– కల్వరీ టెంపుల్ సతీష్ ని అభినందిస్తున్నా
– ఎల్బీ స్టేడియంలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: డా.సతీష్ సమాజ సేవకు అంకితమై 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు. డిసెంబర్ 7, 2023న ఇదే ఎల్బీ స్టేడియంలో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ మేం బాధ్యత తీసుకున్నాం. చెడును తొలగించి మంచిని పెంచేందుకు కృషి చేస్తున్న మీ అందరినీ అభినందిస్తున్నా.
భారతీయ సంస్కృతి ఎంతో బలమైంది. కుల, మతాలకు అతీతంగా ఇక్కడ అందరికీ గౌరవం ఉంటుంది. విద్య, వైద్య సేవల్లో క్రిస్టియన్ మిషనరీల కృషి అభినందనీయం. విద్య వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో తక్కువ ఖర్చుతో క్రిస్టియన్ మిషనరీలు నాణ్యమైన విద్య అందిస్తున్నాయి.
క్రిస్టియన్ మిషనరీలు నిర్వహిస్తున్న ఆసుపత్రులు ఆదర్శనీయం. ప్రతీ పేదవాడికి సరైన వైద్యం అందించాలని ఆనాడు వైఎస్ రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. కల్వరీ టెంపుల్ ను అంత గొప్పగా నిర్వహించడం సతీష్ గారికే సాధ్యమైంది. వారిని నేను అభినందిస్తున్నా.
యువత వ్యసనాలకు బానిస కావడం సమాజానికి తీరని నష్టం. గంజాయి, డ్రగ్స్ పీడ విరగడ చేసేలా సామాజిక బాధ్యతగా భక్తులకు సందేశం ఇవ్వాలని సతీష్ ని కోరుతున్నా. గంజాయి, డ్రగ్స్ రూపుమాపేందుకు ప్రభుత్వం వైపు నుంచి మా వంతు కృషి చేస్తున్నాం. దైవ దూతగా మీ వైపు నుంచి మీవంతు బాధ్యత తీసుకోండి.
భారత దేశం మత సమ్మరస్యానికి ప్రతీక. రాష్ట్రంలో మత వివక్షకు తావులేదు. మతకల్లోలాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతీ పేద వాడికి చేర్చే బాధ్యత మాది.
ప్రభుత్వంపై మీ విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించండి. దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. రాహుల్ గాంధీ గారికి మీ అందరి మద్దతు ఉండాలని కోరుతున్నా.