Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీ లడ్డూ నాణ్యతలో నిజాలు నిగ్గు తేల్చాలి

-సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి
– మా పార్టీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రాజీనామా ఆశ్చర్యకరం
– ఆయన అంత అనైతికంగా వ్యవహరిస్తారని అనుకోలేదు
– సంతలో పశువుల్లా చంద్రబాబు ఎంపీలను కొంటున్నారు
– హెరిటేజ్‌ లో కూడా ఆవు నెయ్యి తక్కువ ధరకే అమ్ముతున్నారు
– మరి దాంట్లో కూడా జంతువులు కొవ్వు కలిపారా?
– మాజీ ఎంపీ మార్గాని భరత్‌ డిమాండ్‌

రాజమహేంద్రవరం: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా విపరీతంగా ప్రచారం చేసుకుంటూ.. ప్రతి ఇంటా స్టికర్‌ వేస్తున్నారని, అసలు ఈ ప్రభుత్వం ఏ మంచి పని చేసిందని తమది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటోందని మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ప్రశ్నించారు.

అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని, ఇప్పుడు కూడా టీటీడీ ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారని ఏకంగా సీఎం చంద్రబాబు దారుణ ఆరోపణలు చేశారని ఆయన దుయ్యబట్టారు. ఈ విషయంలో నిజానిజాలు నిగ్గు తేలాలన్న ఆయన, సుప్రీంకోర్డు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యికి సంబంధించి, టీటీడీ ఈఓ శ్యామలరావు గత జూలైలో మీడియాతో మాట్లాడుతూ, నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్‌ ఫ్యాట్‌ కలిసిందని చెప్పారు. రెండు నెలల తర్వాత సీఎం చంద్రబాబు, దారుణ ఆరోపణల తర్వాత, మళ్లీ మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈఓ, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చిందని తెలిపారు, అంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు మాటెలా మార్చారు?.

ఎన్‌డీడీబీ రిపోర్టును పబ్లిక్‌ డొమెయిన్‌లో పెట్టకుండా, అది టీడీపీ ఆఫీస్‌కు ఎలా చేరింది? టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తితో పని చేసే సంస్థ అని మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. మరి ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను టీడీపీ ఆఫీస్‌లో ఎలా రిలీజ్‌ చేశారు?

టీటీడీలో వినియోగించిన నెయ్యిపై ఎన్‌డీడీబీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడైతే, సెకండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదు? ఘజియాబాద్‌ ల్యాబ్‌ నుంచి మరో రిపోర్ట్‌ను ఎందుకు కోరలేదు? నెయ్యి కల్తీ అని రిపోర్ట్‌ వచ్చిన నాలుగు ట్యాంకర్లు తిప్పి పంపామని టీడీడీ ఈఓ ప్రకటించగా, ఆ నెయ్యిని వాడారని సీఎం తెలిపారు.

ఇందులో ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? ఇలా ఎందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు ఎలా దెబ్బ తీస్తున్నారు?
సీఎం చంద్రబాబు ఆరోపించినట్లుగా, లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగితే, ఆ లడ్డూలు తయారు చేసే వారికి ఏ మాత్రం అనుమానం రాలేదా? వారు ఆ మాత్రం గుర్తు పట్టలేరా? హెరిటేజ్‌ సూపర్‌ మార్కెట్‌లో కూడా ఆవు నెయ్యి తక్కువ ధరకే అమ్ముతున్నారు. మరి దాంట్లో కూడా జంతువులు కొవ్వు కలిపారా? అని నిలదీశారు.

ఈ విషయంపై విచారణ జరిపించాలని కోరుతూ, వైయస్‌ జగన్ ప్రధానమంత్రి, సీజేఐకి లేఖ రాయడంతో, భయపడిన సీఎం చంద్రబాబు, సిట్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. తను స్వయంగా ఏర్పాటు చేసిన సిట్, తనకే వ్యతిరేకంగా రిపోర్ట్‌ ఇస్తుందా? అని ప్రశ్నించారు. అందుకే సిట్‌ విచారణపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు.

తాను ఎంపీ అవుతానని ఆర్‌.కృష్ణయ్య ఎప్పుడూ ఊహించి ఉండరని అన్నారు. అలాంటి కృష్ణయ్య ఇంత దారుణంగా వ్యవహరిస్తారని అనుకోలేదని, సంతలో పశువుల్లా ఎంపీలను సీఎం చంద్రబాబు కొంటున్నారని ఆక్షేపించారు. ఇది పూర్తిగా దిగజారిన చంద్రబాబు రాజకీయాలకు పరాకాష్ట అని అభివర్ణించారు.

LEAVE A RESPONSE