Suryaa.co.in

Telangana

తెలంగాణ సమాజాన్ని నిలబెట్టడానికి అందరం కలిసి నడుద్దాం

– ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కొలువుల పండుగ డీఎస్సీ 2024 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్: జాబ్ క్యాలెండర్ ప్రకటించి తూ.చా తప్పకుండా దేశంలో అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రజా ప్రభుత్వం. తెలంగాణ సమాజాన్ని బాగు చేయాలని విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నది.

తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సంపద సృష్టిస్తాం. సృష్టించిన సంపదను ప్రజలకు పెంచడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ సమాజాన్ని నిలబెట్టడానికి అందరం కలిసి నడుద్దాం.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ వేయగా, ప్రతిపక్ష పార్టీలు అనేక ఆటంకాలు సృష్టించి కుటీల ప్రయత్నాలు చేసినప్పటికీ, వాటిని తిప్పి కొట్టి అనుకున్న సమయానికి పరీక్షలు నిర్వహించడంతో పాటు, అందరూ ఆశ్చర్యపోయే విధంగా ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఈరోజు 10,062 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం చాలా గర్వంగా ఉంది.

ఈ ప్రభుత్వం మనది మీ అందరిదీ అధికారంలోకి రాగానే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తామని చెప్పాం చెప్పినట్టుగానే చేశాం.పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు భర్తీ చేయడానికి కావలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

కొలువుల కోసం కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో, గత దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పాలకులు ఏనాడు ఉద్యోగాల నియామకం గురించి ఆలోచన చేయలేదు.

ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ల నియామకం గురించి ఆలోచన చేయలేదు.దశాబ్ద కాలంగా డీఎస్సీ నోటిఫికేషన్ గురించి పట్టించుకోలేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన, మంచి విద్యను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ వేయించారు.

డ్వాక్రా మహిళా సంఘాలతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేసి ప్రభుత్వ పాఠశాల మరమ్మత్తులకు నిధులు ఇచ్చి వాటిని బాగు చేశాం. గత దశాబ్ద పాలనలో ఉపాధ్యాయులు బదిలీలు పదోన్నతులకు నోచుకోలేదు.

ప్రజా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం 21,419 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 34,706 మంది ఉపాధ్యాయులకు బదిలీలను పారదర్శకంగా నిర్వహించాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు పోతున్న ప్రజా ప్రభుత్వాన్ని దీవించండి.

LEAVE A RESPONSE