– 11.27 గంటలకు ముహుర్తం
– 3 కేటగిరీలలో 36 గ్యాలరీలు
– ఒక్కో గ్యాలరీకి ఒక్కో ఇన్చార్జి నియామకం
– శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక
– డిప్యూటీ సీఎంగా పవన్
– జనసేన-బీజేపీ ప్రతిపాదన
– గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు
– మోదీ,అమిత్‌షా, రజనీకాంత్, చిరంజీవి రాక
– పుంగనూరు అంజిరెడ్డి తాతకూ ప్రత్యేక ఆహ్వానం
– కార్యకర్తల గౌరవం పెంచిన చంద్రబాబు
– అమిత్‌షాకు బాబు నివాసంలో విందు
– పార్టీ జెండాలతో గన్నవరం ముస్తాబు
– పరిమిత సంఖ్యలో పాసులు
– నియోజకవర్గానికి 200 పాసులే
– పాసులపై కూటమి నేతల ఒత్తిళ్లు
– విజయవాడలో హోటల్స్ ఫుల్
– మంత్రుల కూర్పుపై గుంభనం
– లీకులు లేకుండా జాగ్రత్త పడిన చంద్రబాబు
– బాబు పల్సు పట్టలేని సీనియర్లు
– జాబితాపై ఆశావహుల అ‘టెన్షన్’
( మార్తి సుబ్రహ్మణ్యం)
మరికొద్ది గంటల్లో గన్నవరంలో జరగనున్న ప్రజాకూటమి పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11.27 నిమిషాలకు ఎన్డీయే కూటమి ప్రజాప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధమయింది. ఈ సంబరాలకు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, సూపర్‌స్టార్లు రజనీకాంత్, చిరంజీవి ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఒంటరిగా పోరాడిన అంజిరెడ్డి తాతకు, స్వయంగా చంద్రబాబు నుంచి ప్రత్యేక ఆహ్వానం అదండాన్ని.. కార్యకర్తలు తమకు దక్కిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నారు.
సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో గన్నవరం రహదారులన్నీ టీడీపీ-జనసేన-బీజేపీ జండాలతో కళకళలాడుతున్నాయి. అటు బెజవాడలోని అన్ని హోటల్స్ ఫుల్ అయ్యాయి. ప్రమాణ స్వీకార వేదికకు సంబంధించి 3 కేటగిరీలలో 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీకి ఒక్కో ఇన్చార్జిని నియమించారు. ప్రజాప్రతినిధులు-వారి కుటుంబ సభ్యులు, వీవీఐపీలు, వీఐపీలు, మీడియా ప్రతినిధుల గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
కాగా మంత్రివర్గ కూర్పుపై అర్ధరాత్రి వరకూ సస్పెన్స్ కొనసాగింది. సహజంగా అయితే చంద్రబాబునాయుడు క్యాబినెట్ కూర్పుపై, గ తంలో లీకులు ఇచ్చే సంప్రదాయం ఉండేది. కానీ ఈసారి రొటీన్‌కు భిన్నంగా ఆయన జాబితాపై గుంభ నంగా వ్యవహరించడం విశేషం. చివరికి తనకు సన్నిహితులకు, కార్యాలయంలో పనిచేసే వారికి సైతం తెలియకుండా వ్యవహరించారు.దీనితో
మంత్రిపదవులు ఆశిస్తున్న వారిలో టెన్షన్ మరింత పెరిగింది. తమకు సన్నిహితులు, పార్టీ ఆఫీసు నేతలు, జర్నలిస్టులు, చంద్రబాబుకు సన్నిహితులకు ఫోన్లు చేసి జాబితాలో తమ పేరు ఉందా? లేదా ? అని ఆరాలు తీయడంలో బిజీ అయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మంత్రుల జాబితా ప్రకటిస్తారని తెలియడంతో అప్పటి వరకూ టెన్షన్‌తో గడిపారు.
కాగా హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దాకు చంద్రబాబునాయుడు విందు ఇచ్చారు. అంతకుముందు యువనేత లోకేష్ వారిని ఆహ్వానించారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కూడా వారి వెంట ఉన్నారు.
ఇదిలాఉండగా బీజేపీకి ఒక మంత్రి పదవి మాత్రమే ఇస్తారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అమిత్‌షా-నద్దా చర్చల్లో దానిపై స్పష్టత వచ్చిన తర్వాత, అర్ధరాత్రి జాబితా ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.