Suryaa.co.in

Editorial

మంగళగిరిలో చిరంజీవికి ‘గంజి’ పెట్టినట్లేనా?

-‘నేతన్న’ చిరంజీవి టికెట్ కు ‘గంజి’ పెట్టిన జగనన్న
-మళ్లీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ పిలుపు

-జగన్ పై అసంతృప్తితో వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల
-షర్మిలతో అడుగులు వేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని
-ప్రకటన ఆళ్ల ‘ఘర్వాపసీ’లో ఫలించిన ఎంపీల రాయబారం

-ఆళ్ల బిల్లులు క్లియర్ చేస్తామని జగన్ హామీ ?
-‘గంజి’తో మంగళగిరి ‘ఫ్యాను’ తిరగదన్న నివేదకలు
-సామాజికన్యాయంపై ఇటీవలే జగన్ ఉపన్యాసాలు
-చేనేతను గెలిపించాలని కోరిన విజయసాయిరెడ్డి
-ఇప్పుడు ‘గంజి’ని మడత పెట్టి మళ్లీ ‘రెడ్డి’ కార్పెట్
-గంజికి వైసీపీ ఇన్చార్జి ‘మంగళం’?
-మంగళగరిలో వైసీపీపై చేనేతల చిర్రుబుర్రు

( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ యువనేత లోకేష్ ను ఓడించేందుకు కాళ్లు బలపాలు కట్టుకుని తిరుగుతున్న వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డికి.. మంగళగిరిలో తత్వం బోధపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి ఝలక్ ఇవ్వడంతో, చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని రంగంలోకి దింపిన జగన్.. ఇప్పుడు ఆ చేనేత ‘గంజి’ని మడతపెట్టి, మళ్లీ ‘రెడ్డి’కార్పెట్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది మంగళగిరి చేనేతల ఆగ్రహానికి కారణమయింది. పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఒక్క పని కూడా కావడం లేదని, ప్రజలు చెప్పిన పనులు చేయకపోతే తాను ఎమ్మెల్యేగా ఉండటం ఎందుకన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ-ఎమ్మెల్యే పదవికి జమలిగా రాజీనామా చేసి, హైదరాబాద్కు చెక్కేశారు.

తన ఆఫీసులో ఉన్న జగన్ ఫొటోలను కూడా తొలగించారు. పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డితో కలసి కాంగ్రెస్లో పనిచేస్తానని, వైసీపీ నుంచి కాంగ్రెస్లో పోటీ చేసే తొలి ఎమ్మెల్యే తానేనని సగర్వంగా ప్రకటించారు. ఇక జగన్ ముఖం చూసేది లేదన్నారు. షర్మిల విజయవాడకు వచ్చినప్పుడు జరిగిన ధర్నాలో కూడా ఆళ్ల కనిపించారు. పైగా వాట్సాప్ డీపీలో జగన్ ఫొటో తొలగించి, ఇందిరాగాంధీ ఫొటో పెట్టుకున్నారు.

దానితో నష్టనివారణకు దిగిన జగన్.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్చార్జిగా నియమించారు. ప్రస్తుతం ఆయన మంగళగిరి వైసీపీ ఇన్చార్జిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే చిరంజీవి ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని, నివేదికలలో తెలుసుకున్న జగన్… ఎంపి విజయసాయిరెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. దానితో లోకేష్ ను ఓడించే ఏకైక లక్ష్యంతో విజయసాయిరెడ్డి కాళ్లకు బలపాలు కట్టుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. నేతలతో సమావేశాలు నిర్వహించారు. అయినా వైసీపీకి సానుకూల పరిస్థితి భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు.

మంగళగిరిలో పార్టీ పరిస్థితి తెలుసుకున్న విజయసాయిరెడ్డి వాటిని జగన్కు వివరించారు. మళ్లీ ఆళ్ల పోటీ చేస్తేనే పార్టీకి కనీస స్థాయిలో ఓట్లు వస్తాయని స్పష్టం చేశారట. అదే సమయంలో అటు ఐప్యాక్ కూడా.. చిరంజీవితో పార్టీ ముందుకుపోవడం కష్టమని, పైగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వంటి సీనియర్లు ఆయనకు సహకరించరని స్పష్టం చేసింది. ఏ ఒక్కరి మధ్య సమన్వయం లేదని పేర్కొన్నారు. టీడీపీని కనీస స్థాయిలో ఎదుర్కొనే నేత లేకపోతే, వైసీపీ భారీ మెజారిటీతో ఓడిపోక తప్పదని స్పష్టం చేశారట.

దానితో పార్టీపై అలిగి రాజీనామా చేసి వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని.. తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను ఎంపి అయోధ్యరామిరెడ్డి, విజయసాయరెడ్డికి అప్పగించారు. వారిద్దరూ ఆళ్లతో మాట్లాడటం, ఆయన కూడా మెత్తపడి అంగీకరించటం, ఫలితంగా తాడేపల్లి క్యాంపు ఆఫీసుకు ఆళ్లను తీసుకురావడం చకాచకా జరిగిపోయింది. ఆ తర్వాత జగన్ ఎమ్మెల్యే ఆళ్లను కౌగిలించుకోవడం, ఆళ్ల కూడా చేసిన పొరపాటుకు చింతిస్తూ కౌగిలించుకోవడం శరవేగంగా జరిగిపోయింది. అంటే తాను పనికిరాదనుకున్న వైసీపీనే, తిరిగి ఆళ్లకు పనికొచ్చిందన్నమాట. తన ఫోన్లో జగన్ స్థానంలో ఇందిరమ్మ ఫొటో పెట్టుకున్న ఆళ్ల.. ఇప్పుడు మళ్లీ జగన్ ఫొటో పెట్టుకున్నారు. అంటే విధేయత మారిందని చెప్పడమేనన్నమాట.

దానికి తగినటే.. “నాతో జగన్ను తిట్టించాలని కాంగ్రెస్-షర్మిల ప్రయత్నించారు. నన్ను జగన్ రెండుసార్లు ఎమ్మెల్యేను చేశారు. అలాంటి జగనన్ను విమర్శించమని చెప్పడం నాకు నచ్చలేదు. అది పద్ధతికాదని షర్మిల, కాంగ్రెస్ పార్టీకి చెప్పిచూశా. కానీ వాళ్లంతా వ్యక్తిగతంగా వెళ్లడం నాకు ఇష్టం లేదు. వాళ్ల పద్ధతి నచ్చకనే నేను బయటకు వచ్చాన”ని ఆళ్ల సెలవిచ్చారట. అయితే ఆళ్లకు రావలసిన పెండింగ్ బిల్లులతోపాటు.. ఆయన పార్టీ కోసం చేసిన ఖర్చును, ఒక రాయలసీమ ఎంపీ ద్వారా ఇప్పించేందుకు ఒప్పందం కుదిరిందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో.. చేనేత నాయకుడు గంజి చిరంజీవిని, జగన్ బలిపశువు చేశారన్న విమర్శలు బీసీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

సామాజికన్యాయం గురించి నిన్నటి వరకూ గొప్పగా ఉపన్యాసం ఇచ్చిన విజయసాయిరెడ్డికి, బీసీ నేతను బలి చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందని బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంగళగిరికి మళ్లీ రెడ్డిని తీసుకురావాలన్న లక్ష్యంతోనే.. పార్టీని విమర్శించిన ఆళ్లను తిరిగి తీసుకువచ్చి, బీసీ నేత గంజికి అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆళ్ల మళ్లీ వచ్చినందువల్ల, చిరంజీవిని ఇన్చార్జిగా తొలగించడం ఖాయమని చెబుతున్నారు. నేతిబీరలో నెయ్యి ఉంటుందనేది ఎంత నిజమో.. వైసీపీ చెప్పే సామాజిక న్యాయంలో అన్యాయమే తప్ప న్యాయం లేదనేది, ‘గంజి’ని మడతపెట్టి పక్కన పెట్టినప్పుడే స్పష్టమయిందని చేనేత వర్గాలు దుయ్యబడుతున్నాయి.

 

 

LEAVE A RESPONSE