వైసిపి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు
లోకేష్ సమక్షంలో 115 కుటుంబాలు టిడిపిలో చేరిక
అమరావతి: టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏనాడూ మైనార్టీలపై దాడులు జరగలేదు, వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేశాం, మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మైనార్టీల విషయంలో వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.
ఉండవల్లి నివాసంలో యువనేత లోకేష్ సమక్షంలో 115 కుటుంబాలు టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… భారతదేశంలో మొట్టమొదటిగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్న విషయాన్ని ముస్లిం సోదరులంతా గుర్తించాలన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఏనాడూ మైనారిటీలపై దాడులు జరలేదన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుచేసి పేద ముస్లింలను ఆదుకుంటామని చెప్పారు.
మంగళగిరి 13వ వార్డు ఇస్లాంపేటకు చెందిన 50 కుటుంబాలు మాజీ కౌన్సిలర్ వైసిపి నేత షేక్ బీబీ జాన్ , వైసిపి సీనియర్ నేత షేక్ మహబూబ్, షేక్ తాజుద్దీన్, షేక్ షబ్బీర్, షేక్ బాబా, షేక్ జానీ బాషా, షేక్ అలీ బాషా నేతృత్వంలో టిడిపిలో చేరాయి.
అదేవిధంగా ఖాజా గ్రామానికి చెందిన కుక్కమళ్ళ సాంబయ్య ఆధ్వర్యంలో 20 కుటుంబాలు, చినకాకాని గ్రామానికి చెందిన గండికోట శివ శంకర రావు ఆధ్వర్యంలో 20 కుటుంబాలు, బళ్ళా విజయ్ బాబు, కుక్కమళ్ళ మల్లేశ్వర రావు ఆధ్వర్యంలో 10 కుటుంబాలు, టిడిపి గ్రామ అధ్యక్షుడు గుమ్మా హరిబాబు ఆధ్వర్యంలో 15 కుటుంబాలు పార్టీలో చేరాయి. వారందరికీ లోకేష్ పసుపుకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సమన్వయకర్త నందం అబద్దయ్య, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.