-దొంగ నుంచి ఉంగరం కొట్టేసిన తిరుపతి సీఐ
-బాబు-లోకేష్ బొమ్మతో బంగారు ఉంగరాన్ని కొట్టేసిన దొంగ
-అతని నుంచి కొట్టేసిన తిరుపతి సీఐ మహేశ్వర్‌రెడ్డి
-సీఐని ఏ-2గా చేర్చాలని కోర్టు ఆదేశం
( అన్వేష్)
దొంగపోలీస్.. పోలీస్ దొంగ.. ఇలాంటి టైటిల్స్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అందులో దొంగే పోలీసు పాత్రధారి. పోలీసు పాత్రధారే దొంగ. కొన్ని సినిమాల్లో పోలీసు దొంగ ఉదయం ఉద్యోగం చేస్తూ, రాత్రి దొంగతనాలు చేస్తుంటాడు. ఇంకొన్ని సినిమాల్లో దొంగలు కొట్టేసిన వస్తువులను తానే కొట్టేస్తుంటాడు. దొంగలను ప్రోత్సహించి మరీ దొంగతనాలు చేయిస్తుంటాడు.
ఇప్పుడు తిరుపతిలో మహేశ్వర్ రెడ్డి అనే ‘పోలీసు రెడ్డి’ గారు అచ్చంగా, అలాంటి దొంగపోలీసు అవతారమే ఎత్తాడు. దొంగగారు కొట్టేసిన బంగారు రింగును.. ‘దొంగపోలీసురెడ్డి’గారు కొట్టేసి నొక్కేశారట. బాధితుడు ఈ విషయాన్ని ఇంకో ఎస్పీ రెడ్డిగారికి చెప్పినా లాభం లేకపోవడంతో కోర్టుకెక్కారు. దానితో సీసీ టీవీ పుటేజీలు చూసిన జడ్జిగారు.. దొంగపోలీసురెడ్డి గారిని ఏ-2గా గుర్తించి, ఆయనగారిపై కేసు పెట్టమని ఆదేశించారు. ఈ కుక్కర్తి కథ తెలిసిన పోలీసులు దొంగపోలీసు మహేశ్వర్‌రెడ్డిని చూసి అసహ్యించుకుంటున్నారట. ఈ వింత దొంగపోలీసు కథేమిటో చూద్దామా?
తిరుపతిలో ఓ ఖరీదైన ఉంగరం దొంగతనం కేసులో ఏకంగా సీఐని నిందితుడిగా చేర్చిన అంశం హాట్ టాపిక్ గా మారింది. బంగారంతో చేసిన ఆ ఉంగరం బరువు ఏకంగా 36 గ్రాములు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఫోటోలతో ఆ ఉంగరాన్ని 36 గ్రాముల బంగారంతో తయారు చేయించారు. ఆ ఉంగరాన్ని టీడీపీ నాయకుడు జయరామి రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ నెలలో తిరుపతిలోని ఓ రెస్టారెంట్ లో పోగొట్టుకున్నారు. వెంటనే జయరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
రెస్టారెంట్ లోని ఓ కార్మికుడు దానిని తీసుకున్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. సాక్ష్యాధారాలతో సహా తూర్పు పట్టణ పోలీస్ స్టేషన్ లో నిందితుడిని బాధితుడు జయరామిరెడ్డి అప్పగించారు. బాధితుడిని విచారణ పేరుతో మూడు రోజులపాటు స్టేషన్ చుట్టూ తిప్పుకొన్న సీఐ.. అతనిపై కేసు నమోదు చేయకుండా వదిలేశారు.
కేసు నమోదు చేయకపోవటంపై ప్రశ్నిస్తే చంద్రబాబు, లోకేష్ ఫోటోలు ఉన్నాయి కనుక పట్టించుకోలేదని.. ఎవరు కేసు నమోదు చేస్తారంటూ సీఐ మహేశ్వర్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితుడు జయరామిరెడ్డి తెలిపారు.దీంతో జిల్లా ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని అన్నారు.
కేసు నమోదు చేయకపోగా నిందితుడ్ని వదిలివేయడంతో కోర్టులో ప్రైవేట్ గా పిటిషన్ వేశానని బాధితుడు జయరామిరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేయకపోవడంతో పాటు నిందితుణ్ని వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. సీఐ మహేశ్వర్ రెడ్డిని ఏ2 గా కేసులో చేర్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.