-
పోలీస్ అధికారులైన సునీల్ కుమార్, సీతారామాంజనేయులు ను వెంటనే సస్పెండ్ చేయాలి
-
ఇప్పుడు న్యాయం జరగకపోతే న్యాయ, పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం
-
తన పేరున్న అక్షరాలపై జరిగిన దాడిని , మహానుభావుడైన అంబేద్కర్ పైన జరిగిన దాడిగా జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించడం హాస్యాస్పదం
-
రాష్ట్రంలో హింసను ప్రేరేపించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని రెచ్చగొట్టడం దారుణం
-
తక్షణమే తన స్టేట్మెంట్ ఉపసంహరించుకొని, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు స్పష్టత ఇవ్వాలి
-
ఉండి నియోజకవర్గ పరిధిలో మంచినీటి సరఫరాకు పైప్ లైన్ టెస్టింగ్ కంప్లీట్
-
ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు
ఉండి: పోలీస్ కస్టడీలో నన్ను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ప్రధాన పాత్రధారులైన విజయ్ పాల్, ఐపీఎస్ అధికారులైన సునీల్ కుమార్, సీతారామాంజనేయులుతో పాటు సూత్రధారులను తక్షణమే అరెస్టు చేయాలని ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులైన పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కేసు గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో ఏమవుతుందని వారిలో ఉత్కంఠ నెలకొంది. ఒక మాజీ ఎంపీ, ప్రస్తుత అధికార పార్టీ శాసనసభ్యునికి ఇంత దారుణంగా అన్యాయం చేశారని అందరికీ తెలిసినప్పటికీ, ఇప్పుడు న్యాయం జరగకపోతే న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థపై కూడా ప్రజలకు పూర్తిగా నమ్మకం సన్నగిల్లే అవకాశముందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
శనివారం ఉండి నియోజకవర్గ కేంద్రంలో ఆయన వివిధ అంశాలపై మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కేసులో తప్పకుండా త్వరితగతిననే విచారణ పూర్తవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జరగాల్సిన అరెస్టులు జరుగుతాయని పరిపూర్ణ విశ్వాసం నాకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది.
అందుకే వారు దేశంలోనే పేరు మోసిన క్రిమినల్ లాయర్ సిద్ధార్థ లూత్రా ను తమ తరఫున వాదించేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఎంగేజ్ చేసుకున్నారంటే, ఈ సంఘటన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎంత సీరియస్ గా తీసుకుందో సూచిస్తోందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునేవారు, లక్షలాదిగా నన్ను అభిమానించే, అభిమానులంతా నిన్న జరిగిన సంఘటన ఒక శుభవార్త గా భావించాలన్నారు.
నన్ను అభిమానించే వారికి, నా మేలు కోరుకునే మిత్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. ఈ కేసులో నిజ దోషులు తప్పకుండా శిక్షింపబడతారనే పరిపూర్ణ విశ్వాసం నాకుందని ఆయన పేర్కొన్నారు.
ఇంట్రీమ్ బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమైన విజయ్ పాల్
ప్రస్తుతం పరారీలో ఉన్న విజయపాల్ హైకోర్టులో ఇంట్రీమ్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఒక అబద్ధాన్ని చెప్పి నిజాన్ని, మరుగున పెట్టాలని విజయ పాల్ చేసిన ప్రయత్నం వృధా అయ్యింది. అతి దారుణంగా హింసించి, తమకేమీ తెలియదు అన్నట్టుగా వ్యవహరించడం విడ్డూరం. నా కాళ్లకు తగిలిన గాయాలను చూసి మెజిస్ట్రేట్ కంగారుపడి రెండు ఆసుపత్రుల నుంచి నివేదికలను తీసుకురావాలని ఆదేశించింది.
నా కాళ్లు పింక్ కలర్ లో ఉంటాయి. నన్ను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినప్పుడు, అరికాళ్లు పూర్తిగా రక్తపు చారికలతో కూడిన గీతలతో కనిపించగానే మెజిస్ట్రేట్, ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు, ప్రైవేట్ ఆసుపత్రిలోనూ చికిత్స చేయించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. అయితే, అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆయన బృందం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభావతిని ప్రభావితం చేసి తప్పుడు నివేదికను అందజేశారు.
ఒరిజినల్ రిపోర్ట్ లు నా వద్ద ఉన్నాయి. వాటిని నేను సబ్మిట్ చేశాను. ఫ్రాడ్ చేసిన పాల్ అండ్ అదర్స్ మా వద్ద ఉన్నంత సేపు ఏమీ కాలేదని, సికింద్రాబాద్ హాస్పిటల్ కు తీసుకు వెళ్లే టైం లోనే ఏమైనా అయి ఉంటుందేమోనని వితండ వాదనను వినిపించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ సమర్పించి విజయ్ పాల్ చేయాలనుకున్న మోసాన్ని ఎండ కట్టడం జరిగిందన్నారు.
