Suryaa.co.in

Telangana

తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి

-ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మేనిఫెస్టో పేరుతో మోసం
-పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం సిగ్గుచేటు
-రాహుల్‌కు మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ

హైదరాబాద్‌: రాహుల్‌గాంధీకి బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. మేనిఫె స్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని తర్వాత వాటిని విస్మరించారని వీటికి సమాధానం చెప్పాలని కోరారు. ఇప్పటికే అనేకసార్లు అనుభవపూర్వకంగా ఇది రుజువైంది. 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను గుప్పిస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు. రెండు సందర్భాల్లో అటు కేంద్రం, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో మీరే అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన హామీలు వేటిని అమలు చేయలేదు. 2023లో కూడా తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. హామీలను విస్మరించారు. పార్లమెంట్‌ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి మళ్లీ మీరు తెలంగాణలో పర్యటిస్తున్నారు.

అసలు మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉన్నదా? ఒక్కదానినైనా అమలు చేశారా? అలాంటి మేనిఫెస్టోలు ఎందు కు? అని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ చాప్టర్‌లోని 13వ పాయింట్‌ కింద ప్రజా ప్రతినిధులు ఎవరైనా పార్టీ మారితే, ఆ వెంటనే సభ్యత్వం పోయేలా చట్టం చేస్తామని ఈసారి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మరి బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుని వారికే ఎంపీ టికెట్‌ కూడా ఇచ్చారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మొట్టమొ దటి హామీ అయిన మహాలక్ష్మి పథకం నుంచి చిట్ట చివరి హామీ అయిన చేయూత పథకం వరకు అన్నింటినీ విస్మరించిందన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. ఎకరానికి 15 వేల చొప్పున ఆర్థిక సహాయం, క్వింటాలకు 500 చొప్పున బోనస్‌, వ్యవసాయ కూలీలకు ఒక్కొక్కరికి 12 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సక్రమంగా అందడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక వంద రోజుల్లో ఇప్పటికే తెలంగాణలో 210 మంది రైతులు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలు కావడానికి కారకులైన మీరు వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరారు. కాంగ్రెస్‌ వస్తే 4000 పెన్షన్‌ ఇస్తామని ఎగ్గొట్టారు. నిరుద్యోగులకు నెలకు 4 వేలు అమలు కావడం లేదు. ఆటో కార్మికులకు నెలకు 12 వేలు ఇవ్వలేదని వీటికి ఏమి సమాధానం చెబుతారో చెప్పాలని కోరారు.

LEAVE A RESPONSE