Suryaa.co.in

Andhra Pradesh

టూరిజం హబ్ గా ఆంధ్రప్రదేశ్

– వరల్డ్ టూరిజం డే సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా కార్యక్రమాలు
– 38 విభాగాల్లో అవార్డుల ప్రదానం
– కేంద్రం సహకారంతో అన్ని చోట్ల పర్యాటకం అభివృద్ధి
– రాష్ట్రంలో 4 ఐకానిక్ టూరిస్ట్ సెంటర్లు
– శ్రీశైలంలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు
– రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పేరుతో ఐకానిక్ టూరిస్ట్ సెంటర్
– బాపట్లలో బీచ్ కారిడార్ అభివృద్ధి, టూరిజం హబ్ గా సంగమేశ్వరం
– రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు
– టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషి.. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రిసార్టులు
– ప్రజా రాజధాని అమరావతిలో మెగా టూరిజం హబ్ ఏర్పాటు
– అడ్వంచర్ కేంద్రంగా అరకు, లంబసింగి
– రూ. 25.32 కోట్లతో అన్నవరం పుణ్యక్షేత్రం అభివృద్ధి
– ఏపీటీడీసీ ద్వారా శక్తిపీఠాలు, పంచారామాలు కలుపుతూ టెంపుల్ ప్యాకేజీ
– లఘు చిత్రాల ద్వారా టూరిజం పై పర్యాటకులకు ప్రత్యేక అవగాహన
– తిరుపతి, గండికోట, పిచ్చుక లంకలో రిసార్ట్స్ ఏర్పాటుకు సిద్ధమైన ఓబెరాయ్ గ్రూప్
– అక్టోబర్ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక (డీపీఆర్)
– ఆమోదం అయిన వెంటనే పనులకు శ్రీకారం
– ప్రకృతి వైఫరీత్యాల కారణంగా రాష్ట్రంలో భారీగా నష్టపోయిన పర్యాటకం
– పునరుద్ధరణ చర్యలకు శ్రీకారం
– నాటక రంగానికి ప్రత్యేక కార్యక్రమాలు
– స్టూడియోలు నిర్మిస్తే ప్రభుత్వం సహకారం
– సినీ నిర్మాతలకు లేఖ రాశాం
– తెలుగు చలన చిత్ర పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందేందుకు చర్యలు
– రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే ఐదేళ్ళలో రాష్ట్రంలో అన్ని చోట్ల టూరిజం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్ల అంశంపై గురువారం రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 27న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్‌ చేతుల మీదుగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించామని పేర్కొన్నారు. 38 విభాగాల్లో టూరిజంకు సంబంధించిన హోటళ్ళు, స్పాట్లలో అవార్డులను ప్రదానం చేయనున్నామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో మెగా టూరిజం హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

4 ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఏర్పాటు

రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాజెక్టు రూ. 100 కోట్లకు మించకుండా రూ.250 కోట్లతో శాసి (స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ ) స్కీం ద్వారా నిధులు కేటాయించేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు. కేంద్ర అందించే సాయానికి అదనంగా సీఎం, డిప్యూటీ సీఎంల కృషితో మరిన్ని నిధులు కేటాయించేలా ప్రయత్నం చేసి మొత్తం రూ. 400 కోట్లతో రాష్ట్రంలో 4 ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

– మొదటగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఎకో టూరిజం, అధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. స్థానికంగా టైగర్ రిజర్వ్ ఉండటం, వాటర్ ఫాల్స్ ఇలా అన్నింటిని కలిపి టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి.
– రెండోది అఖండ గోదావరి పేరుతో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని మరో ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ ను ఏర్పాటు.
– మూడోది బాపట్ల జిల్లాలోని అద్భుతమైన బీచ్ కారిడార్ ను అభివృద్ధి చేస్తామని, సూర్యలంకలో రిసార్ట్స్ ఏర్పాటు.
– నాలుగోది నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరం ప్రాంతాన్ని కూడా ఐకానిక్ సెంటర్ గా మార్పు.

