Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో స్వర్ణయగం మొదలైంది

– బీసీలు విద్యావంతులు కావాలి.. అన్ని రంగాల్లో ముందుండాలి
– రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత
-అనంతపురంలో వైభవంగా శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలు

అనంతపురం: తమ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో స్వర్ణయగం మొదలైందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు.

అనంతపురం నగరంలోని గుత్తి రోడ్ లో ఉన్న కె.టి.ఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవారం శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత, అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబిక లక్ష్మీనారాయణ, బీకే.పార్థసారథి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, రాష్ట్ర బి.సి.వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ పోలా భాస్కర్, ఐఏఎస్, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సంచాలకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.ఏ.మల్లికార్జున ఐ.ఏ.ఎస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకదాస చిత్రపటానికి మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర బి.సి.వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సంచాలకులు, జిల్లా కలెక్టర్, తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను విజయవంతం చేసిన కురుబకుల బాంధవులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కురుబలను రాజకీయంగా, వ్యాపార, ఆర్థికంగా ముందుకు తీసుకువచ్చారని, బడుగు బలహీన వర్గాలను ఎంతగానో ఆదుకున్నారన్నారు. ఆనాడు దివంగత నేత ఎన్టీఆర్ రామచంద్రయ్యకు మంత్రి పదవిని ఇచ్చారని గుర్తు చేశారు. బీసీలను గుర్తించి వారు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకునేది తెలుగుదేశం పార్టీ అన్నారు. జిల్లాలో రెండు ఎంపీ స్థానాలను కురుబలకు కేటాయించారని, ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చి మంత్రిగా చేశారని, బీసీ సంక్షేమ శాఖను తనకు కేటాయించారన్నారు.

బీసీలను చైతన్యవంతులు చేయాలని, రాష్ట్రంలో స్వర్ణ యుగం మొదలైందని, రాష్ట్రవ్యాప్తంగా కనకదాస జయంతోత్సవాలు ప్రతి జిల్లా కేంద్రంలో చేయాలని 12.50 లక్షల నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయించారన్నారు. భక్త కనకదాసు అందరూ సంయుక్తంగా ముందుండాలని, ఏదైనా సాధించవచ్చని చెప్పారని, ఊరురా కీర్తనలు చేస్తూ అన్నింటిలో ముందంజలో ఉండాలని తెలియజేశారని, కురుబ కులంలో కనకదాసు ఉండడం గర్వకారణం అన్నారు.

బీసీలు, బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, తన కూటమి ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి బీసీ వ్యాపారవేత్త కావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యం అని, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలన్నారు. కురుబలు షీఫామ్ పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారని, వారికి 50 లక్షల వరకు రుణాలు ప్రతి యూనిట్ కి ఇవ్వడం జరుగుతుందన్నారు. యూనిట్ కి ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం బిసి సంక్షేమ శాఖ తరఫున ఇచ్చే అవకాశం ఉందన్నారు.

అందులో 10 శాతం లబ్ధిదారుని వాటా, 40 శాతం సబ్సిడీ, 50 శాతం బ్యాంకు రుణం వస్తుందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు నిధులు లేవని, అవి ఉత్సవ విగ్రహాలుగా మారాయని, ప్రస్తుతం కార్పొరేషన్లకు వెయ్యి కోట్ల వరకు నిధులు ఇవ్వడం జరిగిందని, బీసీలు అని రంగాల్లో ముందుండాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కంకణం కట్టుకున్నారన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీని విడుదల చేయడం, అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, టిటిడిలో బోర్డ్ మెంబర్ గా కురుబలకు వచ్చే దశలో అవకాశం ఇవ్వడం జరుగుతుందని, శ్రీశైలంలో బోర్డ్ మెంబర్ గా కురుబలకు ఇస్తామన్నారని తెలిపారు. బీసీ బిడ్డలు విద్యావేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని, వారికి స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యత కావాలని అడిగారని, ఎన్డీఏ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.

