Suryaa.co.in

Telangana

రైతు భరోసా ఎగ్గొట్టారు ..పంటలకు బోనస్ బోగస్ చేశారు

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆంజనేయ గౌడ్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో వారు రైతు రుణమాఫీ, అవినీతి, రాజకీయ సమస్యలు గురించి మాట్లాడారు.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, “రైతు రుణ మాఫీ రైతు పక్షం కాదు, ప్రభుత్వ పక్షమని మొదట్నుంచి చెబుతూనే ఉంది. అర్హులై ఉండి రుణమాఫీ కాని రైతులు పిర్యాదు చేయాలని ఫోన్ నెంబర్ ఇస్తే వేలాది ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్ లు వచ్చాయి. దాదాపు 3,500 ఫోన్ కాల్స్ వచ్చాయి, 40 వేలకు పైగా వాట్సాప్ మెసేజ్ ల ద్వారా రైతులు పిర్యాదు చేశారు,” అన్నారు.

“రైతు రుణమాఫీ ఏ స్థాయి లో అమలవుతుందో తెలంగాణ భవన్ ఫోన్ నెంబర్ కు వచ్చిన పిర్యాదులే సాక్ష్యం. రేషన్ కార్డు లంకె పెట్టడం లేదని పై స్థాయిలో చెబుతున్నా క్షేత్ర స్థాయి లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని మాకందిన ఫిర్యాదులు చెబుతున్నాయి. ఆధార్ కార్డు లో చిన్న తప్పులు ఉన్నాయని రైతు రుణమాఫీ కావడం లేదని ఫిర్యాదులు అందాయి. కొందరికి వీసా ఉందని రైతు రుణమాఫీ తిరస్కరిస్తున్నారు. కొన్ని తండాల్లో భూ రికార్డులు సరిగా లేవని రుణ మాఫీ చేయడం లేదు,” అని సుదర్శన్ రెడ్డి వివరించారు.

“బీ ఆర్ ఎస్ ఒత్తిడితో కేవలం దేవుళ్ళ మీద ఒట్లు వేశానని రేవంత్ రెడ్డి తూతూ మంత్రంగా రుణ మాఫీ చేస్తున్నారు. రైతు పంట రుణాల ఆధారంగా అందరికీ రుణ మాఫీ చేయాలనీ బీ ఆర్ ఎస్ డిమాండ్ చేస్తోంది. రైతు భరోసా ఎగ్గొట్టారు, పంటలకు బోనస్ బోగస్ చేశారు. రైతు భరోసా, బోనస్ డబ్బులు మిగుల్చుకుని ఆ డబ్బులను రుణ మాఫీకి కేటాయించారు. బ్యాంకర్లకు లేని నిబంధనలు ప్రభుత్వానికి ఎందుకు?” అని ప్రశ్నించారు.

“కేసీఆర్ హయం లో రైతులకు రైతు బంధు రూపం లో 72 వేల కోట్ల రూపాయలు, రుణమాఫీ రూపం లో మరో 30 వేల కోట్ల రూపాయలు అందించారు. మా ఫిర్యాదుల నెంబర్ కు గంటకు దాదాపు 900 ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే రైతులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కి దమ్ముంటే క్షేత్ర స్థాయి లో రైతు సదస్సులు పెట్టి రుణ మాఫీ పై సమీక్ష చేయాలి,” అన్నారు.

కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ, “ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కు జరిగిన అవమానం సంపత్ చేసింది కాదు సర్కారే చేసింది. రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పెట్టుకుని ఊరేగుతారు. ఆ రాజ్యాంగాన్ని తుమ్మిళ్ల లో సంపత్ అవమానించారు. తుమ్మిళ్ల లిఫ్టు నే కాదు ఆ నీళ్లను తాకే అర్హత కూడా కాంగ్రెస్ కు లేదు. నడిగడ్డ లో కాంగ్రెస్ రక్తం పాటిస్తే బీ ఆర్ ఎస్ ప్రభుత్వం నీళ్లు పారించింది,” అన్నారు.

మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆంజనేయ గౌడ్ లు రైతు రుణమాఫీ, అవినీతి, రాజకీయ సమస్యలు గురించి తీవ్ర విమర్శలు చేశారు. బీ ఆర్ ఎస్ రైతుల పక్షాన పోరాడుతుందని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE