Suryaa.co.in

Editorial

హోదా కోరాలట… హ్హిహ్హిహ్హి!

– జగన్ పలుకులపై సోషల్‌మీడియాలో జజ్జనకరిజనారే
– ఐదేళ్లూ గాడిదలు కాశారా అని నెటిజర్ల ఫైర్
– కేసుల కోసం మోదీకి మోకరిల్లారంటూ ధ్వజం
– సిగ్గులేని మాటలెందుకని అక్షింతలు
– ఓడినా సిగ్గురాలేదని విమర్శలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మెదడు మోకాల్లోకి వచ్చినట్లుంది. ఆయన తెలివి తెల్లారినట్లుంది. 11 సీట్లతో జనం పంగనామాలు పెట్టినా ఇంకా గతితప్పిన మతిలేని రాజకీయాన్నే నమ్ముకున్నట్లుంది. సినిమా యాక్టర్లకు ఎగ్గుండదు. రాజకీయ నాయకులకు సిగ్గుండదన్న సినిమా సామెతను జగన్ నిజం చేస్తున్నట్లుంది. ఎవరైనా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. ఎందుకు ఓడిపోయామో పోస్టుమార్టం చేసుకుంటారు. కానీ జగన్ తీరు అందుకు విరుద్ధం. ఎందుకంటే ఆయన జగన్ కదా?

నవ్విపోదురుగాక..నాకేటిసిగ్గన్నట్లుంది జగన్‌రెడ్డి నిర్వాకం! కొత్త ప్రభుత్వం ప్రమాణం చేసి ఇంకా ముచ్చటగా మూడురోజులు కూడా కాలేదు. ఇది రాసే సమయానికి మంత్రులకు ఇంకా శాఖలు కూడా కేటాయించలేదు. ఈలోగా జగన్ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. శ్రీకృష్ణుడు అర్జనుడికి ఉపదేశం ఇచ్చిన మాదిరిగా, జగన్ కూడా తన పార్టీ ఎమ్మెల్సీలకు అనుగ్రహభాషణం చేశారు. బాగానే ఉంది. తప్పులేదు. పరాజయ ప్రస్థానంలో ఎవరి దారి వారు చూసుకునే ఎమ్మెల్సీలు దారి తప్పకుండా, దారిలో పెట్టడం నాయకుడిగా ఆయన కర్యవ్యం.

కానీ ఆ సందర్భంలో జగన్ ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలు వికృతంగా, అతి తెలివిగానే అర్ధమవుతాయి. ఎన్డీయే తన చేతిలో ఉన్నందున, ప్రత్యేక హోదా అడగకపోవడం చంద్రబాబు చేసిన పాపమట. అలా అడగకపోతే యువకులు బాబుకు క్షమించరట. ఇదీ ఆయన వాదన. ఓటమితో జగన్ మానసిక సమతుల్యం దెబ్బతిందా? లేక అతి తెలివి రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయా? అదీకాకపోతే.. బుర్రబుద్ధిలేని ఆయన బృహస్పతుల స్క్రిప్టు’ను ఇంకా చదువుతున్నారా? అన్న అనుమానం ఎవరికైనా రాక తప్పదు.

అసలు జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటమే పెద్ద బూతు. ఎందుకంటే ఐదేళ్లు అధికారం వెలగబెట్టినప్పుడు, ఆయన అఘోరించేదేమిటి? రాష్ర్డపతి ఎన్నికల్లో పువ్వుపార్టీ తన మద్దతు అడిగినప్పుడు, ఈ ‘అతి’తెలివి అప్పుడేమైంది? ‘మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేం మీకు మద్దతునివ్వం’ అని ఆనాడు ఎందుకు షరతులు పెట్టలేకపోయారు? ఎందుకు పెట్టలేదంటే.. బెయిల్‌పై బయట తిరుగుతున్న జగన్ సీబీఐ కేసులకు ఆయన ప్రతి శుక్రవారం హాజరుకావలసి వస్తుంది కాబట్టి!

అప్పుడు నిజంగా హోదాకు- మద్దతుకు మెలికపెట్టి ఉంటే, ఆంధ్రాకు అప్పుడే హోదా వచ్చేది కదా? మరి అప్పుడు జగన్ తెలివి తెల్లారలేదా? ఆరోజు గుడ్డిగుర్రం పళ్లు తోముతున్నారా? ఈ అతి తెలివి ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు, బేషరతుగా మద్దతు ఇచ్చినప్పుడు ఉంటే, మన యువకులు మురిసిముక్కలయ్యేవాళ్లు కదా?

