Suryaa.co.in

Andhra Pradesh

మరికొందరు కోవర్టులు ఏమైనా వైసీపీలో చేరబోతున్నారా?

– కాపులకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్ షేరింగ్ ఇస్తున్నారా?
– నిన్నటి వరకు మీరు అడిగింది అదే కదా?
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

తెదేపా, జనసేన పొత్తు లో భాగంగా కాపులకు 70 సీట్లకు తగ్గకుండా ఇవ్వాలని, రెండున్నర ఏళ్ల పాటు పవర్ షేరింగ్ ఇవ్వాలని ప్రతిపాదించిన నాయకులకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్ షేరింగ్ ఇస్తున్నారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

చేగొండి సూర్య ప్రకాష్, పేర్ని నాని కుమారుడు, ఇంకా ఎవరైనా కాపు నేతలకు రెండున్నర ఏళ్ల పాటు పవర్ షేరింగ్ చేస్తానని జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించారా? అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించవచ్చునని, ఎందుకంటే ఆయన గెలిచేది లేదు… చచ్చేది లేదన్నారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కాపులను మభ్యపెట్టడానికి పవర్ షేరింగ్ చేస్తానన్న హామీ ఇచ్చేయమ్మ జగన్, ఇచ్చేయ్ ఎలాగో మనము నెగ్గేది లేదు కదా?

చేగోండి సూర్య ప్రకాష్ కు, లేకపోతే మీకు నచ్చిన కాపు నాయకుడికి రెండున్నర ఏళ్ల పాటు అధికారం ఇచ్చేయండి అంటూ అపహాస్యం చేశారు. ప్రజా సంక్షేమం కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా 24 స్థానాలను తీసుకుని కూడా తగిన న్యాయం చేశారు. ఆయన తీసుకున్న స్థానాలలో ఉభయగోదావరి జిల్లాలతో పాటు, విశాఖపట్నంలో కూడా ఎక్కువ స్థానాలను కాపు నాయకులకి కట్టబెట్టారు.

రాయలసీమ జిల్లాలలో ఏ పార్టీ అయిన రెడ్డి నాయకులకు టికెట్లను ఎలా కేటాయిస్తుందో, ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాలలో కాపు నేతలకు సీట్లను అలాగే ఇస్తారు. వైకాపాతో సమానంగా, జనసేన కూడా కాపులకు న్యాయం చేసిందన్నారు. ఇంతకంటే ఎక్కువగా న్యాయం చేయాలంటే ఇతర సామాజిక వర్గాల వారు ఒక కుల పార్టీగా భావించే అవకాశం ఉంది.

జనసేన కుల పార్టీ కాదు. కానీ కొంతమంది కోవర్టులు, జనసేనను కుల పార్టీగా మార్చాలని చూస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని, మంచి మనసుతో ముందుకెళ్తున్న ఎంతో తపన కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయన కొనియాడారు. పవన్ కళ్యాణ్ పై కొంతమంది లేని ప్రేమను నటిస్తున్నారు.

ఎవరికైనా కులాభిమానం అనేది మనసులో ఉంటుంది. పార్టీలో ఒక్క కులమే ఉండాలని సంకుచిత మనస్తత్వంతో , అదే కులం ఓట్లు జనసేన పార్టీకి దక్కకుండా చేయాలన్న కుట్ర చేశారు. ఇప్పుడా కుట్ర బట్టబయలు అయింది. పవన్ కళ్యాణ్ ను అమితంగా ప్రేమిస్తున్నట్టు నటించి వారే, తాడేపల్లిగూడెం వేదికగా జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన అనంతరం 24 గంటల వ్యవధిలోనే వై కాపాలో చేరడం పట్ల రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు.

ఎన్ని రోజుల నుంచి అనుబంధం ఉంటే 24 గంటల వ్యవధిలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరి ఉంటారని ప్రశ్నించారు. ఒక్కరేనా ఇంకా ఎవరైనా కోవర్టులు వైకాపాలో చేరబోతున్నారా? అన్న రఘురామకృష్ణం రాజు, సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలలో కొనసాగిన చేగొండి హరి రామ జోగయ్య సంకుచిత కులతత్త్వంతో మాట్లాడడం భావ్యం కాదన్నారు. ఆయనకు ఒక కాపులు మాత్రమే ఓట్లు వేస్తే, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పిన్నవయసులోనే జెడ్పి చైర్మన్ ఎన్నికయ్యారా? అంటూ నిలదీశారు.

