Suryaa.co.in

Andhra Pradesh

భూసేకరణ సమస్యలను మూడు నెలల్లో ముగించండి

• నేషనల్ హైవే ప్రాజెక్టుల పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
•సమీక్షకు హాజరైన రాష్ట్ర, నేషనల్ హైవే అధికారులు, వివిధ ప్రాజెక్టుల పనులు చేస్తున్న ఏజెన్సీల ప్రతినిధులు
•రాష్ట్రంలో ప్రస్తుతం 129 నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులు జరుగుతుండగా….3,300 కి.మీ మేర హైవేల పనులు జరుగుతున్నాయన్న అధికారులు
•రాష్ట్రంలో మొత్తం రూ.76,000 కోట్ల ఎన్ హెచ్ పనులు జరుగుతున్నట్లు తెలిపిన అధికారులు
•ప్రాజెక్టుల వారీగా నేషనల్ హైవే పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష
•భూసేకరణ, కోర్టు సమస్యలు, అటవీ శాఖ అనుమతుల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్
•సంబంధిత విభాగాలతో పోర్టల్ ఏర్పాటు – సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు

అమరావతి: అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ప్రగతి పరుగులకు మార్గం సుగమం చేసేలా హైవే ప్రాజెక్టు అథారిటీ అధికారులు, పనులు చేపట్టిన నిర్మాణ సంస్థలు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వర్ణచతుర్భుజి రహదారుల తరువాత దేశంలో వచ్చిన మార్పులను గుర్తుంచుకుని ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు.

మౌలిక సదుపాయాల కల్పన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేషనల్ హైవే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. సమీక్షకు రాష్ట్ర, నేషనల్ హైవే అధికారులు, వివిధ ప్రాజెక్టుల పనులు చేస్తున్న ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 129 నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులు జరుగుతుండగా, 3,300 కి.మీ మేర రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. మొత్తం రూ.76,000 కోట్ల ఎన్ హెచ్ పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఇవి కాకుండా రానున్న రోజుల్లో మరో రూ. 30 వేల కోట్ల కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. సమీక్షలో ఆయా పనుల ప్రస్తుత పరిస్థితి, నిర్థేసిత లక్ష్యం, ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు, పరిష్కరించాల్సిన సమస్యలపై చర్చించారు.

ప్రాజెక్టులు మంజూరు అయినా భూసేకరణ పూర్తి అవ్వకపోవడం వల్ల 260 కి.మీ కు చెందిన రూ. 4,766 కోట్ల విలువైన 11 ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫారెస్ట్ క్లియరెన్స్ లు, భూ సేకరణ, కోర్టు కేసుల కారణంగా ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. బెంగుళూరు-కడప-విజయవాడ ఎక్స్ ప్రెస్ వే 9వ ప్యాకేజీలో 7.5 కి.మీ నిర్మాణానికి సంబంధించి అటవీ శాఖ నుండి అనుమతులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

కడప – చిన్నఓరంపాడు మధ్య రూ. 1,222 కోట్లతో నిర్మిస్తున్న 64.2 కి.మీ రోడ్డు, చిన్నఓరంపాడు-రేణిగుంట మధ్య రూ. 1,032 కోట్లతో నిర్మిస్తున్న 57 కి.మీ రోడ్డు పనులకు అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇలా మొత్తం 260 కి.మీ.కు నేషనల్ హైవేలకు సంబంధించి కోర్టు కేసులు, భూ సమీకరణ, పరిహారం, స్టేటస్ కో ఆర్డర్స్ కారణంగా పనులు పెండింగులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ సమస్యలను మూడు నెలల్లో పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సిఎం ఆదేశించారు. పనులు చేస్తున్న వివిధ సంస్థల ప్రతినిథులు తమ సమస్యలు వివరించారు. దీంతో అన్ని శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు.

9 మందితో నేషనల్ హైవే, ఫారెస్టు, రైల్వే, రెవెన్యూ, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సిఎం తెలిపారు. దీనితో పాటు అన్ని విభాగాలతో కలిపి ఒక పోర్టల్ ఏర్పాటు చేసి సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చే ప్రత్యేక పోర్టల్ ద్వారా ఇలాంటి సమస్యలకు సత్వర పరిష్కారం ద్వారా హైవే ప్రాజెక్టుల పనులు వేగవంతం చేస్తామని తెలిపారు.

కాంట్రాక్టర్లు హైవేలలో నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లవచ్చని సీఎం తెలిపారు. అదేవిధంగా హైవే ప్రాజెక్టుల్లో అవసరమైన గ్రావెల్ కోసం నిర్మాణ సంస్థలకు అవసరమైన అనుమతులు సులభంగా వచ్చేలా చేస్తామని సీఎం తెలిపారు. అయితే అనుకున్న లక్ష్యం మేరకు ఎవరు పనులు చేయకపోయినా సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని సిఎం తెలిపారు.

వేగంగా హైవే ప్రాజెక్టులు పూర్తి చేయడం తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్య మని సిఎం అన్నారు. ప్రతి మూడు నెలలకు పనులపై సమీక్ష చేస్తామని తెలిపారు. కేంద్రం చేపట్టిన భారత మాల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో 3 ప్రాజెక్టులు 6 లేన్ల రోడ్లతో ఉన్నాయి. రాయపూర్-విశాఖపట్నం, చిత్తూరు-తచ్చూరు, బెంగళూరు-కడపకు 6 లేన్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది.

మొత్తంగా 518 కి.మీ మేర రాష్ట్రంలో 6 లేన్ల రహదారుల నిర్మాణం జరుగుతోంది. అలాగే 4 లేన్ల పనులు జరుగుతున్న ప్రాజెక్టులు 4 ఉన్నాయి. బెంగళూరు-చెన్నై, హైదరాబాద్-విశాఖపట్నం, సోలాపుర్-కర్నూలు-చెన్నై, నాగపూర్-విజయవాడ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని అధికారులు వివరించారు.

రూ.26,000 కోట్లతో 189 కి.మీ విస్తీర్ణంలో అమరావతి అవుటర్ రింగ్ రోడ్, రూ. 300 కోట్లతో 56 కి.మీ మేర కుప్పం- హోసూరు- బెంగుళూరు నాలుగు లైన్ల రోడ్, మూలపేట నుంచి విశాఖ వరకు రూ. 8,300 కోట్లతో 165 కి.మీ మేర 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ కోస్టర్ హైవే, హైదరాబాద్ -విజయవాడ మధ్య 226 కి.మీ రోడ్డును రూ. 8 వేల కోట్లతో 4 లైన్ల నుంచి 6 లేదా 8 లేన్లుగా పెంచే ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందని తెలిపారు.

నేషనల్ హైవే రోడ్ల ప్రాజెక్టుల లో బ్రిడ్జిలు నిర్మించే స్ట్రక్చర్స్కు గేట్లు పెట్టడం ద్వారా నీటిని నిల్వఉంచే అవకాశాలను, సాధ్యాసాద్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇలా చెక్ డ్యాం తరహాలో నీటిని నిల్వ చేస్తే గ్రౌండ్ వాటర్ పెరగడంతో పాటు……ఆ ప్రాంత నీటి అవసరాలు తీరుతాయని, ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సిఎం సూచించారు.

మళ్లీ మూడు నెలల తరువాత ఆయా ప్రాజెక్టులపై సమీక్ష చేసి ప్రోగ్రస్ ను లెక్కిస్తామని సీఎం అధికారులకు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు తెలిపారు.

LEAVE A RESPONSE