తనకు జరిగిన అవమానాన్ని అంబేద్కర్ కు జరిగిన అవమానంగా చిత్రీకరించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం
తనకు జరిగిన అవమానాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు జరిగిన అవమానంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. విజయవాడలోని పిడబ్ల్యూ డి గ్రౌండ్స్ లో గత ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ పేరుతో పాటే, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్మోహన్ రెడ్డి పేరును కూడా తాటి చెట్టు అంతా అక్షరాలతో రాశారు.
ప్రపంచంలో ఎక్కడా కూడా విగ్రహావిష్కర్త పేరును ఇంత పెద్ద అక్షరాలతో రాసిన దాఖలాలు లేవు. రాష్ట్రంలోనే కాదు… దేశంలోనూ ఇటువంటి సాంప్రదాయం లేదు. అంబేద్కర్ ను అన్ని వర్గాల ప్రజలు కుల మతాలకతీతంగా ఆరాధించి, గౌరవిస్తారు. ఆయన బుద్ధిష్ట్ అయినప్పటికీ కూడా హిందువులు, క్రిస్టియన్లతో పాటు అన్ని మతాలకు చెందిన వారు అంబేద్కర్ ను ఒక గొప్ప జాతీయ నాయకుడిగా గౌరవిస్తారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన వారైనా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనా అంబేద్కర్ ను పార్టీలకతీతంగా ప్రేమిస్తారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినచోట జగన్మోహన్ రెడ్డి పేరును తాటి కాయంత అక్షరాలతో రాసుకున్నారు. ఆయన పేరుతో కూడిన అక్షరాలపై దాడి జరిగితే, తనకు జరిగిన అవమానాన్ని అంబేద్కర్ కు జరిగిన అవమానంగా ప్రజలను రెచ్చగొట్టే రీతిలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం సబబు కాదు. ఇది మంచి సంప్రదాయం కాదు. బ్యాడ్ టెస్ట్ అంటూ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.
తెలంగాణలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే 125 కోట్ల రూపాయలు ఖర్చుకాగా, విజయవాడలో ఏర్పాటు చేసిన విగ్రహం ఒకటి, రెండు అడుగులు ఎక్కువ ఎత్తులో ఉన్నంత మాత్రాన ఎందుకని 250 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయో వారికే తెలియాలి. జగన్ అనే అక్షరాలపై జరిగిన దాడిని, ఆ మహానుభావుడిపై జరిగిన దాడిగా చిత్రీకరిస్తూ సాక్షి దినపత్రికలో పుంకాను పుంకాలుగా వార్తలు రాయడమే కాకుండా, అందరితోనూ సమావేశాలు పెట్టించి, అంబేద్కర్ అభిమానుల్లో లేనిపోని అలజడి సృష్టించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధ్యతాయుతమైన మీడియా రంగంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే పేరు పై దాడి చేయడం ఏమిటని, ఎంతో కష్టపడి పనిచేసినందుకు ఇలా దాడి చేయడం సమంజసమేనా అని ప్రశ్నించాలి కానీ, ఆ మహానుభావుడి పై దాడి జరిగినట్లుగా చిత్రీకరించడం పూర్తిగా బాధ్యతారాహిత్యమేనని అన్నారు.
ఇప్పటికైనా ప్రజలకు స్పష్టతను ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పై ఉందని పేర్కొన్నారు . అంబేద్కర్ అభిమానులను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తన స్టేట్మెంట్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.
నిజం చెప్పినందుకు చంపాలని చూశారు
ప్రస్తుతం వైకాపాలో రాజీనామాల పర్వం కొనసాగుతుందని, ఇదే నిజాన్ని నేను నాలుగేళ్ల ముందే చెప్పినందుకు నన్ను చంపాలని చూశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అళ్ల నాని వైకాపాకు రాజీనామా చేయడమే కాకుండా, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే ధర్మాన ప్రసాదరావు పార్టీకి రాజీనామా చేశారు. దొరబాబు , జనసేన పార్టీలో చేరారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా వీరి బాటలోనే పయనించనున్నారు. క్షవరం అయితే తప్ప వివరం తెలియదన్నట్లుగా ఓడిపోయిన తర్వాత వీరంతా రాజీనామాలు మొదలుపెట్టారు. నేను నాలుగేళ్ల క్రితమే ఈ విషయం చెప్పాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాస్తవ పరిస్థితులను గ్రహించలేదు. భూకంపం వస్తుందంటే జియో లాజికల్ డిపార్ట్మెంటైన కనుక్కోవడంలో విఫలమవుతుందేమో కానీ కుక్కలు, ఎలుకలు పసి కడతాయి.
అలాగే నేను పార్టీలో నెలకొనబోయే సంక్షోభాన్ని ముందే ఊహించి హెచ్చరించాను. నిజం చెప్పిన నన్ను చంపాలనుకున్నారు. పాల్, సునీల్ తో కలిసి నాపై ఆ ప్రయోగాన్ని చేశారు. అలాగే నిజం మాట్లాడినందుకు నన్ను డిస్ క్వాలిఫై చేయాలని పిచ్చి పిచ్చి వేషాలు వేశారు. నా మాట పెడచెవిన పెట్టినందుకు ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. వైకాపా ఖాళీ అయ్యే ప్రమాదం నెలకొంది.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయాన్ని ఎత్తేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలలో స్తబ్దత, పార్టీ నాయకులలో నిస్సత్తువ నెలకొంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కామ్మంటే, ప్రతిపక్ష నేత హోదా ఇస్తే కానీ రానని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అసెంబ్లీకి హాజరుకాకపోతే ఆ పక్కన ఇంకా ఎంతమంది మిగులుతారో తెలియదు.
ఇటీవల అసెంబ్లీలో కలిసినప్పుడు ఒక సహచర ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిగా శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని నేను, జగన్మోహన్ రెడ్డికి సూచించానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అసెంబ్లీకి హాజరైతే జగన్మోహన్ రెడ్డికి మాట్లాడేందుకు ఎందుకు అవకాశం ఇవ్వమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇటీవల ఎక్కడో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేయడం చూశామన్నారు.
ఉండి నియోజకవర్గంలో అనుకున్న పనులు అనుకున్నట్లుగానే కొన సాగుతున్నాయి
ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అనుకున్న పనులు అనుకున్నట్లుగానే కొనసాగుతున్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇటీవల తుఫాన్, వరదలు , తరచూ కురిసే వర్షాల కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ, అనుకున్న పనులన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి. మంచి నీటి సరఫరా కోసం పరిమళ దగ్గర నుంచి 12 కిలోమీటర్ల మేరకు లైన్ టెస్టింగ్ పూర్తయింది. గతంలో ఒక దగ్గర బుల్డోజర్ తో పనులు చేస్తుండగా రెండు, మూడు పైపులైను పక్కన పెట్టడం జరిగింది.
తొలగించిన పైప్ లైన్లను యధావిధిగా అమర్చి పరీక్షించాం. ఆగస్టు 15 నాటికి తొలుత మంచి నీటిని సరఫరా చేయాలని భావించాం. కానీ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పనులు కాసింత ఆలస్యం కావడంతో ఈ నెలాఖరు నాటికి నియోజకవర్గ పరిధిలోని దాదాపు 55 హ్యాబిటేషన్లకు మంచినీటి సరఫరాను చేయడం జరుగుతుంది. అయితే ముందుగా చెప్పినట్టుగానే ఆగస్టు 15వ తేదీన మంచినీటి సరఫరాను ప్రారంభిస్తున్నప్పటికీ, లబ్ధిదారులు మాత్రం పొరుగు నియోజకవర్గమైన గనపవరం మండలంలోని మూడు గ్రామాల ప్రజలని తెలిపారు.
ఈ నెలాఖరున కొన్ని గ్రామాలకు, డిసెంబర్ చివరి నాటికి 80 హ్యాబిటేషన్లకు మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టడం జరుగుతుందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. మంచినీటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఒకవేళ ఆయన స్వయంగా రాలేక పోతే, వర్చువల్ గానైనా పెద్దలు చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా మంచినీటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు .
డ్రైన్లు, కాలువలలో పూడికతీత పనులు ప్రారంభం
ఉండి నియోజకవర్గ పరిధిలోని డ్రైన్లలో రెండు నుంచి మూడు అడుగుల మేర మట్టి పేరుకు పోయిందని, డ్రైన్లు, కాలువలలో పూడికతీత పనులను ఆదివారం నాడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టించి ప్రారంభించనున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 1979లో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో డ్రైన్లలో పూడికతీత పనులను చేపట్టారని, అప్పటినుంచి వాటిని పట్టించుకోలేదన్నారు.
ఇప్పుడు మళ్లీ డ్రైన్లలో పూడిక తీత పనులను చేపడితే మరో అయిదారేళ్ల పాటు వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదు. తొలుత జువ్వలపాలెం నుంచి కలవపూడి వరకు ప్రధాన డ్రైన్ లో మట్టి పూడిక తీత పనులను చేపట్టడం జరుగుతుంది. ఆ తరువాత ప్రధాన డ్రైన్లలో పూడికతీత పనులను కొనసాగిస్తాం. ప్రజలు, స్థానిక రైతుల సహకారంతోపాటు, తమ వద్ద ఉన్న ఫండ్స్ తో ఈ పనులను చేపట్టడం జరుగుతుంది.
ఇప్పటివరకు ప్రభుత్వం డ్రైన్లలో పూడికతీత పనులను చేపట్టలేదు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన నియోజకవర్గ పరిధిలో తొలుత కాలువలు, డ్రైన్లలో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకుతో పాటు, కిక్కిసా వేర్లను తొలగించడం జరిగింది. మూడు నెలల వ్యవధిలో అన్ని డ్రైన్లో పూడికతీత పనులను పూర్తి చేస్తామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కాలువలలో ఉన్నంతగా నీటి ప్రవాహం, డ్రైన్లలో ఉండడం లేదని స్థానికులు నాకు పదే పదే ఫిర్యాదు చేశారు.
చేపల చెరువు ల నుంచి నీటిని డ్రైన్లలో వదిలితే, నీటి ప్రవాహం నెమ్మదిగా వెళుతుందని చెప్పారు. స్థానిక ప్రజలు, రైతుల కోరిక మేరకు డ్రైన్లలో పూడిక తీత పనులను చేపట్టి మరో ఐదు నుంచి 10 ఏళ్ల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు.
ఉండి పార్క్ అభివృద్ధి చేశాం… తరువాత ఆకివీడు పార్క్ అభివృద్ధి చేస్తాం
ఉండి పట్టణ కేంద్రంలోని అబ్బయ్య రాజు పేరిట ఉన్న పార్కును అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, రెండవ దశలో ఆకివీడులోని కాటన్ పార్క్ అభివృద్ధి చేస్తామని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. ఆకివీడు పార్కు అభివృద్ధి కోసం అవసరమైతే టూరిజం కార్పొరేషన్ సహాయ సహకారాలను తీసుకోనున్నట్లు వెల్లడించారు.
పాలకోడేరు పాఠశాలను ఆగస్టు 15వ తేదీన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మైదానాలను అభివృద్ధి చేసి క్రీడా ప్రాంగణాలుగా తీర్చేదిద్దే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుందన్నారు.
ఈ నెల 15వ తేదీన చాలా ప్రభుత్వ పాఠశాలలలోని క్రీడా ప్రాంగణాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న 24 పాఠశాలలను పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుంది. ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో క్రీడా మైదాన సౌకర్యం ఉండాలన్నారు. ప్రభుత్వ నుంచి చిల్లి గవ్వ ఆర్థిక సహాయం ఆశించకుండా ఉండి నియోజకవర్గ పరిధిలో ని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోని క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసినట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు.
చంద్రబాబు ఆశయాలను ఆశించిన దాని కంటే వేగంగా అమలు చేద్దాం
ప్రజలు భాగస్వాములై మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలన్న
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలను ఆశించిన దాని కంటే వేగంగా పూర్తి చేద్దామని రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమం పేరుతో ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేశారు.
ఇప్పుడు జన్మభూమి 2.0 పేరు తో ఆయన పిలుపు ఇవ్వడం కంటే 45 రోజుల ముందే, అదే స్ఫూర్తితో ఉండి నియోజకవర్గంలో ప్రజలు, నా మిత్రుల సహకారంతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నాం. డిసెంబర్ నాటికి అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తో పాటు, జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు.
ఉండి నియోజకవర్గ పరిధిలోని నాలుగు సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు రక్షిత మంచినీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు, బాత్రూమ్లలో నీటి వినియోగానికి ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణంతోపాటు, విద్యార్థులకు మంచాలు, పరుపులు, ఫ్యాన్ లను అందజేయడం జరిగిందన్నారు. సిమెంటు పనులే వర్షాల కారణంగా కాస్త ఆలస్యం అయ్యాయని తెలిపారు. జిల్లా యంత్రాంగం తో పాటు, ఎమ్మార్వో, ఎండిఓ, అగ్రికల్చర్ అధికారులు, పోలీసు సిబ్బంది కలిసి ఒక టీం గా పనిచేస్తున్నామని రఘురామ కృష్ణంరాజు వివరించారు.
మోడల్ నియోజకవర్గంగా ఉండిని తీర్చి దిద్దుతా
ఉండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉండి ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు ఆదేశించారన్నారు. రాజుగారు.. మీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి అని ఆయన నాకు చెప్పారని, ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అని ప్రజల సహకారంతో అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని ముఖ్యమంత్రికి మాట ఇచ్చానని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అవసరమైనప్పుడు ముఖ్యమంత్రిని కలిసి అడగనున్నట్లు తెలిపారు. ప్రజలు మంచి వాళ్లని అభివృద్ధి పనులను చేస్తామంటే ముందుకు వచ్చి సహాయ, సహకారాలను అందిస్తారన్నారు. ఉండి నియోజకవర్గాన్ని ఒక టెస్ట్, షోకేస్ గా నిరూపించాలని భావిస్తున్నట్లు తెలిపారు.