Suryaa.co.in

Andhra Pradesh

నిత్యం ప్రజా పక్షంగానే ఉన్న ప్రజానేత.. చంద్రబాబు!

– మంత్రి అనగాని సత్యప్రసాద్‌

అమరావతి: ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేసి, 30వ ఏడాదిలోకి ప్రవేశించిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడుకి హార్ధిక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.

ఆయన ఏమన్నారంటే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ ప్రజా పక్షంగానే వ్యవహరించిన ప్రజా నేత చంద్రబాబు. ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చిన తొలి ముఖ్యమంత్రి. తన పాలనా దక్షతతో సీఎం కాదు సీఇవో అంటూ అంతర్జాతీయ సమాజంచే అభినందనలు అందుకున్న నేత. అనాడు విజన్ 2020 పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను, నేడు విజన్ 2047 పేరుతో నవ్యాంధ్రను ప్రగతి పట్టాలపై పరుగులు పెట్టించిన విజనరీ. తన దార్శినికతతో హైదరాబాద్ ను ఐటి రంగంలో మేటి నగరంగా తీర్చిదిద్దిన పాలకుడు.

ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ వారి కుటుంబంలో ఒక్కడిగా వారి సమస్యలను తీర్చే నేత. గత ఎన్నికల్లో అసాధారణ విజయంతో నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రగతిని, సంక్షేమాన్ని సమాన పాళ్లలో ముందుకు తీసుకెళ్తున్న సమర్ధవంతమైన పాలకుడు. 74 ఏళ్ల వయస్సులో ప్రజా శ్రేయస్సు కోసం అవిశ్రాంతంగా కష్టపడుతున్న చంద్రబాబు రానున్న రోజుల్లో మరింత కాలం ప్రజల సేవలో ఉండాలని రాష్ట్ర ప్రజల కోరిక. డైనమిక్, విజనరీ, హార్డవర్కర్ అయిన చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం మా అందరికీ గర్వకారణం.

LEAVE A RESPONSE