కురుబ కనకదాస కళ్యాణ మండపానికి రూ.20 లక్షలు కేటాయిస్తాం : అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ
సామాన్య కుటుంబంలో జన్మించి కుల వివక్షతకు వ్యతిరేకంగా శ్రీ భక్త కనకదాస పోరాడారని అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సమాజంలో అందరూ సమానమని, అందరూ మంచి మిత్రులుగా మెలగాలన్నారు. సమాజానికి కనకదాస మార్గోపదేశం చేశారన్నారు. కురుబలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని, ఇంతకుముందు ఎవరూ అలా ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. తమను ఎన్నికల్లో గెలిపించిన వాల్మీకులు, కురుబ సామాజిక వర్గాల వారికి పాదాభివందనం చేస్తున్నామన్నారు. కురుబలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కురుబ కనకదాస కళ్యాణ మండపం కోసం ఎంపీ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయిస్తామన్నారు.

ఇచ్చిన హామీ మేరకు కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు : హిందూపురం ఎంపీ బీకే.పార్థసారథి
ఎన్నికలకు ముందు భక్త కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహించాలని చంద్రబాబుని అడిగితే ఆనాడు ఆయన హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేరుస్తూ ఈరోజు అధికారికంగా కనకదాసు జయంతి కార్యక్రమం నిర్వహించారని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేశ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామని హిందూపురం ఎంపీ బీకే.పార్థసారథి పేర్కొన్నారు.

కురుబలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి : అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను అనంతపురంలో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కురుబలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించారని, పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహించిన సవితమ్మకు మంత్రి పదవి ఇచ్చారని, హిందూపురం పార్లమెంట్ కు ఎంపీగా పార్థసారథికి అవకాశం కల్పించారన్నారు. కనకదాస 1509 లో జన్మించారని, సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఆయన రచనలు చేశారని, కృష్ణ భక్తుడిగా తన జీవితాన్ని దైవానికి అంకితం చేశారన్నారు. సమాజంలో వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారని, కురుబల ఆరాధ్య దైవంగా ఆయన నిలిచారన్నారు. కురుబలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోందన్నారు.

గొర్రెల యూనిట్లు, రుణాలు అధికంగా ఇచ్చి కురుబల్ని ఆదుకోవాలి : రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
పరిటాల కుటుంబం మొదటి నుంచి కురుబలకు అండగా ఉంటోందని, వారు కూడా కష్ట కాలంలో మా వెన్నంటే నడిచారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. పరిటాల రవి మొదటి నుంచి కురుబ కులస్థులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచారన్నారు. పరిటాల రవి మరణాంతరం మా కుటుంబానికి కురుబలు అండగా నిలిచారన్నారు. ఒకప్పుడు పార్థసారథిని జడ్పీ ఛైర్మన్ ని చేయడంతో పాటు.. ఇంకా ఎంతో మంది కురుబలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించిన వ్యక్తి పరిటాల రవి అన్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ రామచంద్రారెడ్డి లాంటి వారిని మంత్రిగా చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కురుబలకు ప్రాధాన్యమిస్తూ.. వారికి అండగా నిలిచారన్నారు.

కురుబలకు ఇది గొప్ప పండుగ : కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
 కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవం కురుబలకు ఇది గొప్ప పండుగ అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలో కురుబలు చాలామంది ఉన్నారని, వారికి చాలా సమస్యలు ఉన్నాయని, కేంద్రంలో కావాల్సిన నిధులు ఉన్నాయని, ఉమ్మడి అనంత జిల్లాకు అవసరమైన నిధులను తీసుకురావాలని ఎంపీలను కోరారు. వచ్చే సంవత్సరం నిర్వహించే కనకదాస జయంతికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానిస్తామన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. కల్యాణదుర్గం పట్టణంలో కనకదాసు విగ్రహ ఏర్పాటు చేస్తామన్నారు. కురుబలకు అన్ని విధాల తాము సహకరిస్తామన్నారు.

LEAVE A RESPONSE