Suryaa.co.in

Andhra Pradesh

రైతులను వ్యాపారవేత్తలుగా మారుస్తాం

– ఔత్సాహిక గ్రామీణ యువతకు అవగాహన కల్పించి అమలు
– ప్రతి నియోజకవర్గంలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం
– రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు యూనిట్లు
– గరిష్టంగా రూ.50 లక్షల రాయితీ
– ఎన్డీయే ప్రభుత్వంలో సమర్థవంతంగా వినియోగిస్తాం
– వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ఔత్సాహిక యువతను, రైతులను వ్యాపారవేత్తులగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో పని చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం అమలు చేసేందుకు కసరత్తు చేసామని బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు.

లబ్ధిదారుల ఎంపిక నుంచి పర్యవేక్షణ, ప్రజెక్టు రిపోర్టు తయారీ, దరఖాస్తు సమర్పణ, బ్యాంకర్ల ప్రోత్సాహం వంటి అన్ని అంశాల్లో పశు సంవర్ధక శాఖ అధికారుల సహకారం ఉండే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. దశల వారీగా నియోజకవర్గాల్లో పథకం గ్రౌండింగ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

వ్యాపార ధోరణిలో జీవాల పెంపకం ; జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం ద్వారా గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల పెంపకానికి 50 శాతం రాయితీ అందిస్తున్నామని వెల్లడించారు.

కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.కోటి వరకు 50 శాతం రాయితీ, 10 శాతం రైతు వాటాతో పాటు మిగిలిన 40 శాతం బ్యాంకు రుణం మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

బ్యాంకర్ల ప్రోత్సాహం ; జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం పూర్తి స్థాయిలో అమలు జరిగేందుకు, వేగంగా రుణాలు మంజూరు అయ్యేందుకు బ్యాంకర్ల ప్రోత్సాహం అందించే విధంగా కృషి చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు.

పథకం సద్వినియోగం ; గత వైసీపీ ప్రభుత్వంలో రైతు ప్రయోజనం కలిగే ఎటువంటి నిర్ణయాలు, ప్రత్సాహక చర్యలు చేపట్టలేదని మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పథకం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లలా వారీగా లక్ష్యం ఏర్పాటు చేసుకుని జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE