– అడ్డం తిరిగిన జగన్ ఎలక్షన్ డ్రామా
– పథకాల పంపిణీకి ఈసీ నో
-ఎప్పుడో బటన్ నొక్కిన ఇప్పుడు డబ్బులు వేయడమేంటి?
– డిబిటికి వెంటనే డబ్బులు వేయాలని తెలీదా?
– జగన్ సర్కారుకు తలంటిన ఈసీ
– పారని జగన్ ‘ఓటుకునోటు’ పాచిక
– ఉత్తుత్తి బటన్లతో ప్రజలను మోసం చేస్తారా?
– ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘ నా అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలకు మేలు చేయాలన్న నా ప్రయత్నాన్ని ఈ కూటమి అడ్డుకుంటోంది. పేదలకు సంక్షేమాలు అందకుండా ఈసీతో కలసి కుట్ర చేస్తోంది. హద్దు లేకుండా అధికారులను మార్చేస్తోంది. అసలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేవో అన్న అనుమానంగా ఉంది’’ అంటూ రక్తకన్నీరు నాగభూషణం కూడా.. ఆశ్చర్యపోయే స్థాయిలో హావభావాలు ప్రదర్శించి, అమాయకత్వం ఒలకబోసిన వైసీపీ అధినేత- ఏపీ సీఎం జగన్‌ది, అంతా డ్రామాయేనని ఎన్నికల సంఘం చెప్పకనే చెప్పింది.
వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్ పోలింగ్ ముందు వేసిన ‘ఓటుకునోటు’ పాచిక పారలేదు. బటన్ నొక్కి పేదలకు పథకాలిస్తుంటే కూటమి అడ్డుకుంటోందని, గావుకేకలు పెడుతున్న జగన్‌కు ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. పోలింగ్‌కు ముందు పథకాల పేరుతో డబ్బు బదిలీ చేసి, ఆ పేరుతో ఓట్లు కొల్లగొట్టాలన్న జగన్ కుట్రలను ఈసీ తిప్పికొట్టింది. దానితో సరిపెట్టకుండా.. ఆర్నెల్ల క్రితం బటన్లు నొక్కి ఇప్పవరకూ డబ్బులు వేయకుండా ఏం చేస్తున్నారు’ అంటూ జగన్ సర్కారుకు తలంటు పోసింది.
ఆసరా, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ షాదీతోఫా, జగనన్న విద్యాదీవెన, రైతు పెట్టుబడి సాయం, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాలకు ఎన్నికలు ముగిసేవరకూ నిధులు విడుదల చేయకూడదని ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి సీఎస్ జవహర్‌రెడ్డి ఈసీకి రాసిన లేఖను చెత్తబుట్టలో పడేసింది. జగన్ సర్కారు అభ్యర్థనను త్రోసిపుచ్చిన ఈసీ.. సీఎస్ లేఖలోని కుట్రలను ప్రశ్నించడం విశేషం.
డిబీటీ నిధులు ఇప్పటిదాకా ఎందుకు వేయలేదు? వాటిని 24 గంటల నుంచి 48 గంటలలోగా వేయాలి కదా? 6 నెలల నుంచి బటన్లు నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదు? మీకు అంతగా లబ్థిదారులకు డబ్బు చెల్లించాలనుకుంటే, ఈనెల 13 తర్వాత చెల్లించండి అని ఘాటుగా వాతలు పెట్టడంతో జగన్ సర్కారు ఇరుకునపడాల్సి వచ్చింది. దానితో జగన్.. అక్కా చెల్లెమ్మలు, అవ్వాతాతలకు డ బ్బులు వేయకుండానే ఉత్తుత్తి బటన్లు నొక్కారన్న రహస్యం ఈసీ అక్షింతలతో బట్టబయలయింది. ఇది ఎన్నికల ముందు వైసీపీకి లబ్థిదారుల ఓట్లను దూరం చేసేవే.
‘ప్రభుత్వం స్క్రీనింగ్ కమిటీ ద్వారా సుమారు 14 వేల కోట్లకు పైగా పంపిణీకి వచ్చాయి. ఇవి చెల్లిస్తే ఎన్నికల ప్రక్రియలోని సైలెంట్ పిరియడ్‌కు విఘాతం కలుగుతుంది. దానితో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుంద’ని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
కాగా నా అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు అని దీర్ఘాలు తీసి మాట్లాడే వైసీపీ అధినేత జగన్.. అసలు డబ్బులు వేయకుండానే ఉత్తుత్తి బటన్లు నొక్కి, వారిని మోసం చేసినట్లు ఈసీ జవాబుతో లబ్థిదారులకు తెలిసిపోయింది. గత ఆరునెలల క్రితం జగన్ నొక్కిన బటన్లన్నీ ఉత్తుత్తివేనని, అసలు అందులో డబ్బులు లేకుండానే జగన్ బటన్లు నొక్కారన్న విషయాన్ని ఈసీ వెల్లడించడంతో, వైసీపీ పరిస్థితి తేలుకుట్టిన దొంగలా మారింది. ఇప్పటివరకూ ఈ విషయంలో కూటమిపై నిందలు వేసి, పేదల ఓట్లు కొల్లగొడదామనుకున్న జగన్ పథకం పారకపోవడంతో, వైసీపీ తలపట్టుకోవలసి వచ్చింది.
తాజా పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీకి కొత్తగా, క్షమాపణ డిమాండ్లు అదనపు తలపోటుగా మారింది. ప్రజలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలన్న డిమాండుతో వైసీపీ తలపట్టుకుంటోంది. అసలు ఆరు నెలల క్రితం నొక్కిన బటన్లకు.. లబ్థిదారుల ఖాతాలో డబ్బులే వేయకుండా, జగన్ మోసం చేశారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. డబ్బులు వేయకుండా ఆ నిందలు కూటమిపై మోపి, ఓట్లు పొందాలన్న వైసీపీ కుట్రలు బట్టబయలవడం పోలింగ్‌కు ముందు ఆ పార్టీకి శరాఘాతంగా మారింది.
జగన్ నొక్కేది ఉత్తుత్తి బటన్లేనని మేం చాలాకాలం నుంచి చెబుతున్నామని, ఇప్పుడు ఈసీ కూడా అదే తేల్చిందని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం వ్యాఖ్యానించారు. ‘ఆరునెలల క్రితం బటన్లు నొక్కి ఇప్పటిదాకా డబ్బులు వేయకుండా గాడిదలు కాస్తున్నారా? అసలు డబ్బులు లేకుండా ఉత్తుత్తి బటన్లు నొక్కి ఎవరిని మోసం చేద్దామని? అంటే పోలింగు ముందు వాటిని విడుదల చేసి, ఆ పేరుతో ఓట్లు పొందాలన్నదే కదా మీ కుయుక్తి? పథకాలకు డబ్బులు విడుదల చేయకుండా, కూటమి పథకాలను అడ్డుకుంటుందన్న జగన్ డ్రామాను ఈసీ పసిగట్టింది. ఖాతాల్లో డబ్బులు వేయకుండా ప్రజలను మోసం చేసినందుకు, జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాల’’ని నాగభూషణం డిమాండ్ చేశారు.