Suryaa.co.in

Andhra Pradesh

పెద్దిరెడ్డి పాపాలపై కమిటీ వేయాలి

– గత అయిదేళ్ల అరాచకాల నిగ్గు తేల్చాలి
– బాధితులకు న్యాయం చేసి, దోషులను శిక్షించాలి
– పెద్దిరెడ్డి కుటుంబం దోచుకున్నది కక్కించాలి
– ముఖ్యమంత్రి చంద్రబాబుకి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ లేఖ

అధికారం అడ్డం పెట్టుకొని.. అరాచకాలు, అక్రమార్జన చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చి, అక్రమాలు బయట పెట్టేందుకు కమిటీలను నియమించాలని.. పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శుక్రవారం లేఖ రాశారు.. పెద్దిరెడ్డి డొచ్చుకున్నది కక్కించి, అతని బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ.. పలు కీలక అంశాలు ఈ లేఖలో ప్రస్తావించారు.. ఈ పూర్తి లేఖ సారాంశం ఇదే..

గౌరవనీయులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు..
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి..

అయ్యా..

మీ విజయం చిరస్మారకం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకం.. మీ రాజకీయ జీవితంలో సార్థకం..! అందుకే మీ అద్భుత విజయానికి ముందుగా మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. మీతో సహా గెలిచిన కూటమి ప్రజా ప్రతినిధులు, మంత్రివర్గ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు.. మీ నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చి, గత పాపాలను కడిగి, రాష్ట్రానికి తగిలిన గాయాలను రూపుమాపి, మంచి చేస్తూ.. గతంలో మీ హయాంలో జరిగిన తప్పులు పునరావృత్తం కాకుండా చూసుకుంటారని విశ్వసిస్తున్నాను..

గత అయిదేళ్ల చేదు జ్ఞాపకాలు, చెత్త పాలన, అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు మీకు తెలియనివి కాదు.. ముఖ్యంగా మన సొంత జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే అరాచక రాజ్యాంగేతర శక్తి ఎన్నో పాపాలు, పాతకాలతో రాజ్యమేలింది.. వాటిపై సమగ్ర విచారణ జరిపుతారని ఈ లేఖ..

గత అయిదేళ్లలో మంత్రిగా, అధికారం అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల్లో విచ్చలవిడిగా దోచుకున్నారు. ప్రతీ క్వారీ, ప్రతీ ఖనిజ నిక్షేపాల్లో తమ అనుచరులను పెట్టీ అక్రమార్జన చేశారు. అలాగే విద్యుత్తు శాఖలో కాంట్రాక్టులు, ఒప్పందాలు, కేటాయింపులు ద్వారా రూ. వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. వీటిపై విచారణకు ఒక ప్రత్యేక కమిటీని వేసి నిజాలు నిగ్గు తేలుస్తారనీ..

మీ సొంత నియోజకవర్గం కుప్పం సహా పంగనూరు, పలమనేరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలతో సహా మూడా అధారిటీ అడ్డం పెట్టుకొని పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు చేసిన అరాచకాలు, భూ కబ్జాలు, ఆగడాలపై సమగ్ర విచారణకు ఒక ప్రత్యేక కమిటీని వేసి నిజాలు నిగ్గు తేలుస్తారని..

గత అయిదేళ్లలో పుంగనూరు సహా చుట్టు పక్కల నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలపై జరిగిన దాడులు, వేధింపులు, అక్రమ కేసులపై విచారణకు ఒక ప్రత్యేక కమిటీని వేసి నిజాలు నిగ్గు తేలుస్తారని..

పెద్దిరెడ్డి అతని అనుచరులు, కుటుంబ సభ్యుల గత అయిదేళ్ల అరాచక వ్యవహారాల్లో బాధితులుగా నేను, మీరు, మనతో సహా వేలాది మంది అమాయక ప్రజలు, సాధారణ కార్యకర్తలు కూడా ఉన్నారు.. వారందరికీ న్యాయం జరగాలంటే, రాష్ట్రంలో న్యాయం నిలబడాలంటే, నిజాలు తెలియాలి, విచారణ జరగాలి.. ముఖ్యమంత్రిగా ఈ బాధ్యత తమరిపై ఉన్నదని తెలియజేస్తున్నాను.

LEAVE A RESPONSE