– మల్లారెడ్డికి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు?
– మరో దళిత నేత కూడా?
– ఇద్దరు మాజీ మంత్రి చేరిక?
– పాత కాపులకు ఆహ్వానం
– తెలంగాణపై బాబు నజర్
– బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకుపై దృష్టి
( మార్తి సుబ్రహ్మణ్యం)
టీడీపీ అధినేత-ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును నిర్వీర్యం చేసే లక్ష్యంతో చంద్రబాబునాయుడు అడుగులేస్తున్నారు. అందులో భాగంగా.. గతంలో టీడీపీని వీడిన సీనియర్లను తిరిగి ఘర్‌వాపసీ పథకంలో చేరాలని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో టీడీపీలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన మంత్రి, బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కారు ఆయనపై వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో, ఎన్డీయేలో ప్రధాన భాగస్వామి అయిన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కూడా టీడీపీలో చేరవచ్చంటున్నారు. అదే నిజమైతే మల్లారెడ్డికి, తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పచెప్పే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా గతంలో టీడీపీ సర్కారులో మంత్రులుగా పనిచేసిన ముగ్గురు సీనియర్లు, బీఆర్‌ఎస్-బీజేపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరేందుకు, రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. అదేవిథంగా బీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న పాతకాపులంతా, తిరిగి స్వంత గూటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేర కు చంద్రబాబునాయుడు ప్రత్యేక ఆపరేషన్ ప్రార ంభించినట్లు తెలుస్తోంది.
కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో.. టీడీపీ మళ్లీ కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, టీడీపీలో చేరడమే మంచిదన్న భావన మాజీ తమ్ముళ్లలో కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం, దాదాపు 40 నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభావం ఉన్న సెటిలర్లు ఉన్నందున, వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని టీడీపీ మాజీ నేతలు అంచనా వేస్తున్నారు. పైగా ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నందున, ఆయన తెలంగాణపై సీరియస్‌గా దృష్టి సారిస్తారని భావిస్తున్నారు.
నిజానికి తాజా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి టీడీపీతో తొలిరోజుల్లోనే చర్చించి ఉంటే, మరో మూడు స్థానాలు వచ్చేవన్న భావన లేకపోలేదు. ఏపీలో బీజేపీతో పొత్తు కుదిరిన వెంటనే కిషన్‌రెడ్డి రంగంలోకి దిగి, చంద్రబాబుతో చర్చించి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే చివరి నిమిషంలో చింతల రామచంద్రారెడ్డిని రంగంలోకి దింపారని, అప్పటికే ఆలస్యమయినందున కిషన్‌రెడ్డికి పెద్దగా మెజారిటీ రాలేదంటున్నారు. పైగా కిషన్‌రెడ్డి వ్యక్తిగతంగా చంద్రబాబుతో విబేధిస్తారని, ఆయన జగన్‌రెడ్డి వైపే ఉంటారన్న భావన అటు టీడీపీ-ఇటు బీజేపీ వర్గాల్లో లేకపోలేదు.