– రెండు ఏళ్లుగా లేని పనులు ఇప్పుడే గుర్తొచ్చాయా?
– నేషనల్ హైవేను తవ్వడం దుర్మార్గం!
– కేసీఆర్ సభకు ప్రజలు రాకుండా రోడ్లు కట్ చేస్తారా?
– జగిత్యాల ఎమ్మెల్యే తీరుపై వేముల ఆగ్రహం
– వెంటనే డైవర్శన్ రోడ్ ఏర్పాటు చేయకపోతే కోర్టుకు వెళ్తాం
– జగిత్యాల ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యే సంజయ్ కి గుణపాఠం తప్పదు
జగిత్యాల: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే అత్యంత నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. జగిత్యాల పట్టణ శివార్లలో నేషనల్ హైవే (NH-63) పై రోడ్డును తవ్వి పనులు చేపట్టిన ప్రాంతాన్ని BRS జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంది.ఆర్మూర్ బాల్కొండ, కోరుట్ల, మెట్పల్లి వైపు నుంచి వచ్చే ప్రజలు, పార్టీ కార్యకర్తలు సభకు రాకుండా అడ్డుకోవడానికే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రధాన రహదారిని తవ్వేయడం జరిగిందని ఆరోపించారు.
పనులు ప్రారంభం కాకముందు నాలుగైదు రోజుల ముందుగానే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ విద్యాసాగర్ రావు డైవర్షన్ రోడ్ ఏర్పాటు చేసినంక నే రోడ్ కట్ చేయాలనీ కోరినా కూడా కుట్రపూరితంగా NH రోడ్డు మొత్తం కట్ చేసారు అని అన్నారు ఇక్కడ బ్రిడ్జి పనులు మంజూరై రెండేళ్లు కావస్తోంది. అప్పటి నుంచి పనులు చేయకుండా, సరిగ్గా కేసీఆర్ సభకు రెండు రోజుల ముందే రోడ్డు కట్ చేయడం వెనుక ఉన్న దురుద్దేశం ఏంటని ప్రశ్నించారు. ఇది జగిత్యాల ఎమ్మెల్యే సంకుచిత స్వభావానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఒక సివిల్ ఇంజనీర్‌గా, మాజీ ఆర్ అండ్ బీ మంత్రిగా చెబుతున్నాను.. నేషనల్ హైవేపై పనులు చేసేటప్పుడు ముందుగా ప్రత్యామ్నాయంగా ‘బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలి. ఇది కనీస నిబంధన. కానీ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తెలిసి కూడా కనీసం డైవర్శన్ ఇవ్వకుండా రోడ్డును పూర్తిగా మూసివేయడం దుర్మార్గమని విమర్శించారు.
సభ సంగతి పక్కన పెడితే, జగిత్యాల నియోజకవర్గ ప్రజలు తమ దైనందిన పనుల కోసం పట్టణానికి రావాలంటే కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని, ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ వ్యవహారంపై ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు NH(Morth ) SE తో మాట్లాడారు , వెంటనే ఇక్కడ డైవర్షన్ రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలకు మరియు ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్నందుకు ఆర్ అండ్ బీ శాఖపై, సంబంధిత అధికారులపై న్యాయస్థానంలో కేసు వేస్తామని హెచ్చరించారు.
కేసీఆర్ టికెట్ ఇచ్చి గెలిపిస్తే, ఇవాళ ఆయన సభనే అడ్డుకోవాలని చూడటం ఎమ్మెల్యే అవివేకమని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగిత్యాల సభను లక్షలాది మందితో విజయవంతం చేసి తీరుతామని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.