Suryaa.co.in

Telangana

ఇందిరా కాంగ్రెస్, వర్సస్ ఆర్ ఆర్ కాంగ్రెస్

– ఆర్ ట్యాక్స్,.. ఆర్ ఆర్ ట్యాక్స్ .. ఆర్ ఆర్ ఆర్ ట్యాక్స్ .. బీ ట్యాక్స్,.. యూ ట్యాక్స్
– రేవంత్ ఏ పని చేసినా దాని వెనుక వసూళ్లే
– హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు
– కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
– అర్ అర్ కాంగ్రెస్ కు ఏఐసీసీ కి గ్యాప్ ఉంది
– బాధితులకు సాయం వదిలేసి, కలెన్షన్ల బిజీలో కాంగ్రెస్ నేతలు
– హైడ్రా వెనక వందల కోట్లు చేతులు మారుతున్నాయి
– బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్ : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. బీజేపీ వేసిన ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది.

పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గతంలో కోర్టులో పిటిషన్ వేశాం. ఈ సందర్భంగా అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందు ఉంచాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశిస్తూ, 4 వారాల్లోగా తేల్చాలంటూ తీర్పునివ్వడం ప్రజాస్వామ్యంలో చరిత్రాత్మకమైనది.

హైకోర్టు తీర్పును మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించడం మంచి పరిణామం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే గారి దృష్టికి తీసుకెళ్లి తీర్పును గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలి.ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టు ఇచ్చిన తీర్పును, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది.

గతంలో బీఆర్ఎస్…. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు పాల్పడినప్పుడు, దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారి ఇళ్ల ముందు చావు డప్పు కొట్టమన్నారు. ఆయనే ఇప్పుడు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో అనైతికంగా చేర్చుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?

పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలను అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హత వేటు వేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మరి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇందిరా కాంగ్రెస్ నిర్ణయాలు ఇక్కడున్న అర్ అర్ కాంగ్రెస్ అమలు చేయదా?

కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఇందిరా కాంగ్రెస్ వర్సెస్ ఆర్.ఆర్ కాంగ్రెస్ అనేలా ఉంది. రాష్ట్రంలో ఉన్న అర్ అర్ కాంగ్రెస్ కు ఏఐసీసీ కి గ్యాప్ ఉంది. ఏఐసీసీ నిర్ణయానికి విరుద్ధంగా ఆర్.ఆర్ కాంగ్రెస్ నడుచుకుంటున్నట్లుగా అనిపిస్తున్నది. పీఏసీ చైర్మన్ విషయంలో సంప్రదాయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేసింది.

కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ రేవంత్ ప్రభుత్వం మరో తప్పిదానికి పాల్పడింది. ఇతర పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్టీ మారిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

పద్దుల కమిటీ.. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా గురించి, తప్పుడు లెక్కల గురించి ప్రశ్నించే పీఏసీ కమిటీ. ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి ఇవ్వడం జరుగుతుంది. కాని ఆ ఆనవాయితీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం సబబు కాదు. బీఆర్ఎస్ ముగ్గురు పేర్లు పంపినప్పటికీ..తమ ఇష్టానుసారంగా చేయడం రాజ్యాంగ విరుద్ధమే.

సీనియర్ నాయకులు విభేదిస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. అందుకే పార్టీలో ఎమ్మెల్యేల చేరికల సమయంలో ఎక్కడా సీనియర్ నాయకులు కనిపించడం లేదు. ప్రజలకిచ్చిన హామీలను వదిలేసి, వరద బాధితులకు సాయం వదిలేసి, కలెన్షన్ల బిజీలో కాంగ్రెస్ నేతలు. ఆర్ ట్యాక్స్, ఆర్ ఆర్ ట్యాక్స్ , ఆర్ ఆర్ ఆర్ ట్యాక్స్ , బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ ఇలా కలెక్షన్లలోమునిగితేలుతున్నారు.

రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా, రైతుబంధు ఇవ్వకుండా కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యారు. ఇప్పటికైనా కోర్టు తీర్పునకు అనుగుణంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరుతున్నాం.

హైడ్రా ఆరంభ శూరత్వమని ముందే చెప్పాము. కావాలనే హైడ్రా కోరలను ముఖ్యమంత్రి పీకేశారు. కుటుంబ ఫ్రెషర్స్ , ఓవైసీ కి భయపడే హైడ్రా పై సీఎం వెనక్కి తగ్గారు. హైడ్రా వెనక వందల కోట్లు చేతులు మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ ఏ పని చేసినా దాని వెనుక వసూల్స్ ఉంటాయి. రేవంత్ రెడ్డి కి దిన దిన గండంగా మారిన సీఎం పదవి.

పీసీసీ అధ్యక్ష పదవి సీఎం రేవంత్ చెప్పిన వ్యక్తికి రాలేదు. హైకోర్టు తీర్పుపై మంత్రి పొన్నం వ్యాఖ్యలే నిదర్శనం. మంత్రుల కు ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ ఉందన్న విషయం బయటపడింది.

LEAVE A RESPONSE