వైకాపాలో ఎంపీ స్థానాలను అడిగే దిక్కేలేదు

వైకాపాలో ఎంపీ టికెట్లను అడిగే వారు లేక, ఈగలు తోలుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఎమ్మెల్యేలు తమ స్థానం నుంచి మారకపోతే, వారికి బలవంతంగా పార్టీ నాయకత్వం ఎంపీ టికెట్ కట్టబెడుతోందన్నారు. గతంలో వైకాపా ఎంపీ టికెట్ కావాలి అంటే 140 కోట్ల రూపాయలు అడిగారన్న వాదనలు వినిపించాయి. ఇప్పటికే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు తెదేపాలో చేరారు.

ఒక్కరు కూడా వైకాపాలో ఎంపీ సీటు అడగడం లేదు. ఎందుకు అడగడం లేదంటే, వైకాపా ఓడిపోవడం ఖాయమని అందరికీ తెలిసి పోయిందన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్దని చెబుతున్న వినకుండా ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ కట్టబెట్టారు. ఎక్కడ చిత్తూరు, ఎక్కడ ఒంగోలన్న రఘురామ కృష్ణంరాజు, నెల్లూరు టికెట్ ను కూడా విశాఖపట్నం పై అవిభాజ్యమైన ప్రేమను పెంచుకున్న విజయసాయి రెడ్డికి ఇచ్చారు.

నేను పుట్టింది నెల్లూరు లోనే అయినా, నా మట్టి విశాఖపట్నంలో కలవాల్సిందేనన్న విజయసాయి రెడ్డి కి విశాఖపట్నం అంటే అంత పిచ్చి అని ఎద్దేవా చేశారు. ఇంకా నాలుగేళ్లు రాజ్యసభ పదవీకాలం ఉన్నప్పటికీ, నెల్లూరు ఎంపీగా ఆయన్ని పోటీ చేయించడం పరిశీలిస్తే, వైకాపా నాయకత్వానికి అభ్యర్థులు దొరకడం లేదన్న విషయం అర్థమవుతుంది.

ఒంగోలులో మాగుంట సుబ్బరామిరెడ్డి, వైకాపా నాయకత్వాన్ని పని చూసుకోమ్మని చెప్పారు. గుంటూరు నుంచి పోటీ చేసిన అభ్యర్థి, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాడట. ఇక విజయవాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన అభ్యర్థిని తెచ్చుకున్నారు. నరసాపురం నుంచి గెలిచిన నేను, నాలుగేళ్ల క్రితమే ఛీ…పొమ్మన్నాను. కాకినాడ ఎంపీ వంగా గీతను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు.

ఇప్పుడు అదే స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని తెలిసి, ఇప్పుడు మరొక అభ్యర్థి కోసం ప్రయత్నాలను చేస్తున్నారు. అమలాపురం, అనకాపల్లి స్థానాల నుంచి పోటీ చేసే వారే లేరు. విశాఖపట్నం ఎంపీ ఈసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరుతున్నారట.

విజయనగరం లో అభ్యర్థి కరువు. కర్నూలు అభ్యర్థి జంప్. ఎవరిని పోటీ చేయమని అడిగినా అందరూ వద్దనే అంటున్నారు. అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి మినహా, ఎందుకంటే వారికి తప్పదు. దీనితో, వైకాపా ఎంపీ సీట్లు అడిగే వారే లేరన్నది స్పష్టమవుతోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టాలని ఉద్దేశంతో పార్టీలోనే ఉంటూ కొంతమంది కోవర్టులు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది. కోవర్టులు ఇంకా ఎంతమంది వైకాపా లో చేరుతారో, ఎంతమందికి వైకాపా నాయకత్వం సీట్లు ఇస్తుందో చూడాలన్నారు.

నీళ్లు అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తారా?

మంచినీళ్లు అడిగిన పాపానికి ఒక గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన పల్నాడు ప్రాంతంలో చోటు చేసుకుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అసలు మనం ఎక్కడ ఉన్నామని, ఈ నవశకంలోనూ ఇటువంటి మదాందులు, దుర్మార్గులు ఉంటారా?

అసలు నమ్మశక్యంగా లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తార్రా…అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామకృష్ణంరాజు, ఇదెక్కడి దారుణం అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అంటూ… నా చెల్లెళ్లు ఎస్సీలను పెళ్లాడారని, మా అంకుల్స్ అంతా ఎస్సీ లేనని పేర్కొనడం ఉత్తిత్తిదేనా? మీ తల్లిని, చెల్లిని గౌరవించినట్టేనా? అని మండిపడ్డారు.

వైకాపా నాయకుడు మంచినీటి ట్యాంకర్ ఏర్పాటు చేస్తే, నీళ్ల కోసమని తెదేపా సానుభూతిపరురాలైన ఒక మహిళ అక్కడకు వెళ్లగా ఆమెతో గతంలోనే విభేదాలు ఉన్న వైకాపా నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి, గోడకు గుద్ది చంపేశారన్నారు. వీడియోలో విజువల్సన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఇటువంటి దరిద్రుల మన పరిపాలకులా అన్న రఘురామకృష్ణం రాజు, పరిపాలకుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు మంచినీళ్లు అడిగితే, ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తారా? అంటూ నిలదీశారు.

ఆది మానవుల కాలంలో కూడా మంచి నీళ్లు అడిగితే చంపేసిన ఘటనలు చోటుచేసుకుని ఉండమన్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారని, ఒక పార్టీపై ద్వేషముతో మరొక పార్టీ నాయకుడిని చంపేసిన ఘటనలను ఎన్నో చూశాము కానీ, నీటి కోసం వచ్చిన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటనను చూడడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు.

గిరిజన మహిళను దారుణంగా హత్య చేసిన వ్యక్తిపై వెంటనే హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి హత్యలను ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఈ సమాజం మనిషివేనా అని ప్రశ్నిస్తోందన్నారు. గతంలో దౌర్జన్యాలు చేసిన వారిని మనిషివా?, పశువా?? అని ప్రశ్నించే వారిని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో మనిషివా?, ఇంకేమని అంటున్నారో ప్రజలందరికీ తెలుసునన్నారు.

పార్టీలకతీతంగా ప్రజాసేవ చేయడానికి మనం ఇక్కడ ఉన్నామని చెప్పాల్సిన జగన్ మోహన్ రెడ్డి, చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం సట్టా మార్కెట్లో వైకాపాకు 65 నుంచి 70 స్థానాలు లభిస్తాయని పందాలు కాస్తున్నారు. కానీ 40 స్థానాలకు మించి రావని మీకు తెలుసు… నాకు తెలుసునని అన్నారు. ఎన్నికల నాటికి మీ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే 20 నుంచి 15 స్థానాలకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి, ఏ బండ్లో పోతావురో అని నైజాం సర్కరోడ్ని తరిమి కొట్టినట్లే, అప్పుడు బండ్లపై, ఇప్పుడు హెలికాప్టర్ లో తిరిగే పాలకులను ప్రజలు తరిమికొడతారన్నారు. మానవత్వం ఉన్నట్లు నటించడం కాదని, మానవత్వంతో మెలగమని మీ కాలకేయులకు చెప్పాలని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు.

రాష్ట్రంలో అధ్వానంగా పడిపోయిన ఆస్తి విలువలు

రాష్ట్రంలో ఆస్తి విలువలు అధ్వానంగా పడిపోయాయని రఘురామకృష్ణం రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా డామేజ్ చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్న సమయంలో ఒక ఇంటి విలువ 14 నుంచి 15 లక్షల రూపాయలు ఉండగా, ఇప్పుడు అదే ఇంటిని ఐదు లక్షలకు అమ్ముదామన్నా కొనేవారు లేరు.

పిల్ల పెళ్ళి చేయడానికి ఇల్లు అమ్మాలని భావిస్తున్న వారికి, ఇల్లు కొనేవారు లేక నిరాశే . సదరు ఇంటి యజమానికి ఈ ప్రభుత్వం ద్వారా 40,000 లబ్ధి చేకూరగా, ఆయనకున్న మద్యం అలవాటు ద్వారా 80 వేల రూపాయలను జగన్మోహన్ రెడ్డి సర్కారు లాక్కోంది. జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి ద్వారా ఏడాదికి 13 వేల చొప్పున, ఐదేళ్లలో 60 వేల రూపాయలు ఇచ్చాడనుకుంటే, అతడి ఆస్తి విలువ 9 లక్షల రూపాయలు పడిపోయింది.

విద్యుత్ చార్జీల రూపంలో, ఆసుపత్రిలో మందుల ద్వారా, మద్యం ద్వారా ప్రజలను దోచుకున్న విషయాలపై గతంలో మాట్లాడినప్పటికీ, పతనమైన ఆస్తి విలువ గురించి ఇప్పటివరకు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడలేదని రఘురామకృష్ణం రాజు చెప్పారు.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు పాలనలో ఎకరా భూమి 50 లక్షల రూపాయలకు తక్కువగా ఎక్కడా లభించేది కాదు.. ఇప్పుడు 20 లక్షలకు కూడా కొనేవారు లేరు.

ఒక రైతుకు పది ఎకరాల భూమి ఉందనుకుంటే, అతని ఆస్తి గతంలో ఐదు కోట్లు కాగా, ఇప్పుడు రెండు కోట్ల రూపాయలకు పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ప్రజలకు 2.35 వేల కోట్ల రూపాయల సహాయం చేశానని చెప్పుకుంటున్నారు. అందులో ఆయనే సగం నొక్కేశారు. ప్రభుత్వం తరఫున చేసిన సహాయం ఎంత?, పడిపోయిన ఆస్తి విలువలు ఎంత?? అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు అని అనుకుంటే, గతంలో భీమవరంలో ఎకరం 30 లక్షలు ధర పలికింది ఇప్పుడు 10 లక్షల రూపాయలకు కూడా కొనేవారు లేరు. బటన్ నొక్కుడు ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువగానే లిక్కర్లో ప్రజల నుంచి దోచుకున్నారన్నారు.

విధ్వంస పాలకుడి ద్వారా పడిన కన్నం ఎంత?

విధ్వంస పాలకుడి ద్వారా ప్రతి కుటుంబానికి పడిన కన్నం ఎంత అన్నది ఎవరికి వారే వ్యక్తిగతంగా వీడియో చేయాలని ప్రజలను  రఘురామకృష్ణం రాజు కోరారు. ప్రతి ఒక్కరూ తగ్గిపోయిన తమ ఆస్తి విలువల గురించి తెలియజేయాలని, వాటిని నేను ప్రజలకు వివరిస్తానని చెప్పారు.

ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందితేనే ఓటు వేయమని కోరుతున్న జగన్మోహన్ రెడ్డికి, గత ప్రభుత్వ హయాంలో కంటే, ఇప్పుడు మీ ఆస్తుల విలువ పెరిగిందా?, తగ్గిందా?? అన్నది ఒక్కసారి పరిశీలించుకోవాలి .ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బ్రష్టు పట్టించిన జగన్ మోహన్ రెడ్డి, ప్రజల ఆస్తుల విలువను కూడా అధోగతి పాలు చేశారన్నారు.

పిల్ల పెళ్ళి కో, వైద్యం ఖర్చుల నిమిత్తమో ఆస్తి అమ్ముదామన్నా, కొనేవాడు లేకుండా చేశారన్న రఘురామ కృష్ణంరాజు, ఇటువంటి పరిపాలకుడా మనకు కావలసింది?, అవసరం లేదు… సరైన నాయకుడినే ఎన్నుకుందామని అన్నారు.

డిప్లమోసి అవసరం లేదు… వివేకా హంతకుడు ఎవరో ప్రజలకు చెప్పండి

ఇంకా డిప్లమాసి అవసరం లేదని మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హంతకులు ఎవరో ప్రజలకు తేల్చి చెప్పాలని డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి ని రఘురామకృష్ణం రాజు కోరారు. హంతకులు పరిపాలకులుగా ఉండడానికి వీలులేదని , పేర్లు చెప్పకుండానే వైయస్ వివేకానంద రెడ్డి హంతకులు ఎవరో డాక్టర్ సునీతా రెడ్డి చాలా స్పష్టంగా చెప్పిందన్నారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విచారించాలని ఆమె కోరిన విషయాన్ని ఈ సందర్భంగా రఘు రామ కృష్ణంరాజు గుర్తు చేశారు. డాక్టర్ సునీతా రెడ్డి చేసిన ప్రకటనతో వైఎస్ వివేకా హత్యలో జగన్మోహన్ రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లుగా పరోక్షంగా చెప్పిందన్నారు. డాక్టర్ సునీతా రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి రివర్స్ టెండరింగ్ మాదిరిగా రివర్స్ లో సునీతా రెడ్డి పై కేసు నమోదు చేసి విచారించాలనడం విడ్డూరంగా ఉంది.

వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు ఎందుకోసం చంపారో ప్రజలందరికీ తెలుసు. ఎవరు వైయస్ వివేకానంద రెడ్డిని చంపారో సిబిఐ చెప్పింది… కాకపోతే తమ పలుకుబడితో వారికి శిక్ష పడకుండా, కొంతమంది అడ్డుకుంటున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహాయం చేశారని డాక్టర్ సునీతా రెడ్డి చెప్పారు.

అందులో తప్పేముంది… ఒకరికి అన్యాయం జరిగినప్పుడు మాట సహాయం చేయడం మానవుడిగా మన ధర్మం. చూశారా చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ ను డాక్టర్ సునీతా రెడ్డి చదివిందని ప్రభుత్వ పెద్దలు, వైకాపాల నాయకులు చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణం రాజు ఫైరయ్యారు. మీలాగా దొంగతనంగా ఫస్ట్ క్లాసులో పాస్ అయినట్టు చెప్పుకునే స్టూడెంట్ కాదు డాక్టర్ సునీతా రెడ్డి. దేశంలోనే ఆమె ఒక ప్రముఖ వైద్యురాలు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదవాల్సిన అవసరం ఆమెకు లేదని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.

 

LEAVE A RESPONSE