– బూడిదను మా ప్రజలపై రుద్దుతారా ?
– రైతు బిడ్డలు నష్టపోతున్నారు
– కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణే మా అందరి లక్ష్యం
– అవసరమైతే కాళ్లు పట్టుకుంటాం…లేదంటే పోరాటానికి దిగుతాం
– అంతేకానీ గత ప్రభుత్వంలో పాలకుల మాదిరిగా బొల్లికూతలతో కాలయాపన చేయబోం
– ముత్తుకూరు మండలంలోని అదానీ కృష్ణపట్నం పోర్టు వద్ద మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
– అఖిలపక్ష నాయకులతో కలిసి పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ తో భేటీ అయిన సోమిరెడ్డి
– కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాల్సిన అవసరాన్ని సీఈఓకు స్పష్టంగా వివరించిన అఖిలపక్ష పార్టీల నాయకులు
– బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలను కలిపిన సోమిరెడ్డి
కృష్ణపట్నం: కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణకు సంబంధించి కృష్ణపట్నం పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ తో చర్చలు జరిపాం. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ప్రారంభమైన కృష్ణపట్నం పోర్టును ఈ రోజు అదానీ యాజమాన్యం మూసివేసే పరిస్థితి తేవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించాం.
ఎగుమతులు, దిగుమతులును కాటుపల్లి, ఎన్నూరులకు మార్చి కాలుష్యం వెదజల్లే బొగ్గు, బూడిదను మా ప్రజలపై రుద్దుతారా అని అడిగాం. మా రైతులే పండించే బియ్యం, పత్తి, పొగాకు, ఎండుమిర్చితో పాటు చేపలు, రొయ్యలు గతంలో కృష్ణపట్నం పోర్టుకు ఒక్కరోజులోనే చేరేవి. ఇప్పుడు కాటుపల్లి, ఎన్నూరులలో వారం రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటంతో పాటు పెరిగిన రవాణా ఖర్చుల భారం కూడా రైతులపైనే పడుతోంది.
కంటైనర్ టెర్మినల్ ఇక్కడి నుంచి తరలిపోయిన కారణంగా అంతిమంగా రైతు బిడ్డలు నష్టపోతున్నారు. కృష్ణపట్నం పోర్టు కోసం 6 వేల ఎకరాలు, కృష్ణపట్నం ఎస్ఈజెడ్ కోసం 8 వేల ఎకరాలు, రిలయన్స్ ప్రాజెక్ట్ కోసం 2600 ఎకరాలు, కిసాన్ సెజ్ కోసం 2300 ఎకరాలను మా రైతులు త్యాగం చేశారు.
సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెల 6న క్రిస్ సిటీకి శంకుస్థాపన చేయాల్సివుంది. కానీ వర్షాల కారణంగా వాయిదాపడింది.
2600 ఎకరాలతో ఏర్పాటు కాబోతున్న క్రిస్ సిటీ (కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ నోడ్) కూడా పోర్టు, కంటైనర్ టెర్మినల్ ఆధారంగానే ఈ ప్రాంతానికి మంజూరయ్యాయి. క్రిస్ సిటీతో వస్తున్న ప్రధానమంత్రికి కొత్త పరిశ్రమలతో స్వాగతం పలకాల్సిందిపోయి, కంటైనర్ టెర్మినల్ మూసేశామని అదానీ చెబుతారా?
కంటైనర్ టెర్మినల్ ఇక్కడి నుంచి తరలిపోవడంతో వృత్తి నిపుణులు, పట్టభద్రుల నుంచి లారీ డ్రైవర్ల వరకు 10 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాత ముత్తాతలు ఇచ్చిన భూములు, గ్రామాలను ఈ ప్రాంత రైతులు కృష్ణపట్నం పోర్టు ఏర్పాటు కోసం త్యాగం చేస్తే మీరు కంటైనర్ టెర్మినల్ మూసేసి వారి పొట్టకొడతారా?
ఈ ప్రాంత ప్రజలు, రైతులు, రైతుబిడ్డల ప్రయోజనాల కోసం కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించమని, అదానీ కాళ్లు పట్టుకునేందుకైనా సిద్ధం ..లేదంటే పోరాటానికైనా వెనుకాడం.మాకు పోరాటాలు కొత్త కాదు. గతంలో అఖిలపక్షంతో కలిసి సారా వ్యతిరేక ఉద్యమం చేశాం.థర్మల్ పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాడాం. 20 రోజుల సమయం ఇస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని జగదీష్ పటేల్ హామీ ఇచ్చారు.
నెల రోజులు కూడా ఎదురుచూస్తాం.ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు కార్యాచరణ చేపడతాం. అంతే కానీ గత ప్రభుత్వంలో ఉన్న ఒక వ్యక్తిలాగా బొల్లి కూతలు కూస్తూ ఇక్కడ కంటైనర్ టెర్మినల్ ఉందని మాత్రం బుకాయించాం. వాళ్లు ధనం కోసం బతికితే,మేమంతా జనం కోసం బతుకుతాం. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను పునరుద్ధరించడమే మా అందరి లక్ష్యం.
అదానీ కంపెనీ గంగవరం పోర్టును పొందిన తర్వాత సెప్టెంబర్ 4న మొదటి కంటైనర్ వెజల్ స్టార్ చేసింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ప్రకారం కృష్ణపట్నం పోర్టు మొదటి ఫేస్ లో 4, సెకండ్ ఫేస్ లో 3 బెర్తులను కంటైనర్ టెర్మినల్ కే వాడాలి..మిగిలినవి బల్క్ కార్గోకి వినియోగించాలి. కంటైనర్ టెర్మినల్ ను మూసేసి ఆ బెర్తులను కూడా బల్క్ కార్గోకు వినియోగించుకోవడం సరికాదు.
గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు కలవవు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలవవు. సీపీఎం, సీపీఐ మా కూటమిలో లేవు. మేం ఓట్ల కోసం ప్రయత్నించడం లేదు. మా పార్టీల సిద్ధాంతాలు వేరైనా, రాజకీయంగా విబేధాలున్నా వేలాది ఎకరాలు త్యాగం చేసిన రైతుబిడ్డల ప్రయోజనాలను కాపాడటానికి అందరం ఒకే వేదికపైకి వచ్చాం. ఉద్యోగాలు కోల్పోయిన యువతకు తిరిగి ఉపాధి కల్పించడం కోసం అందరం ఐక్యంగా పోరాడుతున్నాం.
అదానీ కృష్ణపట్నం పోర్టు సీఈఓతో సోమిరెడ్డితో కలిసి చర్చల్లో బీజేపీ రాష్ట్ర నేత కర్నాటి ఆంజనేయరెడ్డి, రవీంద్రరెడ్డి, సంపత్ కుమార్, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ చార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సీఐటీయూ నేత మోహన్ రావు, సీపీఐ నాయకుడు శంకర్ కిషోర్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.