Suryaa.co.in

Andhra Pradesh

ధర్మారెడ్డిపై విచారణ వేగవంతం చేయాలి

-ధర్మారెడ్డి తిరిగి ఈ నెల 30వ తేదీ వరకు పెట్టుకున్న లీవ్ అర్జీని చీఫ్ సెక్రటరీ రద్దు చేయాలి
-ధర్మారెడ్డి ని అరెస్టు చేసి సమగ్రమైన “సిట్” సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా దర్యాప్తు జరిపించాలి
-బీజేపీ నేత నవీన్‌కుమార్‌రెడ్డి డిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రకటించిన విధంగా టీటీడీ లో అవినీతి అక్రమాలు బహిర్గతం కావాలన్నా, చేయాలన్నా ధర్మారెడ్డిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకొని విచారణ వేగవంతం చేస్తే నమ్మలేని నిజాలు భక్తకోటికి తెలుస్తాయ ని బీజేపీ నేత నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో సకల శాఖల అధిపతిగా పెత్తనం చెలాయించి ఐఏఎస్ అధికారి శ్యామలరావుకి బాధ్యతలు అప్పగించే దృశ్యాలను ఫోటోలను సైతం భక్తులకు, మీడియాకు పంపద్దని ఫోటోగ్రాఫర్ ను బ్రతిమలాడటంలోని ఆంతర్యం ఏమిటి మిస్టర్ ధర్మారెడ్డీ?

టిటిడి ఫుల్ అడిషనల్ చార్జ్ ఈఓ బాధ్యతల నుంచి మాత్రమే ధర్మారెడ్డి తప్పుకున్నారు. అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఈవో గా ఈ నెల 30 వరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పొడిగించడం అందరికీ తెలిసిన విషయమే. మరి తిరిగి 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు లీవు కోరుతూ, చీఫ్ సెక్రటరీ కి రిక్వెస్ట్ పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు?

తిరుమలలో ఐఏఎస్ అధికారి శ్యామల రావు బాధ్యతలు స్వీకరించి భక్తుల సౌకర్యాలపై రివ్యూ చేస్తూ అన్నదానం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్,కళ్యాణకట్టలలో పర్యటిస్తుంటే దగ్గరుండి వివరించాల్సిన అడిషనల్ ఈవో ధర్మారెడ్డి తప్పించుకొని లీవ్ లో పారిపోవడం లోని ఆంతర్యం ఏమిటి?

టీటీడీ ఈవోగా ఎంతోమంది పనిచేశారు బదిలీ,పదవీ విరమణ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆలయ మర్యాదల ప్రకారం “మేల్ చాట్ వస్త్రం” తో మర్యాద చేసి పంపడం అనేక సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. మరి ధర్మారెడ్డి పదవీ విరమణ ఈనెల 30 వరకు ఉంది. ప్రస్తుతం టీటీడీ లో అడిషనల్ ఈఓ గా ఉండగనే ఎవరికీ తెలియకుండా, ఆలయంలో మర్యాదలు చేయించుకొని అర్చకులు వేసిన మేల్ చాట్ వస్త్రాన్ని సైతం, భుజంపై వేసుకొని హుందాగా బయటకు రాకుండా, లోపలే తీసేసి ఫోటోలు సైతం తీయనీయకుండా ఎవరికి తెలియకుండా లారీలలో సామానులు సర్దుకొని పలాయనం చిత్తగించడం వెంకన్న లీలలలో ఓ భాగం అన్నారు.

తిరుమల కొండపై ధర్మారెడ్డి అభద్రతాభావంతో “కుడితిలో పడ్డ బల్లి” లా మీడియా కన్ను కప్పి తప్పించుకోవచ్చునేమో గానీ, భగవంతుని కోర్టులో తప్పించుకోలేవు శిక్ష తప్పదన్నారు

LEAVE A RESPONSE