-డిసెంబర్ అఖరికి మౌలిక వసతులు పూర్తిచేయాలి
-అధికారులకు మంత్రి సురేష్ ఆదేశాలు
టిడ్కో గృహాల్లో వసతులు లోపం లేకుండా చూడాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇప్పటికే ప్రారంభించిన 40 వేల గృహాల్లో మౌలిక వసతులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇటీవల మోకాలు శస్త్ర చికిత్స జరగటంతో హైదరాబాద్ నివాసం లో ఉన్న మంత్రి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్ష లో టిడ్కో ఎం డి శ్రీధర్, సిడిఎంఏ ప్రవీణ్ కుమార్, మెప్మా ఎం డి విజయలక్ష్మి, టిడ్కో ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. డిసెంబర్ ఆఖరికి మౌలిక వసతులు కల్పించటం తో పాటు బ్యాంకు రుణాలు అందజేయడంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని అన్నారు. 75 శాతం బ్యాంకు ఋణం అందగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని, 100 శాతం ఋణం అందిన తరువాత లబ్ధిదారులకు గృహం అందజేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో జాప్యం లేకుండా చూడాలని మంత్రి సూచించారు. ప్రతి ఇంటికి వ్యక్తిగత విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకునేందుకు పలు చోట్ల అధిక ధరలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి చెప్పారు.
దీనిపై కొందరు కమిషనర్ లు మాట్లాడుతూ కేవలం 259 రూపాయలు చెల్లిస్తే 24 గంటల్లో విద్యుత్ కనెక్షన్ ఇవ్వటం జరుగుతుందన్నారు. దీనిపై లబ్దిదారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. కొన్ని చోట్ల వీధి లైట్ లు ఏర్పాటు పై సంధిగ్ధం ఉందని కొందరు సూచించటంతో జగనన్న నగర్ లో వీధి లైట్ లు అర్బన్ లోకల్ బాడీ లు చూసుకోవాలని, శానిటేషన్ సిడిఎంఏ చూడాలని మంత్రి సురేష్ అన్నారు. అలసత్వం లేకుండా నిర్దేశించిన గడువు కు మౌలిక వసతులు పూర్తి చేయడం తో పాటు ఇప్పటికే ప్రారంభించిన గృహాల్లో 100 శాతం లబ్ధిదారులు చేరిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ అధికారులను ఆదేశించారు.