– రేవంత్ రెడ్డి చేతలు గడప దాటడం లేదు
– మాజీ మంత్రి హరీష్ రావు
– ఇది రైతు ప్రభుత్వం కాదు, రాబందు ప్రభుత్వం
– రైతు బంధు ఎగబెట్టారు, రుణమాఫీ మోసం చేశారు
– రేవంత్ సర్కార్ చేతకానితనం రైతులకు నష్టాన్ని కలిగిస్తుంది.
– కరెంటు సరఫరా సక్రమంగా లేక యాసంగి పంట వేసేందుకు రైతులు భయపడుతున్నారు
– సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీశ్ రావు
– రైతులతో మాట్లాడి వడ్ల కొనుగోలు ప్రక్రియపై వివరాలు
సిద్దిపేట: రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటాం అన్నారు. కానీ ప్రభుత్వం సకాలంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు పండించిన వడ్లన్నీ దళారుల పాలయ్యాయి.
రాఘవపూర్ గ్రామంలో 4-5 వేల క్వింటాళ్ల వడ్లు ఇప్పటికే స్థానిక రైస్ మిల్లులకు, మధ్య దళారులకు అమ్ముకున్న పరిస్థితి. అబ్దుల దేవయ్య అనే రైతు 92 క్వింటాళ్ల వడ్లు కల్లంలో పోసి నెల రోజులు ఎదురు చూసి 1900 రూపాయాలు అమ్ముకున్నాడు. అంటే క్వింటాల్ కి 420 రూ నష్టం. కాంగ్రెస్ ఇస్తానన్నా బోనస్ తో కలిపితే 81,000 రూ ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల నష్టం జరిగింది.
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎన్నో మాటలు చెప్పారు కనీసం ఒక్క మంత్రి అయినా వడ్ల కల్లాలకు పోయి ఏంటి పరిస్థితి అని చూస్తున్నారా..? బోనస్ ఇవ్వకుండా, వడ్లను కొనకుండా రైతులను అన్ని విధాలుగా నష్టం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్.
ఇది రైతు ప్రభుత్వం కాదు రాబందు ప్రభుత్వం. రైతుల ఉసురు పోసుకుంటున్నావు, కన్నీళ్లు పెట్టిస్తున్నావు. రైతులకు భయం పట్టుకున్నది వడ్లు కొంటాడో కొనడో, కొంటే డబ్బులు వస్తాయో రావో అనే భయం పట్టుకుంది.
మొదట రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచు, తక్షణమే 48 గంటల్లో కొన్న వడ్లకు డబ్బులు చెలించి రైతులకు కొంత ఊరటనివ్వు..కలుపు కాకముందే రైతు బంధు పైసలు ఇచ్చేది కెసిఆర్, సకాలంలో ఎరువులందించి పంట కొయ్యకముందే గన్నీబ్యాగులు తెచ్చి మిల్లులకు టై అప్ చేసి పంటను కొనేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.
రేవంత్ వచ్చాక రైతు బందు ఎగబెట్టిండు, బోనస్ బోగస్ చేసిండు, వడ్లు కొనే దిక్కులేని పరిస్థితి చేసిండు. రెండు లక్షలు రుణమాఫీ అన్నాడు రాఘవపూర్ లో సగం మందికి మాఫినే కాలే. రాష్ట్రంలో ఇప్పటివరకు 30 శాతం వడ్లు రైతులు దళారులకు అమ్ముకున్నారు. ఇప్పటికైనా మిల్లులకు టై అప్ చేసి మద్దతు ధరకి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నాం.
వానాకాలం, యాసంగి పంటలకు గాను ప్రభుత్వం రైతులకు బాకీపడ్డ రైతు బంధు 7500+7500 మొత్తం 15 వేలు వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నం. రుణమాఫీ పైన నీ ఒట్లకు మొక్కాలే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో రెండే మంచిగా ఉంటాయి ఒకటి ఒట్లు రెండు తిట్లు.
ఎవరైనా ఏదైనా అడిగితే తిట్టుడు పెడుతాడు నమ్మతులేరు అనుకో దేవుని మీద ఒట్లు పెడుతాడు. పంద్రా ఆగష్టు వరకు రుణమాఫీ చేస్తా అని కనిపించిన ప్రతి దేవుని మీద ఒట్టు పెట్టిండు, ఓట్లు డబ్బాలు వేసుకున్నాక మోసం చేసాడు.
కెసిఆర్ ఉండగా దవాఖానకు పోతే కెసిఆర్ కిట్టు, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి కడుపునిండా అన్నం పెట్టి తల్లిని పిల్లను ఇంటిదగ్గర దించిపోవు. ఇప్పుడు కెసిఆర్ కిట్టు బంద్ పెట్టితివి, ఆడబిడ్డలకు చీరలు బంద్ పెడితివి, రైతు బంధు ఎగబెట్టిండు, రెండు నెలలు పెన్షన్ కూడా ఎగబెడితివి.
4వేలు పెన్షన్ ఇస్తా అని కెసిఆర్ ఇస్తున్న 2వేల పెన్షన్ కూడా రెండు నెలలు ఎగబెట్టిండు. ముసలోళ్ల పెన్షన్ కూడా ఎగబెట్టిన పుణ్యాత్ముడు రేవంత్ రెడ్డి. దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోళ్లు ఎవరైనా ఉంటారా..? అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు బర్త్డే జరుపుకుంటే మాకు కంటగింపు ఎం లేదు. ప్రజలను మంచిగా చూసుకో చాలు.
యాదగిరి లక్ష్మి నరసింహా స్వామి మీద ఒట్టు పెట్టి అటున్న సూర్యుడు ఇటు పొడిసిన పంద్రా ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తానని మాటతప్పినందుకు తప్పయిందని దేవుని ముందు ముక్కు నేలకు రాయి..
పాలకుడే పాపాత్ముడైతే ఆ రాజ్యానికి అరిష్టం అయితది అంట. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వే దేవునిమీద ఒట్టు చేసి మాటతప్పితే ప్రజలకు ఏమైనా నష్టం కాజిక్కా. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది ప్రజలకు మంచి చెయ్యి, కానీ ఇట్లా మోసం చేస్తే విడిచిపెట్టం.
రైతు బంధు ఇవ్వాల్సిందే, రుణమాఫీ చెయ్యాల్సిందే, పంట కొనాల్సిందే అప్పటి వరకు నిన్ను విడిచి పెట్టం. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు. కరెంటు కూడా సరిగా ఉండటం లేదు మోటార్లు కాలుతున్నాయి. యాసంగి పంట వెయ్యడానికే రైతులు భయపడుతున్నారు.
ఏఐసీసీ ట్విట్టర్ లో తెలంగాణాలో 24 గంటల కరెంటు ఇస్తున్నాం అని పెట్టుకుంటున్నారు, ఎక్కడైనా వస్తుందా 24 గంటల కరెంటు..? కెసిఆర్ 24 గంటలు కరెంటు ఇచ్చాడు, కాంగ్రెస్ అంత 15 గంటలు కూడా ఇవ్వడం లేదు.