Suryaa.co.in

Andhra Pradesh

బీమా కంపెనీలు 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చేయండి

– వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు త్వరితగతిన బీమా ఇచ్చే విషయంపై బీమా కంపెనీ ప్రతినిధులతో చర్చించిన సీఎం చంద్రబాబు
– ప్రజలు కొనుగోలు చేసిన వస్తువులపై ఈఎంఐపై బ్యాంకర్ల నుంచి ఒత్తిడి చేయకుండా చూసే ప్రయత్నంలో ప్రభుత్వం
– విజయవాడ కలెక్టరేట్ లో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
– విజయవాడలో వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో సాయం చేసేందుకు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెన్సీలతో సమావేశం
– బుడమేరు వరద కారణంగా వేలాది ఇళ్లు నీట మునిగిన వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కోల్పోయిన వైనం

విజయవాడ: కురిసిన భారీ వర్షాల్లో నష్టపోయిన వాహనాలు, భారీ వాహనాలకు సంబంధించి బ్యాంకర్లు ఇన్సూరెన్స్, ఈఎంఐ చెల్లింపులపై సీఎం చంద్రబాబునాయుడు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. భారీ వర్షాల్లో నష్టపోయిన వారిపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఈ కష్ట సమయంలో వారిని ఆదుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ఏమన్నారంటే.. ఎన్నడూ చూడని విపత్తును నేడు విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్నారు.తుఫాన్లు, వరదలు గతంలో వచ్చినప్పటికీ నేటి పరిస్థితి పూర్తి భిన్నం. ఆకస్మిక వరదలతో కనీసం తాగునీరు కూడా లేని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రభుత్వం నుంచి సర్వశక్తులు ఒడ్డుతున్నాం…ప్రజలకు సహాయక కార్యక్రమాలు అందిస్తున్నాం.ఆకస్మిక వరదలతో ప్రతి ఇంట్లో వాహనాలు దెబ్బతిన్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు పూర్తిగా నీటమునిగాయి. కుటీర పరిశ్రమలు నడుపుకునే వారి సామగ్రి మొత్తం నీటి పాలైంది. ఫ్రిజ్ లు, టీవీలు, ఏసీలు వంటి అనేక గృహోపకరణాలు పాడైపోయాయి. నిబంధనలు సరళతరం చేసి ప్రజలకు రుణాలు ఇవ్వాలి.

10 రోజుల్లో వాహన, ఇతర బీమాను సెటిల్ చెయ్యాలి. 14 రోజుల్లో క్లెయిమ్స్ పరిష్కరించాలి. ఆన్లైన్ విధానం ద్వారా త్వరతగతిన అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలి. వరద బాధిత ప్రాంత ప్రజల రుణాలు కాల పరిమితిని రీ షెడ్యూల్ చెయ్యాలి. యుద్ధ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేయాలి.

వాహనాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నీ డ్యామేజ్ అయ్యాయి. వదల కారణంగా ప్రజలు సర్వం కోల్పోయి జీవితం కొత్తగా మొదలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలి. ప్రభుత్వం, బ్యాంకులు, బీమా కంపెనీలు అందరం కలిసి ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మీతో సమావేశమయ్యాం.

బీమా ఉన్న వారికి, లేని వారికి రెండు కేటగిరీలుగా చేసి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తున్నాం. వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్.బి.ఐతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. ప్రభుత్వంతో పాటు బ్యాంకర్లు, ఏజెన్సీలు కూడా మానవీయ కోణంలో స్పందించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో బాధితులు క్లెయిమ్ ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తాం.

వినియోగదారుల వద్ద ఉన్న డేటాతో పాటు మునిసిపల్ శాఖ, రవాణా శాఖల వద్ద ఉన్న డేటా సహాయంతో క్లెయిమ్ లకు దరఖాస్తు చేయాలి.అన్ని శాఖల వద్ద ఉన్న డేటా మొత్తాన్ని క్రోడీకరించి…బాధితులను ఆదుకుందాం. బ్యాంకర్లు రుణాలు రీ షెడ్యూల్ చేయాలని కోరుతున్నాం. బాధితుల వివరాలను ప్రభుత్వం గుర్తించి బ్యాంకర్లకు ఇస్తుంది.

బాధల్లో ఉన్న వినియోగదారులను ఆదుకోవడంలో బీమా కంపెనీలు మానవీయ కోణంతో వ్యవహరించాలి. ప్రజలు లేనిదే ప్రభుత్వాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు లేవు. వారు బాధల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడమే మన లక్ష్యం కావాలి.ప్రభుత్వం, బ్యాంకులు, కంపెనీలు అందరం కలిసి వరద బాధితులకు ఆక్సిజన్ అందిద్దాం.

లోన్లు రీషెడ్యూల్, 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చెయ్యాలనే ప్రభుత్వం ప్రతిపాదలపై చర్చించుకుని ఒకటి రెండు రోజుల్లో రావాలని బ్యాంకర్లకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు సీఎం సూచన

LEAVE A RESPONSE