డాక్టర్ ఎడుగూరిసందింటి రాజశేఖరరెడ్డి.. తెలుగు ప్రజలంతా తమ సొంత మనిషిలా, ఇంట్లోని వ్యక్తిలా పిలుచుకునే వైఎస్! మానత్వం మూర్తీభవించిన మహా మనీషి. తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు. జనరంజక పాలనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న నేత. ప్రజాశ్రేయస్సే పరమావధిగా పాటుపడిన నాయకుడు. రైతు పక్షపాతిగా పేరొందిన కృషీవలుడు. అన్నదాతల కళ్లలో ఆనందం చూడడం కోసం ఎంతకైనా వెళ్లేందుకు సిద్ధమన్న ధీరోదాత్తుడు. దేశంలోనే తొలిసారిగా రైతులకు ఉచిత విద్యుత్తు అందించిన మహానుభావుడు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని తేల్చి చెప్పిన దార్శనికుడు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని నమ్మిన గొప్ప నేత. అన్ని రంగాలకూ సమప్రాధాన్యమిచ్చి.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడిన మహా నేత.
ప్రజా సంక్షేమం, సుపరిపాలనతో దేశానికే ఆదర్శంగా నిలవడమే కాదు.. తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు వైఎస్. జీవితాంతం తను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారు. నేతలకు కాదు.. రాజకీయాలకే రోల్ మోడల్‌గా నిలిచారు. ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల మధ్యే ఉండేవారు. ఎన్ని కష్టాల్లో ఉన్నవారైనా ఆయన్ను కలిసిన తర్వాత సంతోషంగా తిరిగి వెళ్లేవారు. సీఎంగా దాదాపు ఐదేళ్ల 3 నెలలు పనిచేసినా.. కొన్ని తరాల పాటు జనం మరిచిపోలేనంత పేరు ప్రఖ్యాతులను సంపాదించారు. ‘అన్నా’ అని పిలిస్తే చాలు.. పొంగిపోయేవారు. నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టేవారు కారు. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన, నమ్మకానికే భరోసాగా నిలిచిన విలక్షణ వ్యక్తి. ‘నమ్మకం అంటే వైఎస్.. వైఎస్ అంటేనే నమ్మకం’ అనేంతగా ప్రజల మదిలో శాశ్వతంగా నిలిచిపోయిన మహా నాయకుడు.
కడప జిల్లా జమ్మలమడుగు మిషనరీ ఆస్పత్రిలో 1949 జులై 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మించారు. వైద్య విద్య (ఎంబీబీఎస్) పూర్తి చేసిన తర్వాత రూపాయికే వైద్యం అందించారు. తద్వారా చిన్న వయసులోనే ప్రజల మన్ననలు పొందారు. 28 ఏళ్ల వయసులోనే రాజకీయ నాయకుడిగా మారి, తన ‘హస్త’వాసికి తిరుగులేదని నిరూపించుకున్నారు! అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరుసార్లు విజయబావుటా ఎగురవేశారు. నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా చరిత్ర సృష్టించారు. అనుక్షణం జన హితమే లక్ష్యంగా పనిచేసే ఆయన.. రైతు పక్షపాతి. లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించి, కోట్లాది మంది రైతుల కళ్లలో ఆనందాన్ని చూడడమే తన లక్ష్యమని చెప్పేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జలయజ్ఞం పేరిట సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.
రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చిన తొలి సీఎం..
