– 5 ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో ఎన్టీఆర్ కలెక్టరేట్లో సమావేశమైన మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్
– ఒక్కొక్క మెడికల్ కాలేజీ నుండి 42 మంది డాక్టర్లు, స్పెషలిస్టులు, పీజీ స్టూడెంట్లను పంపించేందుకు అంగీకారం
– వారం రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాల్లో సేవలందించనున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు
– ఇప్పటికే ఒక్కొక్క మెడికల్ కాలేజీ నుండి 30 మంది చొప్పున వరద బాధిత ప్రాంతాల్లో సేవలు
విజయవాడ:: వరద బాధిత ప్రాంతాల్లో స్పెషలిస్టు డాక్టర్ల సేవల్ని అందించేందుకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ముందుకొచ్చాయి. ఇప్పటికే 30 మంది చొప్పున డాక్టర్లు, పీజీలు వరద బాధిత ప్రాంతాల్లో సేవలందిస్తుండగా అదనంగా మరో 42 మంది డాక్టర్లు, స్పెషలిస్టులు, సీనియర్ రెసిడెంట్లు, పీజీలను పంపించేందుకు అంగీకరించారు.
ఎన్టీఆర్ కలెక్టరేట్‌లో మంగళవారం మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిర్వహించిన సమావేశంలో చిన్న అవుటుపల్లిలోని పిన్నమనేని సిద్దార్ధ, చిన్న కాకానిలోని కాటూరి, ఏలూరులోని ఆశ్రమ్, మంగళగిరిలోని ఎన్ ఆర్ ఐ, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, కమ్మూనిటీ మెడిసిన్ విభాగాధిపతులు, ఆయా కాలేజీల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు విజయవాడ సిద్ధార్ధ మెడికల్ కాలేజీ, గుంటూరు జిజిహెచ్ కాలేజీల సూపరింటెండెంట్లు కూడా పాల్గొన్నారు.
కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి నేతృత్వంలో జనరల్, పల్మనరీ, ఇఎన్‌టి, పిడియాట్రిక్స్, డెర్మటాలజీ కి చెందిన స్పెషలిస్టు డాక్టర్లు, పీజీలు, జనరల్ సర్జన్లతో కూడిన బృందాలు ప్రత్యేక వైద్య శిబిరాల్లో వరద బాధితుల కుటుంబాలకు 16 వార్డుల్లో వారం రోజుల పాటు సేవలందిస్తారు. ఒక్కో మెడికల్ కాలేజీకి రెండు వార్డులు చొప్పున కేటాయించారు. ఇప్పటికే కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్లు(సిహెచ్వోలు) వరద బాధిత ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఏయే ఆరోగ్య సమస్యలున్నాయో తెలుసుకునేందుకు సర్వే చేస్తున్నారు.
మరో వైపు నీటి నిల్వల కారణంగా దోమల లార్వాలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు యాంటీ లార్వా ఆపరేషన్ కూడా వైద్య ఆరోగ్య శాఖ చేపట్టింది. వరదలు ప్రారంభమైన నాటి నుండి ఉచిత వైద్య శిబిరాలు, 104 సంచార వాహనాల ద్వారా వైద్య సేవలతో పాటు ఇంటింటికీ అత్యవసర మెడికల్ కిట్లను కూడా వైద్య ఆరోగ్య శాఖ అందజేసింది. తాజాగా స్పెషలిస్టు డాక్టర్ల సేవల్ని కూడా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల సేవల్ని కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది.
ఒక్కో ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న నర్సింగ్ కాలేజీల నుండి 25 మంది చొప్పున నర్సింగ్ విద్యార్థుల సేవల్ని కూడా వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. డాక్టర్లకు వీరు సహకరిస్తారు.
వరద బాధితుల్లో మానసిక స్థైర్యాన్ని కలిగించాలి….మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ
వరద బాధితుల్లో మానసిక స్థైర్యాన్ని కలిగించేలా వైద్యులు సేవలందించాలని మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ ఈ సందర్భంగా కోరారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వైద్య సేవలందించేందుకు తామున్నామన్న భావన కల్పించాలన్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు వరద బాధిత ప్రాంతాల్లో సేవలందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
జక్కంపూడి, నున్న ప్రాంతాల్లో నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ డాక్టర్లు, స్పెషలిస్టులు సేవలందిస్తారని మంత్రి తెలిపారు. డాక్టర్లు స్వయంగా వారి దగ్గరికి వెళ్లి సేవలందిస్తే 75 శాతం మేర వారికి మానసికంగా స్వాంతన కలుగుతుందని, మిగతా 25 శాతం మందుల వల్ల ఉపశమనం కలుగుందని మంత్రి అన్నారు.