ఈ అతి తెలివోదో ఉప రాష్ట్రపతి, స్పీకర్ ఎన్నికల్లో చూపించి ఉంటే హోదా దక్కును కదా? అప్పుడు నవరంధ్రాలూ మూసుకుని, కేసుల కోసం హోదాను తాకట్టుపెట్టి, ఇప్పుడు హోదా గురించి మాట్లాడితే నలుగురూ న వ్వుతారన్న జ్ఞానం కూడా లేకపోతే ఎలా? ఇంత సిగ్గుమాలిన తనం, సిగ్గులేని రాజకీయాలు చేస్తే యువకులు క్షమిస్తారా?.. అన్నది ఇప్పుడు సోషల్‌మీడియాలో నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలు.

నిజానికి ఈ ప్రశ్నలకు, జగన్ అర్హుడే అన్నది బుద్ధిజీవుల అభిప్రాయం. అప్పుడు లోక్‌సభలో జగన్ పార్టీ అవసరం లేకపోయినా రాజ్యసభలో మాత్రం అవసరం. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి, ఎలక్టోరల్ కాలేజీలో దండిగా ఓట్లున్న జగన్ పార్టీ అవసరం బీజేపీకి ఉంది.

అప్పుడు పువ్వుపార్టీని నిలదీసి.. నిగ్గదీసి హోదా ఇస్తావా? చస్తావా? అని కడిగేసే సమయమది. హోదా ఇవ్వ పోతే యుపిఏ అభ్యర్ధికి ఓటు వేస్తామని బెదిరించే సందర్భమది. నిజంగా జగన్ ఈ అతి తెలివి అప్పుడే బీజేపీ దగ్గర ప్రదర్శించి ఉంటే, ఈపాటికి హోదా వచ్చేది. హోదా తెచ్చిన వీరుడిగా జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టేవారు. అప్పుడు ఈ దిక్కుమాలిన పరిస్థితి ఉండేది కాదు.

అప్పుడు ఆ పని చేయకుండా, ఇప్పుడు తీరికూర్చుని అతి తె లివి రాజకీయాలు చేసే, టీడీపీకి-కూటమికి వచ్చిన గత్తరేమీ లేదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ప్రత్యేక హోదా అజెండా కాదు. కాంగ్రె స్ మినహాయిస్తే, జగన్ సహా ఎవరూ ప్రత్యేక హోదాపై హామీలివ్వలేదు. కాబట్టి ఇప్పుడు హోదాను ప్రస్తావించి, భావోద్వేగం రెచ్చగొట్టాలన్న జగన్ ‘చావు కమ్ అతి తెలివి’ రాజకీయాలు, వర్కవుట్ కాదన్నది బుద్ధిజీవుల ఉవాచ.

అసలు జనం తనపై ఎందుకు తిరుగుబాటు చేశారు? తనను పరదాల చాటున ఎందుకు బందీ చేశారు? మతిలేని వారిచ్చిన గతి తప్పిన సలహాలు తానెందుకు పాటించాను? తన తల్లి-చెల్లి తనకు జమిలిగా ఝలక్ ఇచ్చి ఎందుకు వెళ్లారు? ‘శివగామి’ కుటుంబచ ట్రంలో తానెందుకు ఇరుక్కుపోయాను? మంత్రులు-ఎమ్మెల్యేలకూ అపాయింట్‌మెంట్లు ఇవ్వనంత అహంకారం తన తలకు ఎందుకు ఎక్కింది? అసలు తానొక రాజునని, అంతకుమించి తానొక దైవాంశ సంభూతుడినన్న పిచ్చి భ్రమల్లో ఎందుకు బతుకుతున్నాను? ఐదేళ్లు పరదాలు కట్టుకుని ఎందుకు బతికాను?

ఇలా ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో ఆత్మపరిశీలకు అర్హమైన ప్రశ్నలు .. అద్దం ముందు వేసుకుని, మారు మనసుతో పరిశుద్ధుడిలా పైకి తేలకుండా.. ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు ఇంకా కొనసాగించడమే దౌర్భాగ్యమన్నది, సొంత పార్టీ నేతల హితవు. జగనన్నా.. మీకు అర్ధమవుతోందా?

లాస్ట్‌బట్ లీస్ట్.. అదేదో సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు.. అతిగా ఆశపడే మగవాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు.

LEAVE A RESPONSE