రైతులకు ఉచిత విద్యుత్తు చారిత్రక అవసరమని వైఎస్ ఉద్ఘాటించారు. అన్నదాతలకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. అప్పట్లో రాష్ట్రంలో 25 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లు ఉండేవి. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రకటిస్తే.. ఢిల్లీలో పార్టీ పెద్దలు, కొందరు ఆర్థిక వేత్తలు ఈ పథకాన్ని అమలు చేయగలరా? అని సందేహం వ్యక్తం చేశారు. ‘‘అధికారంలోకి వచ్చి, నేను ముఖ్యమంత్రి అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తా. రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వలేని నాడు నేను సీఎం పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగను’’ అని ఢిల్లీ పెద్దలకు తేల్చిచెప్పిన దమ్మున్న నాయకుడు వైఎస్సార్. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలుపైనే చేశారాయన. అనంతర కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేయడం వల్ల అదనంగా రూ.లక్షల కోట్ల పంట ఉత్పత్తులు సాధించడం జరిగింది. దేశ ఆర్థికాభివృద్ధికీ ఇది ఎంతగానో తోడ్పడింది.
వైఎస్‌ను చూసి వరుణ దేవుడూ మురిశాడు..
వైఎస్ పాలించిన ఐదేళ్లూ రాష్ట్రంలో వర్షాలకు లోటు లేదు. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రమంతటా వానలే వానలు. పచ్చని పైర్లతో రాష్ట్రం కళకళలాడుతూ ఉండేది. ‘వాన దేవుడు ఆంధ్రప్రదేశ్‌ను ఆశీర్వదించాడు’ అని వైఎస్ తరచూ చెప్పేవారు. దాదాపు 200 లక్షల టన్నుల ధాన్యం దిగుబడితో, పాడిపంటలతో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఆవిర్భవించింది. ఆయన సీఎం అయిన తర్వాత ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగింది.
ప్రజాసేవే పరమావధిగా..
ప్రజా సంక్షేమం విషయంలో వైఎస్సార్ ఎన్నడూ రాజీ పడలేదు. తాను చేసే పనిమీద తప్ప ఇతర ఏ అంశంపైనా దృష్టి సారించలేదు. ఆయన ఏ వ్యక్తిని ఎలా గౌరవించాలో తెలిసిన గొప్ప సంస్కారశీలి. రాష్ట్రమంతటినీ వైఎస్ తన కుటుంబంగానే భావించేవారు. ప్రజలందరూ ఆయనకు కుటుంబ సభ్యులు, బంధువులే. ప్రజా సమస్యల్ని సత్వరమే పరిష్కరించడం.. వారి సంక్షేమానికి వినూత్న పథకాలు ప్రారంభించడం.. నిరంతరం ఇదే ధ్యాస. ఏపీనే కాదు.. భారతదేశ చరిత్రలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్థానం సుస్థిరం. తిరుగులేని ప్రజాదరణతో ముఖ్యమంత్రి అయిన ఏకైక నేత. 2009 ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తనదే బాధ్యత అని బహిరంగంగా ప్రకటించిన నిఖార్సయిన నాయకుడు. మూడు దశాబ్దాల ప్రజా ప్రస్థానంలో ఎంత ఎదిగినా, ఇసుమంత గర్వం కూడా ప్రదర్శించని గొప్ప మనిషి.
ఐదేళ్ల వైఎస్ పాలనలో చేపట్టిన పథకాలన్నీ జనరంజకమైనవే. 2003లో రాష్ట్రవ్యాప్తంగా వందల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ ప్రతి కుటుంబాన్ని కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన సీఎం అయిన తర్వాత పేదలకు కూడు, గూడు, విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తున్నట్లుగానే.. అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, చేనేతలు, వికలాంగులకు పింఛను ఠంచనుగా అందించడం వైఎస్ పాలనలోనే మొదలైంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో..
దేశంలో ఎక్కడా లేని మరో వినూత్న పథకం ఫీజు రీయింబర్స్మెంట్. రూ.లక్షలోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం సరికొత్త ప్రయోగం. ‘‘మేం 20 రాష్ట్రాల్లో పర్యటించాం. ఇలాంటి పథకం ఎక్కడా చూడలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ సహా పలు సంక్షేమ పథకాలతో ఈబీసీలను ప్రోత్సహించడం, వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించడం మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది’’ అని నాటి ఈబీసీ కమిషన్ ఛైర్మన్ ప్రశంసించగా.. ‘అది మా ప్రభుత్వ బాధ్యత’ అని వైఎస్ వినమ్రంగా పేర్కొన్నారు. ఇక 2008లో ఉగాది పర్వదినాన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఆర్థిక భారం అని అధికారులు అంటే.. వైఎస్ స్పందిస్తూ.. పారిశ్రామికవేత్తలకు కోరినన్ని రాయితీలు ఇస్తారు కానీ, పేదవాడికి అన్నం మాత్రం పెట్టరా? అని అన్నారు.
పేదలకు సంజీవని.. ఆరోగ్యశ్రీ..
పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించాలని వైఎస్ నిశ్చయించుకున్నారు. అందుకోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతే ఆరోగ్యశ్రీని అమల్లోకి తెచ్చారు. బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక భారంతో పక్కన పెట్టారు. కానీ, వైఎస్ మాత్రం సంకల్ప బలంతో, చిత్తశుద్ధితో ఆరోగ్యశ్రీని దిగ్విజయంగా కొనసాగించారు. సామాన్యులకు ఈ పథకం సంజీవనిలా మారింది. ఇక 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసు కూడా ఆయన ప్రారంభించిందే. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో ‘కుయ్ కుయ్’ అంటూ 108 వాహనాలు వచ్చేస్తాయి. ఎంతో మంది ప్రాణాలను కాపాడాయి. 104 వాహనాలు.. గ్రామీణ ప్రజలకు ఇంటి వద్దకే వైద్య చికిత్సను అందించేందుకు చేపట్టిన మరో బృహత్తర పథకం. పావలా వడ్డీ, అభయ హస్తం, జలయజ్ఞం, రైతుల పంట రుణాల మాఫీ, భూ పంపిణీ, పశు క్రాంతి, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక బృందాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, 103 రూపాయలకే నిత్యావసర సరుకులు.. ఇలా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేశారు.
నా చెల్లితో సమానమ్మా..
ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించేందుకు కర్నూలు జిల్లా ఓబులాపురం గ్రామానికి వెళ్లిన వైఎస్‌కు యశోదమ్మ అనే లబ్ధిదారు నూతన వస్త్రాలు పెట్టింది. పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంతో ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న తమకు రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కట్టించి ఇచ్చారంటూ.. ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ‘మీరు మా కుటుంబానికి ఎంతో భరోసా ఇచ్చారు’ అంటూ ఆనందభాష్పాలు రాల్చింది. స్పందించిన వైఎస్.. ‘యశోదమ్మా.. నా చెల్లెలు విమలమ్మ ఎంతో నువ్వూ అంతేనమ్మా. నీకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయవచ్చు. ఇల్లు కట్టించడం నీకు చేసిన మేలు కాదు. అది నా బాధ్యత. నీ పిల్లల చదువుల బాధ్యత కూడా తీసుకుంటా’ అని చెప్పారు. వెంటనే పక్కన ఉన్న సిబ్బందితో చెప్పి తన కార్యాలయ ఫోన్ నంబరును ఆమెకు ఇచ్చారు. ఎప్పుడు, ఎలాంటి అవసరం వచ్చినా ఫోన్ చేయమని చెప్పారు. అదీ ఆయన వ్యక్తిత్వం.
కాకినాడ నుంచి వచ్చిన ఓ మహిళ తన ఏడేళ్ల కొడుక్కి చెవుడు అని, ఆపరేషన్‌కు రూ.6-7 లక్షలు ఖర్చవుతుందని, సాయం చేయాలని వైఎస్‌ను అడిగింది. తప్పకుండా అమ్మా.. ఎంత ఖర్చయినా చేయిస్తానని చెప్పారు. నాటి సెక్రటరీ పీకే అగర్వాల్‌ను పిలిచి, ‘ఈ బాబుకు ఆపరేషన్ చేయించే బాధ్యత మీది’ అని చెప్పారు. ఆపరేషన్ అయిన తర్వాత మళ్లీ వచ్చి కలువమ్మా అని ఆ మహిళకు చెప్పి, ఆమె వచ్చినప్పుడు లోపలికి పంపమని సెక్యూరిటీ వాళ్లను కూడా ఆదేశించారు. ఆపరేషన్ విజయవంతమైన తర్వాత ఆమె మళ్లీ వచ్చి కలిసింది. ఆ సమయంలోనే చెవిటి వారికి కూడా ఆరోగ్యశ్రీ కింద ఎంత ఖర్చయినా చికిత్స చేయించాలన్న నిర్ణయం తీసుకున్నారు.
ఏ రంగాన్నీ నిర్లక్ష్యం చేయని నేత..
వైఎస్సార్‌కు అన్ని రంగాల మీద విస్తృత అవగాహన ఉండేది. కర్షకుడి నుంచి కార్మికుడి దాకా.. కూలీ నుంచి పారిశ్రామికవేత్తదాకా.. సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా.. వ్యవసాయం నుంచి ఐటీ, పరిశ్రమల దాకా.. పల్లె నుంచి పట్టణం దాకా.. ఇలా ఏ రంగం గురించి అయినా అవలీలగా చెప్పేయగలరు. ఆయన ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయలేదు. వైఎస్ హయాంలో పాడి పంటలే కాదు.. ఐటీ ఎగుమతులు కూడా గణనీయంగా వృద్ధి చెందాయి. పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఐదేళ్లలో వైఎస్ చేపట్టిన పథకాలతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారంటే అతిశయోక్తి కాదేమో! ప్రతి కుటుంబం ఏదో ఒక పథకంలో లబ్ధి పొందింది. వైఎస్ అధికారంలో ఉన్నా, లేకపోయినా నిత్యం ప్రజలతోనే ఉండేవారు. నిబంధనలే కాదు, మానవత్వంతో ఆలోచించాలని అధికారులకు ఎప్పుడూ చెప్పేవారు. ఆయన వ్యక్తిత్వం ఎనలేనిది. ఆయన దగ్గరకు ఎవరైనా పని మీద వచ్చారంటే అది కచ్చితంగా పూర్తవ్వాల్సిందే. తన, పర బేధం లేకుండా అందరినీ ఆపద్భాంధవుడిలా ఆదుకునేవారు.
అధికారులకు పూర్తి స్వేచ్ఛ..
ముఖ్యమంత్రిగా తాను ఏది చెబితే అధి అధికారులు చేయాల్సిందేనని వైఎస్ ఎన్నడూ చెప్పేవారు కాదు. కీలక నిర్ణయాల్లో అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. సరైన నిర్ణయాలు తీసుకోమంటూ వారిని ప్రోత్సహించేవారు. అదే సమయంలో ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఆదేశించేవారు. ఆలస్యం చేస్తే అస్సలు సహించేవారు కాదు. ఫలానా సమయానికల్లా జీవో రావాలని, నిర్ణయం అమలై తీరాలని స్పష్టం చేసేవారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని అధికారులకు చెప్పేవారు. ప్రజలతో వినమ్రంగా మాట్లాడాలని, సమస్యలను సావధానంగా విని చర్యలు చేపట్టాలని స్పష్టం చేసేవారు. మనం ఉన్నదే అణకువతో వారికి సేవ చేయడానికని, అహంకారంతో వ్యవహరించడానికి కాదని చెప్పేవారు.
మీరందరూ సీఎంలే..
వైఎస్ సీఎం అయిన తర్వాత విజయవాడ, గుల్బర్గా కాలేజీల్లో తనతో కలిసి చదువుకున్న మిత్రులకు విందు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో వారికి డిన్నర్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఆయన స్నేహితులతో మాట్లాడుతూ.. దేవుడి దయ వల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానని, ఇప్పుడు మీరందరూ ముఖ్యమంత్రులేనని అన్నారు. ఎప్పుడైనా, ఏ సలహా అయినా చెప్పవచ్చని అన్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా చెప్పాలని సూచించారు. స్నేహానికి అంత విలువ ఇచ్చేవారు.