అక్టోబర్ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సంబంధింత సమగ్ర నివేదిక (డీపీఆర్) పంపించి ఆమోదం తీసుకున్న తర్వాత వెంటనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అధ్యాత్మిక కేంద్రాల్లో కొన్ని రోజులపాటు యాత్రికులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఉదాహరణకు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న యాత్రికులు ఒక రోజు సత్రంలో ఉండి తిరిగి వచ్చేస్తున్నారన్నారు. ఒక పూటకే పరిమితమైన టెంపుల్ టూరిజాన్ని రెండు, మూడు రోజులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాసీ స్కీం ద్వారా ఒక ప్రాంతానికి యాత్రికులు వెళితే కేవలం దైవ దర్శనమే కాకుండా ఎకో టూరిజం, టైగర్ రిజర్వ్, వాటర్ ఫాల్స్ సైతం సందర్శించే విధంగా సంబంధిత ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. పుణ్యక్షేత్రాల్లో సత్రాలున్నప్పటికీ అవి రెండు మూడు రోజుల పాటు నివాసయోగ్యంగా ఉండేందుకు అనుకూలంగా లేని కారణంగా రిసార్ట్స్ నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అడ్వంచర్ కేంద్రంగా అరకు, లంబసింగి

రాష్ట్రంలో ప్రకృతి సౌందర్య ప్రాంతాలను చూపించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నామన్నారు. ఓబెరాయ్, మేఫైర్ తదితర సంస్థలను ఆకర్షిస్తున్నామన్నారు. ఇప్పటికే తిరుపతి, గండికోట, పిచ్చుకలంకలో రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు ఒబెరాయ్ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. కేంద్ర స్వదేశీ దర్శన్ పథకం ద్వారా అరకు, లంబసింగిని అడ్వంచర్ కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు. బొర్రా గుహల్లో మంచి సౌండ్, లైటింగ్ ఏర్పాటు చేసి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని మంత్రి వివరించారు. బ్లూఫాగ్ బీచ్ గా రుషికొండ బీచ్ ను అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. నీరున్న పర్యాటక ప్రాంతాల్లో వాటర్ స్పోర్స్ట్ ను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నామన్నారు.

ప్రసాద్ స్కీం క్రింద (పిలిగ్రమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరుచ్యువల్ హెరిటేజ్ అగ్నమంటేషన్ డ్రైవ్) అన్నవరం పుణ్యక్షేత్రాన్నిరూ. 25.32 కోట్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు. అన్నదానం కోసం డైనింగ్ హాల్, టాయిలెట్ల ఏర్పాటు, దుస్తులు మార్చుకునే గదులు, ఈ-వెహికల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సెప్టెంబర్ 3న టెండర్లు పిలిచామన్నారు. తద్వారా అధ్యాత్మిక పర్యాటకానికి బాటలు వేసి అత్యధిక పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ను ప్రకటించామన్నారు. ఆసక్తిగల వారి నుండి ప్రతిపాదనలు స్వీకరిస్తామన్నారు.

శక్తిపీఠాలు, పంచారామాలు కలుపుతూ టెంపుల్ ప్యాకేజీ

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ద్వారా ఏసీ బస్సుల ద్వారా టెంపుల్ ప్యాకేజీ ప్రకటిస్తామన్నారు. టెంపుల్ సర్క్యూట్ లో భాగంగా కాకినాడలోని ప్రధానమైన క్షేత్రాలైన కోరుకొండ, అన్నవరం, అంతర్వేది, వాడపల్లితో పాటు శక్తిపీఠాలు, సామర్లకోట, ద్రాక్షారామం లాంటి పంచారామాలను కలుపుతూ ఏసీ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.

కేంద్రం కూడా పర్యాటకంపై ప్రత్యేక దృష్టిసారించిందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. లఘు చిత్రాల (షార్ట్ ఫిల్మ్స్) ద్వారా టూరిజం పై ప్రత్యేక అవగాహన కల్పించబోతున్నామన్నారు. ఇప్పటికే పర్యాటక అభివృద్ధిపై డీపీఆర్ లు సిద్ధం చేశామన్నారు. టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో ప్రచారం కల్పిస్తున్నామన్నారు. సినిమాల్లో షూటింగ్ జరిపిన ప్రాంతం పేరును పొందుపర్చాలని కోరుతున్నామన్నారు. ఉదాహరణకు పుష్ప సినిమా జరిగిన ప్రాంతం షూటింగ్ స్పాట్ గా మారిందన్నారు.

రాష్ట్రంలో ఏపీటీడీసీ క్రింద 15 హరితా రిసార్టులున్నాయన్నారు. గతంలో వసతుల లేమి, నిర్వహణ లేని కారణంగా నాశనమయ్యాయన్నారు. వాటిని పునరుద్ధరించే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టామని త్వరలోనే పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామన్నారు. చంద్రగిరి పోర్టులో లైట్ అండ్ సౌండ్ షోలు ఏర్పాటు చేశామని, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

అందమైన ప్రకృతి సౌందర్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం సరైన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందని మంత్రి అన్నారు. నాటి పర్యాటక శాఖ మంత్రి శాఖపై దృష్టి సారించకుండా విపక్షాన్ని విమర్శించడానికే ప్రాధాన్యతనిచ్చిన కారణంగా అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్ మెంట్ స్కీమ్ క్రింద రాష్ట్రంలోని నాగార్జున సాగర్, అహోబిలం లో ట్రైనింగ్, మార్కెటింగ్, విజిటర్ మేనేజ్ మెంట్, మౌలిక సదుపాయాలు, వాటర్ సప్లై వంటివి ప్రవేశపెట్టి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు.

స్టూడియోలు నిర్మిస్తే సర్కారు సహకారం

సాంస్కృతిక శాఖలో నాటక రంగానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. సంగీత నాట్య అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు. సినిమాటోగ్రఫీకి సంబంధించి మంత్రి మాట్లాడుతూ సినీ నిర్మాతలకు ఇటీవలే ఒక లేఖ రాశానని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కువగా షూటింగ్ లు చేస్తున్నారని, పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తెస్తున్నారని అదే క్రమంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరానన్నారు. హైదరాబాద్ తరహా షూటింగ్ లకు అనువుగా స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ స్టూడియోలు ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు.

ఏపీ నుండే సినిమాలకు 60 శాతం ఆదాయం వస్తుందన్నారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకు పూర్తిస్థాయిలో అనుమతి కల్పిస్తామన్నారు. తదనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సినీ నిర్మాతలకు చెప్పినట్టు మంత్రి వెల్లడించారు. స్టూడియోలు నిర్మించడానికి ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని తెలిపామన్నారు. త్వరలోనే వచ్చి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. తెలుగు సినిమాకు తమ సహకారం ఉందని చెప్పేందుకు పెద్ద, చిన్న సినిమాలకు రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాల పై నిర్ణయం తీసుకున్నామన్నారు.

తూర్పుగోదావరి జిల్లా పర్యాటక సంస్థ తరపున కడియపు లంకలో ఉన్న నర్సరీలతో టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామన్నారు. కడియం నర్సరీలో రిసార్ట్ ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. బోటు షికారు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్, స్థానిక ప్రజా ప్రతినిధులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. 2027లో గోదావరికి పుష్కరాలున్న నేపథ్యంలో రాజమహేంద్రవరాన్ని రివర్ ఫ్రంట్ గా అందంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడతామన్నారు.

అంతరాష్ట్ర ఉద్యోగుల బదిలీలు, ఆస్తుల పంపకంలో సుహృద్భావ వాతావరణంలో సూత్రప్రాయ అంగీకారం వచ్చిందన్నారు. త్వరలోనే ఆచరణలోకి వస్తుందని భావిస్తున్నామన్నారు. పర్యాటక శాఖలో కలుపు మొక్కల ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టామని ఉగాది నాటికి నూతనత్వం ఉన్న పర్యాటక శాఖను చూస్తారన్నారు. ఐఆర్ సీటీసీ తో భాగస్వామ్యం అవుతామన్నారు.

రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించుకోవాలనే విషయంలో ఆలోచిస్తున్నామన్నారు. నాగార్జున సాగర్ లా పోలవరం భవిష్యత్ లో పర్యాటక కేంద్రంగా మారే అవకాశంగా ఉంది. పట్టిసీమ, పోలవరాన్ని అనుసంధానించి ఎలా పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై ఆలోచిస్తామన్నారు. తిరుమలలో పవిత్రత, లడ్డూ నాణ్యత కోల్పోయిన అంశాలను ప్రస్తావిస్తూ తిరుమల పవిత్రతను కాపాడుతామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇప్పటికే కొన్ని ప్రారంభించాం రాబోయే రోజుల్లో మరిన్ని ప్రారంభించి పూర్తిస్థాయిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

LEAVE A RESPONSE