Suryaa.co.in

Andhra Pradesh

చేనేత కళాకారులకు వివిధ పథకాలతో ప్రోత్సాహం

– కలెక్టర్‌ నాగలక్ష్మి

గుంటూరు: చేనేత పరిశ్రమ అభివృద్ధికి, చేనేత కళాకారులకు అధిక ఆదాయం అందించి వారి జీవన ప్రమాణాల పెంపుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా రాయితీతో ఆర్దిక సహాయం అందించి ప్రోత్సహిస్తుందని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు.

కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో ​బుధవారం 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మీ మాట్లాడారు. స్వాత్రంత్య సంగ్రామంలో 1905 ఆగష్టు 7 వ తేదీన జరిగిన విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమ స్పూర్తితో అదే రోజు జాతీయ చేనేత దినోత్సవం అధికారికంగా నిర్వహించటానికి 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. జిల్లాలో మంగళగిరితో పాటు ఫిరంగిపురం, తెనాలి, పొన్నూరు లలో చేనేత క్లస్టర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

చేనేత పరిశ్రమ అభివృద్దిలో భాగంగా స్మాల్ క్లస్టర్ల డెవల్మేంట్ ప్రొగ్రాంలో అన్ని రకాల వసతులతో హ్యడ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఫిరంగిపురం, తెనాలి, పొన్నూరు ప్రాంతాల్లోను క్లస్టర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చేనేత కళాకారులు అన్ని విధాల ప్రోత్సహించటానికి అవసరమైన రుణాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ​

వీవర్స్ సర్వీస్ సెంటరు ఉప సంచాలకులు అనిల్ సాహు మాట్లాడుతూ చేనేత పరిశ్రమను ప్రోత్సహించటానికి సొసైటీలకు, వ్యక్తిగతంగా బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తుందన్నారు. మార్కెటింగ్, ప్రొమోషన్ లో భాగంగా దేశ వ్యాప్తంగా వీవర్స్ సర్వీస్ సెంటరు ఆధ్వర్యంలో జరిగే ఎగ్జిబిషన్ లలో చేనేత కళాకారులే నేరుగా తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.

​జిల్లా చేనత, జౌళి శాఖ సహాయ సంచాలకులు వనజ మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ 2015 ఆగష్టు 7 తేదిన ప్రారంభించారన్నారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలకు వ్యక్తిగతంగా, సొసైటీలు దరఖాస్తుల అందిస్తే వాటిని జిల్లా కలెక్టర్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.

జిల్లాలో రూ.1.7 కోట్లు చేనేత కళాకారులకు ముద్రా పథకం ద్వారా రుణాలు అందిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పరిశ్రమ అభివృద్దికి అమలు చేస్తున్న కార్యక్రమాలపై అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

​సమావేశంలో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ చేనేత దినోత్సం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంను సభలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చేనేత కళాకారులు, సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE