Suryaa.co.in

Editorial

పదవులు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

– ధ్వంసమైన రాష్ట్రానికి కేంద్ర దన్ను కావాలి
– 90 శాతం నిధులు కేంద్రం భరించాలి
– మౌలిక రంగంలో ఏపీకి పెద్దపీట
– ఎన్డీయే నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ
– స్పీకర్ సహా మూడు పదవులపై ఊహాగానాలు
– అసలు అవి చర్చకే రాలేదంటున్న టీడీపీ వర్గాలు
– ఎన్ని పదవులు కావాలని ప్రతిపాదించిన ఎన్డీయే
– జనసేన పక్షాన బాలశౌరికి అవకాశం?
– శనివారం నాటికి స్పష్టత?
– టీడీపీ ఎంపీలను ఢిల్లీలోనే ఉండమన్న బాబు
– రాష్ట్రపతిని కలసిన బాబు-పవన్
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి స్థితప్రజ్ఞత-ప్రాప్తకాలజ్ఞత కలగలసి ప్రదర్శించారు. కోరినన్ని కేంద్రమంత్రి పదవులు ఇచ్చేందుకు ఎన్డీయే సిద్ధంగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం, అచ్చంగా రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన పరిణామాలన్నీ, ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేసే కోణంలోనే జరిగినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎన్డీయే సమావేశానికి హాజరైన చంద్రబాబు తర్వాత బీజేపీ అధ్యక్షుడు నద్దా, అమిత్‌షా, రాజ్‌నాధ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. వారు టీడీపీకి ఎన్ని పదవులు కావాలని కోరారు. మిగిలిన భాగస్వామ్య పక్షాలను కూడా, బీజేపీ అదే కోరింది. అయితే తనకు మంత్రి పదవులు తీసుకోవడం కంటే.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని బాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు-పవన్ రాష్ట్రపతిని కలసి ఎన్డీయేకు మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు కోలుకోలేనంత ధ్వంసమయినందున, మళ్లీ వాటిని గాడిలో పెట్టేందుకు, కేంద్ర దన్ను అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రోడ్లు ధ్వంసమయ్యాయని, అలాంటి మౌలిక రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా కేంద్ర ప్రాయోజిత పథకాలలో, ఏపీకి మినహాయింపు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రం అన్ని రాష్ట్రాలకు 60-40 శాతం నిష్పత్తిలో నిధులు ఇస్తున్నాయి. అంటే 60 శాతం నిధులు కేంద్రం భరిస్తే, మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్రప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.

అయితే తమ రాష్ట్రానికి 90 శాతం నిధులు కేంద్రం ఇస్తే, తమ వాటాగా 10 శాతం ఇస్తామని ప్రతిపాదించారు. ఆర్ధికంగా గాయపడిన రాష్ట్రానికి, ఏ శాఖల నుంచి ఎక్కువ నిధులు వచ్చే అవకాశాలున్నాయో, వాటిని ఏపీకి అందించాలని బాబు సూచించారు. పైగా ఎన్డీయే కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడం కేంద్రప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

‘నేను ఈ సమయంలో నా పార్టీకి వచ్చే మంత్రి పదవుల గురించి ఆలోచించడం, చర్చించడం భావ్యం కాదు. గాయపడ్డ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం నాముందున్న సవాలు. నాపై ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జగన్ అంతగా ఖజానాను ఊడ్చివెళ్లారు. దానిని భర్తీ చేయడం కూటమిగా మన బాధ్యత. అది ఎంత త్వరగా చేస్తే మనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టినవాళ్లవుతాం. ముందు నాకు రాష్ట్ర ప్రయోజనాలు. ఆ తర్వాతే పార్టీ ప్రయోజనాలు. రాజకీయ అంశాలపై నా అభిప్రాయం ముందే చెప్పాను. దానిపై చర్చించి మీరే నిర్ణయం తీసుకోండి’’ అని చంద్రబాబు బీజేపీ అగ్రనేతలకు విస్పష్టంగా చెప్పారు.

కాగా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో..సోషల్‌మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. టీడీపీకి ఒక క్యాబినెట్, రెండు సహాయమంత్రులతో పాటు, స్పీకర్ పదవులు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. ఆ ప్రకారంగా రామ్మోహన్‌నాయుడుకు, లోక్‌సభ స్పీకర్ అయ్యే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రె డ్డికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందన్న చర్చ జరిగింది. అయితే అసలు అలాంటి చర్చనే రాలేదని, శనివారం నాటికి దానిపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెప్పాయి.

బాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో టీడీపీ ఎంపీలు ఆయనతో భేటీ అయ్యారు. అందరినీ ఢిల్లీలోనే ఉండమని ఆదేశించారు. ‘మీ అందరూ కొత్తవాళ్లు. రేపు ఇక్కడే ఉండండి. నేను మళ్లీ ఎల్లుండి వస్తాను. ఇక్కడ అన్నీ గమనించండి’ అని సూచించారు. అయితే ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి తిరుమల దర్శనం కోసం వెళ్లి, మళ్లీ శనివారం సాయంత్రానికి ఢిల్లీకి చేరనున్నారు.
ఇదిలాఉండగా జనసేన నుంచి ఒక కేంద్ర మంత్రి పదవి దక్కవచ్చంటున్నారు. ఆ ప్రకారంగా బాలశౌరికి, కేంద్ర సహాయమంత్రి పదవి దక్కవచ్చని తెలుస్తోంది. అయితే దానిపై కూడా స్పష్టత రాలేదు.

LEAVE A RESPONSE