– జగన్ కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా?
– వైఎస్ మరణానికి బాబు కారణం అయితే, మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా?
– ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు?
– మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని సాయి రెడ్డి ప్రమాణం చేయగలరా ?
– వైఎస్ మ్యాండేట్ అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ?
– వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్
విజయవాడ : తన తండ్రి దివంగత నేత వైఎస్ మృతికి చంద్రబాబు కారణమంటున్న విజయసాయిరెడ్డి, ఐదేళ్ల అధికారంలో దానిపై విచారణ జరపకుండా గాడిదలు కాస్తున్నారా? ప్రత్యేక విచారణ జరిపి, నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి నిలదీశారు. తనను వెంటాడి.. వేటాడే కాటేసే విషపు పాముగా అభివర్ణించిన విజయసాయిరెడ్డికి.. మీ నాయకుడు జగన్ విషపు నాగు అని కౌంటర్ ఇచ్చారు.
షర్మిలారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. సాయి రెడ్డి గారు..మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా ? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న వైఎస్ మ్యాండేట్ అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ? మీరు కూడా జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా?
రాజకీయంగా,ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్ళే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే. వైఎస్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది వైఎస్ . బంగారు బాతును ఎవరు చంపుకోరు. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరు.
వైఎస్ మరణానికి చంద్రబాబు కారణం అయితే, మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు? దోషులను ఎందుకు శిక్షించలేదు? అనుమానం ఉండి, 5 ఏళ్లు అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా ?
వైఎస్ మరణం తర్వాత చార్జిషీట్ లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదా? కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా ? చేయకపోతే జగన్ సీఎం అయిన వెంటనే, మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు ? ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ గారు కాదా ?
చంద్రబాబు తో నాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. వైఎస్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబు ని పిలిచారు. అలాగే నేను కూడా పిలిచాను. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్ళకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి ?
జగన్ కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా? ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. చంద్రబాబే కనిపిస్తున్నట్లుంది. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటానికో.. ఆయన బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో.. పని చేయాల్సిన అవసరం వైఎస్ బిడ్డకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నా.