– ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్
– డిగ్రీ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్నిఅందిస్తాం
– రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తాం
– కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు
– బిఎఫ్‌ఎస్‌ఐ నైపుణ్య శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగింది.గత పదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ప్రజా ప్రభుత్వం గుర్తించింది. అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించాం.
ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి 35 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసాం. రాబోయే రెండు మూడు నెలల్లో మరో 35 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టినా, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరదు. ప్రతిభ ఉన్నా నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఈ సమస్యను గుర్తించి నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టాం. తెలంగాణలో ప్రతీ ఏటా 3 లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారు. కానీ వారికి ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించి, నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు.
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించాలనే బీఎఫ్ఎస్ఐ తో మాట్లాడాం. బీఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించాం. డిగ్రీ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించాలనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం.నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను కూడా వాళ్లే సమకూర్చారు.వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
ఈ శిక్షణ తరువాత బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ సెక్టార్స్ లో ఉద్యోగాలు పొందుతారు.ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే మా లక్ష్యం. గత పదేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొంతమంది తెలంగాణ యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలయ్యారు. ఇటీవల పట్టుబడినవారిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉండటం ఆందోళనకరమైన విషయం.
డ్రగ్స్, గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.65 ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం.
రాబోయే రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తాం. ఇంజనీరింగ్ కాలేజీలపైనా ప్రత్యేక దృష్టి సారించాం. కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు చేయడం ఖాయం. పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నాం.
హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే కాదు. నైపుణ్యం అందించడంలోనూ హైదరాబాద్ కేరాఫ్ గా మార్చనున్నాం. సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ డెస్టినేషన్ కావాలి. ప్రపంచ వేదికపై హైదరాబాద్ ను విశ్వనగరంగా నిలబెట్టాలి. అందుకు మీ అందరి సహకారం అవసరం.
రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ , స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తాం. తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన వారు, ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారు. అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతాం.