– డిక్టేషన్‌లా సాగుతున్న జగన్ ప్రెస్‌మీట్
– రికార్డు చేసిన ప్రెస్‌మీట్లే ఎక్కువ
– నెగటివ్ ప్రశ్నలు వేస్తే జగన్ వద్ద కనిపించని జవాబు
– యాజమాన్యానికి ప్రశ్నలు వేసిన వారిపై ఫిర్యాదు
– చెప్పాల్సింది చెప్పేసి వెళుతున్న జగన్
– ఎంపిక చేసిన మీడియాకే ప్రెస్‌మీట్లకు పిలుపు
– జగన్‌పై ప్రశ్నలు వేయాలంటే మీడియాకు జంకు
– అందుకు భిన్నంగా మంత్రి లోకేష్ శైలి
– తొలిరోజుల్లో పూర్తి తడబాటు
– భాషాదోషాలతో దారుణమైన ట్రోలింగ్‌కు గురి
– గత ఐదేళ్లలో రాటుతేలిన వైనం
– మీడియాను పిలిచి మరీ సమాధానాలిస్తున్న తీరు
– నెగటివ్ ప్రశ్నలు వేసినా జవాబిచ్చే వైఖరి
– సీఎంగా చేసినా ఇంకా మీడియాను ఎదుర్కొనేందుకు జగన్ జంకు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇద్దరూ యువకులే. అందులో ఒకరు ఐదేళ్లు రాష్ట్రానికి సీఎంగా చేసిన ఒక పార్టీ అధ్యక్షుడు. మరొకరు రెండుసార్లు మంత్రిగా పనిచేస్తున్న మంత్రి. ఇద్దరికీ అనుభవం-అధికారంలో తేడా ఉంది. అందులో ఒకరు వైసీపీ అధినేత-మాజీ సీఎం జగన్ అయితే.. మరొకరు మంత్రి లోకేష్. ఈ ఇద్దరూ మీడియాను ఎదుర్కొంటున్న తీరు-శైలి భలే గమ్మతుగా, వింతగానూ, విభిన్నంగానూ కనిపిస్తోంది. ఐదేళ్లు సీఎంగా పనిచేసిన జగన్, మీడియా ప్రశ్నలకు జవాబిచ్చేందుకు జంకుతుంటే.. లోకేష్ అదుకు భిన్నంగా- నిర్భయంగా బదులిస్తున్న వైఖరి మీడియా వర్గాలకు ఆకర్షిస్తోంది.
తండ్రి మృతి తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అవిశ్రాంతంగా ఓదార్పు యాత్ర చేసి, విస్తృతమైన ప్రజాభిమానం సంపాదించుకున్న నేత జగన్. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి, జైలుకు వెళ్లినా 67 స్థానాలు సాధించిన ధీశాలి ఆయన. విపక్షంలో ఉన్నా, ఓటమికి వెరవకుండా 23 మంది ఎమ్మెల్యేలు జంపయినా ఏమాత్రం ఆత్మస్ఱైర్యం కోల్పోకుండా, అధికార పగ్గాలు అందుకున్న యువనేత. మొండితనానికి కేరాఫ్ అడ్రస్.
అంటే ఆ ప్రకారంగా ఈ సుదీర్ఘకాలంలో జగన్ ఎంతో అనుభవ ం సంపాదించాలి ఉండాలి. ఎదురుదెబ్బలు, వెన్నుపోట్లు, తిరుగుబాట్లతో పాటు.. ప్రజాభిమానం చూరగొన్న జగన్‌కు ప్రపంచం చాలా నేర్పించి ఉండాలి. చాలా అనుభవం మిగిల్చి ఉండాలి.
అందువల్ల మీడియాను సులభంగా-అవ లీలలగా ఎదుర్కోవడం ఆయనకు కొట్టినపిండి కావాలి. అసలు అది ఆయనకు సమస్య కాకూడదు. ఎంత చిక్కు ప్రశ్నలకయినా.. అవలీలగా సమాధానాలు చెప్పాల్సినంత అనుభవం సంపాదించుకున్నారు. అయినా జగన్‌కు ఇప్పటికీ మీడియా అంటే భయమే. ప్రెస్‌మీట్ పెడితే అదొక ప్రహసనమే. ప్రెస్‌మీట్ గడిస్తే చాలనుకునేంత పిరికితనం. ఎందుకో తెలియదు.
నిజానికి జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా, మీడియాతో మాట్లాడిన సందర్భాలు బహు తక్కువ. ఒకవేళ మాట్లాడినా తాను ఎంపిక చేసుకున్న పత్రికలు-చానెళ్లను మాత్రమే పిలిచేవారు. ఎవరూ ప్రశ్నలు వేసేందుకు లేదు. అప్పుడప్పుడు ఓ రెండు చానెళ్లకు చెందిన మహిళా జర్నలిస్టులు ప్రశ్నలు వేస్తే, వాటికి పొడి పొడిగా బదులిచ్చేవారు. అసెంబ్లీలోని ఆయన చాంబరులో అప్పుడప్పుడు జరిగే ప్రెస్‌మీట్లు కూడా డిటో. ఇక వివాదాస్పద ప్రశ్నలకు జగన్ బదులివ్వరు. చేతులు నలిపేసుకుని, మెడ అటు ఇటు తిప్పేసుకుంటూ సమాధానం దాటేస్తుంటారు. అవన్నీ ‘ఇప్పుడెందుకులేన్నా’ అని తప్పించుకుంటారు.
నిజానికి సీఎం స్థాయి వ్యక్తి, అందునా ఒక పార్టీ అధినేత వద్ద బోలెడు సరుకు ఉండాలి. ఏ ప్రశ్న వేసినా ఠక్కున బదులిచ్చే స్థాయికి ఎదగాలి. లేదా లౌక్యంగా తప్పించుకునే తెలివైనా ఉండాలి. ఒక ప్రశ్నకు మరో జవాబిచ్చే నేర్పయినా ఉండాలి. ప్రధానంగా రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు, జవాబులివ్వడం పెద్ద కష్టం కాదు. సీఎం, పార్టీ అధినేత స్థాయిలో తనకున్న అనుభవంతో జగన్ వీటికి సమాధానాలివ్వడం బహు సులభం. కానీ జగన్‌కు వీటిలో ఏ ఒక్క లక్షణాలు లేకపోవడమే ఆశ్చర్యం.
ప్రధానంగా ఏ నాయకుడైనా విపక్షంలోకి వచ్చిన తర్వాత మీడియాను వీలైనంత ఎక్కువగా వాడుకుంటారు. ఎందుకంటే వారికి ఆ సమయంలో అదే సరైన వేదిక. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రేవంత్ వంటి నేతలంతా విపక్షంలో ఉండగా.. మీడియాను వీలైనంత ఎక్కువ వినియోగించుకున్న వారే. పైగా విపక్షంలో ఉన్నప్పుడే ప్రజాసమస్యలు ఎక్కువగా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. మీడియా ఇచ్చే ఇన్‌పుట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. వాటి ఆధారంగా అధికారపక్షాన్ని తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు.
ఐదేళ్లు సీఎం, మరో ఐదేళ్లు విపక్షనేతగా పనిచేసిన జగన్ మాత్రం ఇందుకు భిన్నం. మీడియాను చూస్తే పారిపోయే నైజం. విపక్షంలో ఉన్నప్పుడూ అదే శైలి. చివరకు ఆయన ప్రసంగాన్ని రికార్డు చేసి, దానినే ప్రెస్‌మీట్‌లా విడుదల చేస్తున్న వైచిత్రి. అందుకే ఆశ్చర్యం. కొత్తగా విపక్షపాత్ర పోషిస్తున్న జగన్ ప్రెస్‌మీట్లు డిక్టేషన్‌లా సాగుతున్నాయి. అంటే ఒక అధికారి తన స్టెనోకు డి క్టేషన్, నోట్స్ ఇస్తున్నట్లుగా జగన్ ప్రెస్‌మీట్ సాగుతోంది.
తాను చెప్పాల్సింది చెప్పడం. తర్వాత మీడియాకు ప్రశ్నలు వేసే అవకాశం ఇవ్వకుండా, చేతికి వాచీ చూసుకుని వెళ్లిపోవడం. ఏదైనా ప్రశ్న వేస్తే అది నచ్చితే చెప్పడం. లేకపోతే ‘అవన్నీ ఇప్పుడు ఎందుకే అన్నా’ అని వెళ్లిపోవడం. ఇంకా నెగటివ్ ప్రశ్నలు వేసేవారిని అలా చూసి వెళ్లిపోతుంటారు. తర్వాత జగన్ ఆఫీసు నుంచి.. ఆ ప్రశ్న వేసిన జర్నలిస్టు పనిచేసే మీడియా యజమానికి ఫోను వెళుతుంది. మీ రిపోర్టరు అన్నీ నెగటివ్ ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాగైతే ఎలా? అధికారంలో ఉన్నప్పుడు మేం మీకు ఎంత చేశాం? రేపటి నుంచి అతడిని కాకుండా మరొకరిని పంపించండి అంటూ ఫోను వెళుతుంది. అదే ఇప్పుడు జగన్ మీడియా పట్ల అనుసరిస్తున్న నయా ట్రెండ్. వేసిన ప్రశ్నలకు నేర్పుగా, ధైర్యంగా జవాబిచ్చే ధైర్యం లేని జగన్.. ఈ ఐదేళ్లు మీడియాను ఎందుకు తప్పించుకుని తిరిగారో ఇప్పుడే అర్ధమవుతోందన్నది మీడియా వర్గాల ఉవాచ.
