Suryaa.co.in

Andhra Pradesh

మీరు ఏ పార్టీ వారైనా సరే.. మీకేం కావాలో చెప్పండి..

– నాకు ఇవే చివరి ఎన్నికలు
– ఇకపై పోటీ చేయను
– ఓపిక ఉన్నంత వరకు మీ రుణం తీర్చుకుంటా…
– స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

అనకాపల్లి: మీరు ఏ పార్టీకి చెందిన వారు అయినా… నేను మనసులో పెట్టుకోను. మీకేం కావాలో అందరూ కలిసి చెప్పండి… వెంటనే మంజూరు చేస్తానని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. మీ అందరి ఆశీర్వాదంతోనే నేను ఈ రోజు సభాపతిగా ఉన్నాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులు పూర్తయ్యాయని తెలిపారు. ఆయన గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పుల సమస్యను ప్రస్తావించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వేల కోట్లు అప్పులు తీర్చుకుంటూ, ఎవరూ చేయలేని పథకాలను అమలు చేశారని వివరించారు.

అదనంగా, మెగా డీఎస్సీ ద్వారా 16,437 మందికి ఉద్యోగాలు కల్పించారని, 65 లక్షల మందికి పింఛన్లు పెంచిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. రైతులు అమ్మిన ధాన్యం బకాయిలకు రూ. 1,674 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. చెర్లోపాలెం గ్రామానికి రూ. 10 లక్షలతో రెండు సిమెంట్ రోడ్లు, రూ. 6.18 కోట్లతో ఊరంతా డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు.

ఇవే తన చివరి ఎన్నికలు అని, ఇకపై పోటీ చేయనని, తనకు ఓపిక ఉన్నంత వరకు ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు స్పీకర్‌కు గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు.. ఈ సందర్భంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ స్టిక్కర్‌ను స్పీకర్ గోడకు అతికించారు. శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టిక ఆహారం స్టాల్స్‌ను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయరాం, అనకాపల్లి జిల్లా పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు కరక సత్యనారాయణ, మాజీ సర్పంచ్ లోకవరపు కుల్లయ్య నాయుడు(బాబులు), నాతవరం మండలం టీడీపీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ, జనసేన ఇంచార్జీ సూర్యచంద్ర, ఇతర ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE