ఇంటింటికి త్రాగునీరిస్తాం. బుగ్గవాగు నుంచి గ్రావిటీ ద్వారా దాచేపల్లి, పిడుగురాళ్లకు పట్టణానికి నీళ్లిస్తాం. తంగెడ,కొత్తపాలెం, పెల్లుట్ల గ్రామాలకు లిప్ట్ ఇరిగేష్ ఏర్పాటు చేసి నీరిస్తాం. గురజాలలో టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లన్నీ పూర్తి చేసి ఇస్తాం.

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతాం. రోడ్లకు మహర్ధశ తీసుకొస్తాం. సమసమాజ స్ధానకు చాపకూడు పల్నాటి బ్రహ్మనాయుడు. ఆ స్పూర్తితో కుల,మత, ప్రాంతాలకు అతీతరంగా ప్రజలు ఏకమవ్వాలి. పల్నాడులో పారాల్సింది రక్తపాతం కాదు, నీళ్లు. పల్నాడు బ్రహ్మనాయుడు స్పూర్తితో 40 రోజులు టీడీపీ,జనసేన కార్యకర్తలతో పాటు ప్రజలంతా కుల,మత ప్రాంతాలకు అతీతంగా ఏకమై వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి టీడీపీ జనసేనను గెలిపించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

 

LEAVE A RESPONSE