వార్డుకో స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం….వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
5 ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుండి వచ్చే స్పెషలిస్టు డాక్టర్లు వార్డుకో బృందం చొప్పున సేవలందిస్తారని వైద్య సేవలందిస్తారని, దీన్ని బాధిత కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఆరుగురు స్పెషలిస్ట్ డాక్టర్లలో వార్డు సచివాలయానికొ ముగ్గురు స్పెషలిస్టులతో కూడిన బృందాలు సేవలందిస్తాయన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు వరద బాధిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో వైద్య సేవలందిస్తూ ముందుందన్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల స్పెషలస్టు డాక్టర్ల సేవల్ని అందించేందుకు యాజమాన్యాలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తమవంతు సామాజిక బాధ్యతగా వరద బాధిత ప్రాంతాల్లో సేవలందించాలన్నారు. విపత్తులొచ్చినప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి ప్రైవేట్ యాజమాన్యాలు కూడా సహకరించాలన్నారు. సిహెచ్వోలు, ఎఎన్ ఎంలతో కూడిన బృందాలు ఇప్పటికే ఇంటింటి సర్వే చేస్తున్నాయని, ఈ సర్వే సమాచారం ఆధారంగా వైద్య శిబిరాల్లో స్పెషలిస్టు డాక్టర్లు చికిత్స అందిస్తారన్నారు.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ ఆటోల ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్లు ఏయే శిబిరాల్లో అందుబాటులో ఉంటారనే సమాచారాన్ని ఆయా వార్డు సచివాలయాల్లో తెలియజేస్తామన్నారు. వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ నరసింహం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్టేట్ నోడలాఫీసర్ విజయలక్ష్మి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఒక్కో మెడికల్ కాలేజీకి రెండేసి వార్డులు
ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కాలేజీకి వార్డు నంబరు 60(వాంబే కాలనీ), వార్డు నంబరు 61( శాంతినగర్) లను, పిన్నమనేని సిద్ధార్ధ మెడికల్ కాలేజీకి వార్డు నంబరు 56(చిట్టినగర్), వార్డు నంబరు 57(రాజరాజేశ్వరీ పేట), కాటూరి మెడికల్ కాలేజీకి వార్డు నంబరు 58(అజిత్ సింగ్ నగర్), వార్డు నంబరు 59(సింగ్ నగర్), ఎన్ ఆర్ ఐ మెడికల్ కాలేజీకి వార్డు నంబరు 62(ప్రకాష్ నగర్), వార్డు నంబరు 63(రాజీవ్ నగర్), నిమ్రా మెడికల్ కాలేజీకి వార్డు నంబరు 64(కండ్రిక), ఇబ్రహీంపట్నం, సిద్దార్ధ మెడికల్ కాలేజీకి వార్డు నంబరు 44(న్యూ జోజి నగర్), వార్డు నంబరు 45(రోటరీ నగర్), గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వార్డులు 46, 47(లంబాడీపేట), వార్డులు 54, 55 (వించిపేట) కేటాయించారు.
ఉచిత వైద్య శిబిరాల్ని సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాల్ని , 104 మొబైల్ మెడికల్ వాహనాన్ని మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సందర్శించారు. వాంబే కాలనీ హెచ్ బ్లాక్, పైపుల రోడ్ లలోని ఉచిత వైద్య శిబిరాలు , ఎన్టీఆర్ సర్కిల్ లో 104 మొబైల్ మెడికల్ వాహనాన్ని సందర్శించిన మంత్రి ఉచిత వైద్య శిబిరాలకు ఏయే ఆరోగ్య సమస్యలతో వస్తున్నారని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయాసం, దగ్గు, ఫంగల్ ఇన్ఫెక్షన్, చర్మ సంబంధిత సమస్యలతో బాధితులు వస్తున్నారని డాక్టర్లు మంత్రికి వివరించారు.