Suryaa.co.in

Andhra Pradesh

అభివృద్ధితో వినుకొండ రూపురేఖలు మారుస్తాం

-వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడి ఓటమి ఖాయం
-బూతులు తిట్టటం తప్ప ఐదేళ్లలో ఏమీ చేయలేదు
-తమను గెలిపిస్తే తాగు, సాగునీటి సమస్య పరిష్కరిస్తాం
-టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
-టీడీపీలో చేరిన మర్రిపాలెం వైసీపీ నాయకులు

నమ్మి ఓటేసిన పాపానికి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి ఓటమి ఖాయమని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం బొల్లాపల్లి మండలం మర్రిపాలేనికి చెందిన 10 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. వినుకొండ పార్టీ కార్యాలయంలో జి.వి.ఆంజనేయులు, మక్కెన సమక్షంలో వారంతా తెలుగు దేశం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నెల్లూరు రమణయ్య, పెసల వెంకటనారాయణ, సింగం శివకుమార్‌, గుద్దేటి పెద్దదానం తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా జి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ ఐదేళ్లు అభివృద్ధి అన్న మాటే మరిచి ఇప్పుడు బూతులు తిట్టినంత మాత్రాన ఓటమి నుంచి బొల్లా తప్పించుకునే ప్రసక్తే లేదన్నారు. వినుకొండలో ఫ్యాన్‌ రెక్కలు విరగడం ఖాయమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్న వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా కూడా తుడిచిపెట్టుకుని పోవడం తథ్యమని వ్యాఖ్యానించారు. వినుకొండ ఎమ్మెల్యేగా తనను, నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలును గెలిపిస్తే అభివృద్ధి జోడి ఎలా ఉంటుందో ప్రజలందరికీ చూపిస్తామన్నారు.

చంద్రబాబు, లోకేష్‌ సారథ్యంలో వినుకొండ రూపురేఖలే మార్చేస్తామని హామీ ఇచ్చారు. మరీ ముఖ్యంగా బొల్లాపల్లి మండలానికి తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు. స్థానికంగానే విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ ఎమ్మెల్యేలుగా తాను, జీవీ 15 ఏళ్లు పడిన శ్రమ మొత్తాన్ని బొల్లా ఐదేళ్లలో నాశనం చేశారని, వినుకొండను అభివృద్ధికి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాల పట్ల కనీస స్పృహ, సాటివారి పట్ల గౌరవం ఇసుమంతైనా లేని బొల్లాని ఇంటికి సాగనంపాల్సిందేనని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జరపాల గోవింద నాయక్‌, నాయకులు పెసల వెంకటనారాయణ, నిమ్మకాయల బాబురావు, తదితరు లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE