– సీఎంకు అధికారుల కృతజ్ఞతలు
హైదరాబాద్: ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ సంక్షేమ విభాగాల సెక్రటరీలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దీపావళి కానుకగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని వసతిగృహాల్లో డైట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది.
డైట్ ఛార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్ లో మార్పులు, చేర్పులు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పది రోజుల్లో కొత్త డైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కోరారు. పెంచిన డైట్, కాస్మోటిక్ ఛార్జీలతో 7,65,705 మంది విద్యార్థులకు మేలు కలుగనుంది.