Suryaa.co.in

Andhra Pradesh

జగన్.. నాదీ రాయలసీమే

– వైఎస్ జగన్ వార్నింగ్‌పై తిరుపతి ఎస్పీ ఎస్పీ సుబ్బారాయుడు ఘాటు జవాబు

తిరుపతి: పోలీసులను బెదిరిస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు ఘాటైన జవాబు ఇచ్చారు. ‘నాదీ రాయలసీమనే’.. అంటూ సుబ్బారాయుడు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. జగన్ హెచ్చరికలపై స్పందించిన తొలి ఐపిఎస్ అధికారి సుబ్బారాయుడు కావడం విశేషం. వివాదరహితుడైన సుబ్బారాయుడిని వైసీపీ అధినేత జగన్ పేరు పెట్టి మరీ హెచ్చరించడాన్ని పోలీసులు జీర్ణింంచుకోలేకపోతున్నారు.

సోషల్ మీడియా వేదికగా అనుచిత, అసభ్యకర పోస్టులు, వీడియోలు పెడుతున్న, పెట్టినవారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రశ్నిస్తున్నారనే కారణంతోనే సోషల్ మీడియా యాక్టివిస్టులను ప్రభుత్వం వేధిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు వైఎస్ జగన్ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు.

ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదని.. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు మద్దతు తెలిపే పోలీసులు సప్తసముద్రాల అవతల ఉన్నా సరే వెనక్కి పిలిపించి చర్యలు తీసుకుంటామంటూ జగన్ ఇటీవల హెచ్చరించారు. ఈ క్రమంలోనే తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పేరును ప్రస్తావించారు.

తెలంగాణ నుంచి డిప్యుటేషన్ మీద వచ్చిన సుబ్బారాయుడు.. మళ్లీ తెలంగాణకు వెళ్లిపోతాననే ధైర్యంతో వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. “ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. జమిలి ఎన్నికలు అంటున్నారు. అధికారం తొందరగా పోతుంది. జమిలి ఎన్నికలు రాకపోయినా ఉండేది నాలుగేళ్లు. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. మీరు చేసిన చట్టవ్యతిరేక పనులను దగ్గరుండి బయటకు తీస్తాం. రిటైర్‌మెంట్ అయ్యి వెళ్లిపోతామని అనుకుంటున్నారేమో.. రిటైర్ అయినా వెనక్కి పిలిపిస్తాం. తిరుపతిలో సుబ్బారాయుడు ఉన్నాడు.

తెలంగాణ నుంచి డిప్యుటేషన్ మీద చంద్రబాబు నాయుడు తెప్పించుకున్నాడు. డిప్యుటేషన్ పూర్తైన తర్వాత తిరిగి తెలంగాణ వెళ్లిపోతాలే అని అనుకుంటున్నాడేమో. తెలంగాణ నుంచి వెనక్కి పిలిపిస్తాం. సప్తసముద్రాల అవతల ఉన్నా సరే.. పిలిపిస్తాం. అందరూ పోలీసులకు చెప్తున్నా” అంటూ జగన్ హెచ్చరించారు.

అయితే వైఎస్ జగన్ హెచ్చరికలపై తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. తన విధులను తాను నిర్వర్తిస్తున్నానన్న సుబ్బారాయుడు.. తనపై నమ్మకంతోనే తిరుపతి జిల్లాకు ఎస్పీగా ప్రభుత్వం నియమించిందన్నారు. మంచి ఆశయంతో పనిచేస్తున్నానని, తనదీ రాయలసీమ జిల్లానేనన్న సుబ్బారాయుడు.. అనంతపురం జిల్లాగా చెప్పారు. చట్టపరంగానే పనిచేస్తున్నానన్న తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు.. రాజకీయ విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

LEAVE A RESPONSE