వైఎస్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎప్పుడు కాకినాడ వెళ్లినా అభిమానంతో ఆయనకు సుబ్బారాయుడు అనే వ్యక్తి కొబ్బరిబొండాలు ఇచ్చేవాడు. ఆయన సీఎం అయిన తర్వాత ఏడాదికి సుబ్బారాయుడు వెళ్లి.. ప్రజాదర్బారులో కలిశారు. ఆయన్ను గుర్తుపట్టిన వైఎస్.. ‘ఏడాది తర్వాత నేను గుర్తొచ్చానా? ఎలా ఉన్నావు? కొబ్బరి బొండాలు తీసుకొచ్చావా?’ అని అడిగారు. తీసుకొచ్చానని, సెక్యూరిటీ వాళ్లు అనుమతించలేదని చెప్పాడు. కుటుంబసభ్యుల యోగక్షేమాలు అడగ్గా.. పెద్దమ్మాయి పెళ్లికి వచ్చిందని, తన ఆర్థిక పరిస్థితి బాలేదని సుబ్బారాయుడు చెప్పారు. స్పందించిన ఆయన.. సొంత ఖర్చులతో అమ్మాయి పెళ్లి చేశారు.
అన్ని ప్రాంతాలనూ సమానంగా..
వైఎస్ ఎప్పుడూ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకునేవారు. అన్ని ప్రాంతాలనూ సమానంగా చూసేవారు. టౌన్‌షిప్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. విశాఖలో ఐటీ కార్యకలాపాలను ప్రారంభించారు. బిట్స్ పిలానీ, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో, అమెరికన్ కాన్సులేట్, పీవీ ఎక్స్‌ప్రెస్ వే.. ఇలా హైదరాబాద్ నగరానికి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. కాకినాడలో ఎస్ఈజెడ్, గుంటూరులో 18 టెక్స్ టైల్స్ పార్కులు, చిత్తూరు శ్రీ సిటీ.. ఇలా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారు. ఒక నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30 మహానగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటిగా నిలిచిందంటే అది వైఎస్ దూరదృష్టి వల్లే.
తెలుగువారి గుండె చప్పుడు..
మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో వైఎస్ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. ప్రజా సేవే ఊపిరిగా పనిచేశారు. చివరికి ప్రజల కోసం వెళుతూ.. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక మనిషి గొప్పతనం ఆయన చనిపోయినప్పుడు తెలుస్తుందంటారు. అది వైఎస్ విషయంలో అక్షర సత్యమైంది. భౌతికంగా మన మధ్య లేకున్నా.. ఆయన చేసిన సేవ, ప్రవేశపెట్టిన పథకాల రూపంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు వారి గుండె చప్పుడుగా మారిపోయారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ‘‘వైఎస్.. అంటే వైఎస్సే. ఆయనకెవరూ సాటి రారు. మరణించి కూడా ప్రజల గుండెల్లో జీవించి ఉన్న ఏకైక నేత. కోహినూర్ వజ్రం లాంటి వ్యక్తి. మేరునగధీరుడు’’ అని ప్రతి ఒక్కరూ చెప్పుకునే మహా నాయకుడు. ఆయన అమరజీవి. తెలుగు జాతికి కోహినూర్ వజ్రం. నేడు వైఎస్ 15వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి తెలుగు జాతి ఘనంగా నివాళులర్పిస్తోంది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నంత వరకు, ప్రజా సంక్షేమం విషయంలో డాక్టర్ వైఎస్సార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతి పేదవాడి గుండె చప్పుడు ఆయనకు తెలుసు. మహామనీషి.. నీకు జోహార్లు!!