Suryaa.co.in

Andhra Pradesh

తాజా మార్గదర్శకాలుపై రాజకీయ పార్టీలు అవగాహన పెంచుకోవాలి

– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు ఆయన అధ్యక్షతన గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం రాష్ట్ర సచివాలయంలో వర్కుషాపు జరుగుచున్నది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు, సూచనలపై రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులకు సమగ్ర అవాగాహన ఏర్పర్చుకుంటే ఎన్నికల్లో ఎటువంటి సందేహాలకు, గందరగోళానికి తావు వుండదని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల షెడ్యూలు ప్రకటన, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియ మరియు వ్యయ పర్యవేక్షణ అనే అంశాలు ఎంతో కీలకమైన అంశాలన్నారు. ఈ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న సమయంలో అభ్యర్థులు, ఏజంట్లు, కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు మరియు రూ.10 వేలకు మించి విలువైనా వస్తులు వాహనాల్లో రవాణా చేయడం నిషిద్దమన్నారు. స్టార్ క్యాంపైనర్లు రూ.1.00 లక్షకు మించి నగదు కలిగి ఉండ కూడదన్నారు. పరిమితికి మించి నగదు ఉన్న వాహనాలను, నగదుని సీజ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

అదే విధంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుందన్నారు. ఎన్నికల్లో పోటీచేసే లోక్ సభ అభ్యర్థులు రూ.25 వేలు, శాసన సభ అభ్యర్థులు రూ.10 వేలు నగదు రూపేణాగాని లేదా ఆర్.బి.ఐ./ట్రెజరీ ద్వారా సెక్యురిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుదన్నారు. చెక్కులు, బ్యాంకు డ్రాప్టులను అనుమతించడం లేదన్నారు.

ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సంబంధిత ఆర్.ఓ.లు, ఏఆర్ఓలు నామినేషన్లను స్వీకరిస్తారన్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు 100 మీటర్ల దూరంలో వారి వాహనాలను నిలిపివేయడం జరుగుతుంది, అభ్యర్థితో కలుపుకుని మొత్తం ఐదుగురిని మాత్రమే లోపలకు అనుమతించడం జరుతుందన్నారు.

అదే విధంగా ఈ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుదన్నారు. ప్రతి లోక్ సభ అభ్యర్థికి రూ.95 లక్షలు, శాసన సభ అభ్యర్థికి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు.

అదనపు సీఈవో లు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ తో పాటు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు అంకంరెడ్డి నారాయణమూర్తి (వైఎస్సార్సీపి), ఎ.రాజేంద్రప్రసాద్ (టిడిపి), ఐ.కె.అన్నపూర్ణ (బిజెపి), వె.వి.రావు (సిపిఐ-ఎం) ఈ వర్కుషాపులో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE