-రాజకీయ లబ్ధికోసమే జగన్ దుష్ప్రచారం
-వ్యవస్థలను నిర్వీర్యం చేశారు
-వాలంటీర్లను కొనసాగించి గౌరవిస్తాం
-జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అవగాహన లేని చిత్ర విచిత్రమైన ప్రసంగాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పరిపాలనపై ఏ మాత్రం అవగాహన లేని ఉపన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లపై కావాలని రాద్ధాంతం చేస్తున్నారు.
వాలంటీర్లను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రాపగాండ చేస్తున్నారు…జనసేన తరపున దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ ఉన్నా రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించా రు. వాలంటీర్ల జీతభత్యాలు తదితర వాటి కోసం రూ.1600 కోట్లు వెచ్చించడమే కాక ప్రోత్సాహకాల కోసం మరో రూ.300 కోట్లు అదనంగా ఖర్చు చేస్తూ ప్రజలపై భారం వేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎవరైనా అధికారంలో ఉండంగా వ్యవస్థలను బాగు చేయటం చేస్తారు కానీ, ఈ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేయటమే కాకుండా వాటి ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు.
గత ఎన్నికల సమ యంలో అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం మెగా డీఎస్సీ, జాబ్ క్యాలండర్ అన్నారు అవి ఏమయ్యాయని ప్రశ్నించారు. సలహాదారుల జీతాలు మాత్రం రూ.680 కోట్లు.. కష్టపడి డిగ్రీలు, పిజిలు చేసిన వాలంటీర్లకు మాత్రం 5 వేలా అని హితవుపలికారు. వృద్ధులకు పెన్షన్లు వారి ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, దాన్ని రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తామని తెలిపారు. వాలంటీర్లను కొనసాగించి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకుండా గౌరవిస్తామని వివరించారు. ఈ నెల 14న తెనాలిలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పర్యటన ఉంటుందని, మార్కెట్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. సభను అందరూ కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.