Home » దార్శనికుడు రామోజీ : మోదీ

దార్శనికుడు రామోజీ : మోదీ

రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మోదీ రామోజీరావుకు నివాళులు ప్రకటించారు.భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆయన సహకారం జర్నలిజం, సినిమా ప్రపంచంలో చెరగని ముద్ర వేసిందన్నారు. రామోజీ అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా మీడియా, వినోద ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు, కొత్త ప్రమాణాలు నెలకొల్పారని వెల్లడించారు.

చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని.. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు అన్నారు.

రామోజీరావుతో తనుకు ఉన్న 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు… తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందని అన్నారు. సమస్యలపై పోరాటంలో ఆయన తను ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో శ్రీరామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని గుర్తుచేసుకున్నారు.

ఆవేదన కలిగించింది: వెంకయ్యనాయుడు
ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి ఆవేదన కలిగించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అడుగు పెట్టిన ప్రతీ రంగంలోనూ ఆయన తన మార్క్‌ను చూపించారన్నారు.

తెలుగు భాష, జర్నలిజానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. 88ఏళ్ల వయస్సులోనూ క్రమశిక్షణ, నిబద్ధత, సమయపాలన నడుచుకునే వారని, ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు.

దిగ్భ్రాంతికి లోనయ్యా:పవన్ కల్యాణ్
రామోజీ రావు లేరనే వార్త ఆవేదన కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారన్నారు. అక్షరయోధుడు రామోజీ రావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక.. కోలుకొంటారని భావించానని పవన్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. రామోజీరావు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనంగా మారిందని పవన్ తెలిపారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారన్నారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారని పవన్ తెలిపారు.

రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
రామోజీ రావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించారని గుర్తుచేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ప్రకటించారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ఆదేశాలు జారీచేశారు.

జగన్ అరాచకాల మనోవేదనతోనే: నట్టి కుమార్
ఈనాడు పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగన్ అరాచకాల మనోవేదనతోనే రామోజీరావు ఆరోగ్యం క్షీణించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇంకా ఆయన ఎంతో కాలం మన మధ్యే ఉండేవారే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, పగలకు ఆయన మనోవేదన చెందడంవల్లే ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇప్పుడు ఏపీలో ఎన్నికల ఫలితాలు రాగానే అరాచకపాలన అంతమొందిన్న వార్తలను చూసుకున్న అనంతరమే ఆయన మనఃశాంతితో తుది శ్వాస విడిచారు.

కోకొల్లల మందికి ఆయన ఆదర్శప్రాయులు, స్ఫూర్తిప్రదాత. రామోజీ ఫిలింసిటీని నిర్మించి, చిన్న సినిమాలు కూడా షూటింగ్ చేసుకునేందుకు ఎంతగానో సహకరించారు. నేను నిర్మాతగా తొలినాళ్ళలో బండ్ల గణేష్ హీరోగా తీసిన సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో చేయడానికి కారణం చిన్న సినిమాల పట్ల ఆయనకు ఉన్న ఆదరణ, పెద్ద మనస్సే. చిన్న సినిమాలు సైతం ఫిలింసిటీలో షూటింగ్ చేసుకోవచ్చని చాటి చెప్పారు. నేను ఫిలింఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఉన్నప్పుడు ఆయన అమూల్యమైన సూచనలు, సలహాలను ఇచ్చి మార్గదర్శకులుగా నిలిచారు. కొత్త వాళ్ళతో అయినా సినిమాలు తీసి, ఎంత పెద్ద హిట్ చేయవచ్చో నిరూపించారు.

Leave a Reply