Suryaa.co.in

Andhra Pradesh

అ‘ధర్మారెడ్డి’..భూమన అవినీతి లెక్క తేల్చాల్సిందే

-తిరుమలలో వారి అక్రమాలపై విచారించండి
-సీఐడీ విచారణ జరిపించాలి
-ఏపీ సీఎస్‌కు టీడీపీ నేత విజయకుమార్, మాల్యాద్రి వినతి

అమరావతి: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలపై సీఎస్ నీరభ్ కుమార్‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. వైసీపీకి లబ్దీ చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సాంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని, కాబట్టి వారిపై సీబీ సీఐడి లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని కోరారు.

లేఖలోని ప్రధాన అంశాలు:

* రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే సాంప్రదాయానికి విరుద్ధంగా ఐఏఎస్, అధికారికి కాకుండా ధర్మారెడ్డిని జేఈఓ గా.. తరువాత ఈఓ గా జగన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది.
* తిరుమల శ్రీవారిని దర్శించుకునే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేస్తూ, ఎన్నికల సమయంలో వైసీపీకి విరాళాల సేకరణకు మార్గంగా ధర్మారెడ్డి వ్యవహరించారు.
* తిరుమలలో గెస్ట్ హౌస్‌లకు కేటాయించే భూముల్లో కూడా ధర్మారెడ్డి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ను పాటించలేదు. ఫర్నిచర్ల మార్పు పేరుతో కోట్ల రూపాయిలు పక్కదారి పట్టించారు.
* భక్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా…. జగన్ రెడ్డిపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, వైసీపీ రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టేందుకు ధర్మారెడ్డి ఢిల్లీకి తరచూ వెళ్తుండేవారు.
* ధర్మారెడ్డి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే, క్రిమినల్ కేసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు ఢిల్లీలో ఆయన రాజకీయ ప్రమేయం, కుతంత్రాలు స్పష్టంగా తేటతెల్లమవుతాయి.
* 2 కోట్లు విలువ గల డైమెండ్ వాచ్‌ను హైకోర్టు జడ్జికి ఆఫర్ చేసారనే వదంతులు కూడా ధర్మారెడ్డిపై ఉన్నాయి.
* మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలిద్దరూ బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా సివిల్ కాంట్రాక్టులకు టీటీడీ నిధులను పక్కదారి పట్టించారు.
* బడ్జెట్ పరిమితిని అధిగమించి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రూ. 475 కోట్లకు పెంచగా.. అనంతరం చైర్మనైన కరుణాకర్ రెడ్డి భారీగా రూ.1,772 కోట్లకు పెంచి తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారు.
* ఎన్నికల్లో అభినయ్ రెడ్డికి లబ్దీ చేకూర్చేందుకు టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలు తెగబడ్డారు.
* శ్రీవాణి టెకెట్లు పేరుతో రూ.10,500 వసూలు చేసి ఆ డబ్బులు ఏ రకంగా ఖర్చు చేశారో చూపించలేదు.
* ఎవరు టీటీడీకి విరాళాలు ఇచ్చినా అవి శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్‌లోకి జమవ్వడంతో, టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఏ పని అయినా చేసుకునేలా అవకాశం కల్పించారు.
* పద్మావతి ఆసుపత్రి(రూ.550 కోట్లు), బాలాజి ఇన్స్‌టిట్యూట్(రూ.324 కోట్లు), స్విమ్స్ కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణాల్లో కూడా భారీ అక్రమాలకు పాల్పడ్డారు.
* ఆసుపత్రుల నిర్మాణానికి రూ.1 కోటి నుంచి 1.5 కోట్లు విరాళం ఇచ్చే భక్తులకు, 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు ఇచ్చి భారీ కుంభకోణానికి తెర లేపారు.
* రూ.200 కోట్లతో తిరుమలలో కర్ణాటక ప్రభుత్వ యాత్రా సముదాయం నిర్మాణం విషయంలో, టిటిడి కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిర్మాణ పనులు చేపట్టడానికి అనుమతించాలని ఒత్తిడి తెచ్చింది
* తిరుమలలో గెస్ట్ హౌస్‌ల నిర్మాణం, విరాళాల విషయంలో వ్యక్తిగత దాతల విషయంలో టిటిడి పూర్తిగా భిన్నమైన పద్ధతిని అవలంబించింది.
* తిరుమల కాంప్లెక్స్ 5 నిర్మాణంలో రూ.98 కోట్లు కమిషన్ల రూపంలో పక్కదారి పట్టాయి
* వైసీపీ బడా నాయకుల సిఫార్సు చేసిన వారినే టీటీడీలోని సలహాదారులను, ఉద్యోగులుగా ధర్మారెడ్డి నియమించారు.
* కాబట్టి ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై సీబీ సీఐడి లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించి అక్రమాలను వెలుగు తీయాలి.

LEAVE A RESPONSE