Suryaa.co.in

Telangana

జైలుకెళ్లినా కేటీఆర్ సీఎం కాలేడు

– ఆ చాన్స్ చెల్లి కవిత కొట్టేసింది
– అదానీ సంకనెక్కింది కేసీఆరే
– మీడియాతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

జైలుకెళ్తే ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ భావిస్తున్నట్లుగా ఉంది. కానీ కేసీఆర్ కుటుంబంలో ఆ ఛాన్స్ ఆయన చెల్లి కవిత కొట్టేసింది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం అదానీ సంకలో దూరింది. కానీ ఇప్పుడు మా పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. బీఆర్ఎస్ హయాంలో అదానీకి పలు ప్రాజెక్టులు కట్టబెట్టారు. వాటిపై విచారణకు సిద్ధమా ‘ ? అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ… ‘కేటీఆర్ జైలుకెళ్లాలని తహతహలాడుతున్నారు. నేను మొన్న చూశాను… జైలుకు వెళ్లి వారంతా సీఎం అయ్యారని భావిస్తున్నాడు. ఆ లెక్కన మొదట కేటీఆర్ చెల్లెలు జైలుకు వెళ్లారు. అలా కూడా కేటీఆర్‌కు అవకాశం రాదు. అలాంటి అవకాశం ఏదైనా ఉంటే ఇప్పటికే ఆ ఛాన్స్ ఆయన చెల్లెలు కొట్టేసింది. కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం పదవి కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఆ ఫ్యామిలీలో పోటీని తట్టుకోలేక మాపై ఏడుపు. కేటీఆర్ అమెరికాలో చదువుకున్నాడు. పదేళ్లు మంత్రిగా పని చేశాడు. కాస్త ఆలోచించి మాట్లాడాల’ని రేవంత్ రెడ్డి సూచించారు.

‘ మహారాష్ట్రలో గొప్ప విజయం సాధించామని బీజేపీ చెబుతోంది. కానీ రెండు లోక్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటకలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు, బెంగాల్‌లో ఆరు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ ఎక్కడా గెలవలేదు. మహారాష్ట్రలో మీ ప్రభుత్వం మరోసారి నెగ్గింది. ఝార్ఖండ్‌లో మా ప్రభుత్వం మరోసారి నెగ్గింది. ఇందులో బీజేపీ సంబరాలు చేసుకోవడానికి ఏముంది’? అన్నారు.

LEAVE A RESPONSE