[18:16, 11/24/2024] Subbu: మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. తన మునుపటి శైలిని పూర్తిగా మార్చుకుని, పరిణతి చెందిన నేతగా కనిపిస్తున్న పరిస్థితి. ఒక వ్యక్తి రాటుతేలితే ఏ స్థాయిలో రాణించగలరన్న దానికి లోకేష్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ.
లోకేష్ పార్టీలో అధికారికంగా బాధ్యతలు చేపట్టకముందు, ఒక నాయకుడి కొడుకుగా పర్యవేక్షణకు పరిమితమయ్యారు. అప్పట్లో ఆయన తన పంజగుట్ట హెరిటేజ్ కార్యాలయం, తర్వాత హైదరాబాద్ పార్టీ ఆఫీసుకే ఎక్కువ పరిమితమయ్యేవారు. అయినప్పటికీ, పార్టీ పర్యవేక్షణపైనే ఎక్కువ దృష్టి సారించేవారు. ఇంట్లో కింద ఫ్లోర్ నుంచే సమాచార వ్యవస్థను విశ్లేషించే వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు.
ఎక్కువగా గ్రౌండ్ రిపోర్టుల మీదనే ఆధారపడి, తండ్రికి సూచనలిచ్చేవారు. అప్పటికి లోకేష్ మీడియాకు దూరంగానే ఉండేవారు. తండ్రితో సాన్నిహిత్యం ఉన్న కొంతమంది మాత్రమే, అప్పట్లో లోకేష్‌తో మాట్లాడేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తండ్రి రైతుదీక్ష చేసిన సందర్భంలో, పోలీసులు ఆయన దీక్ష భగ్నం చేసి దీక్ష చేసి, నిమ్స్‌కు తరలించారు. ఆ సమయంలోనే లోకేష్ తొలిసారి బయటకు వచ్చారు. తండ్రి ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఆ బ్లాక్‌లోనే ఆయన కూడా కనిపించేవారు.
ఇక అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా, మీడియాతో పెద్దగా సంబంధాలు లేవు. ఎమ్మెల్సీగా ఎన్నికయి, మంత్రి అయిన తర్వాత కూడా మీడియాను పరిమితంగానే కలిసేవారు. తనకు పరిచయం ఉన్నవారితోనే మాట్లాడేవారు. ప్రెస్‌మీట్లకూ దూరంగా ఉండేవారు. అసెంబ్లీ సమయంలో కూడా, మీడియాతో మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఇంటర్వ్యూలు అడిగినా ‘ఇప్పుడే వద్దులే బాస్’ అని సున్నితంగా తప్పించుకునేవారు.
ఆ సమయంలో లోకేష్ కొన్ని సందర్భాల్లో చేసిన ప్రసంగాలు దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యేవి. లోకేష్ భయానికి బహుశా అది కూడా ఒక కారణం కావచ్చేమో?! ఇంగ్లీషు మీడియంలో చదువుకున్న లోకేష్‌కు.. అప్పట్లో తెలుగుపై పెద్దగా పట్టు లేకపోవడంతో, ఆయన మాటల్లో దొర్లే తప్పులను వైసీపీ సోషల్‌మీడియా దారుణంగా ట్రోల్ చేసి, ఆయనను పప్పుగా ముద్రవేసింది.
తర్వాత లోకేష్ రాటుతేలి, ప్రత్యర్ధులపై విరుచుకుపడిన వైనం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా యువగళం పాదయాత్ర, లోకేష్‌ను ఒకనేతగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రజావేదికయింది. అసలు ఒకప్పుడు మాట్లాడేందుకే భయపడిన లోకేష్… అదే యువగళం వేదికలపై నుంచి, నాటి జగన్ సర్కారుపై విసిరిన పంచ్‌లు వింటే ఆశ్చర్యపడక తప్పదు. భాష మార్చుకుని మీడియా ముందు ధైర్యంగా నిలబడి, ఎలాంటి ప్రశ్నలకయినా సమాధానాలిస్తున్న తీరు.. అంతకుముందు ఆయన తీరు చూసిన వారిని సైతం ఆశ్చర్యానికి గురిచేసేదే. పాదయాత్రలు, జిల్లా పర్యటనల సందర్భంలో మీడియాను ఆయనే పిలిచి, ప్రశ్నలు అడగమన్న తీరు.. ‘ఈయన అప్పటి లోకేషేనా’ అని ఆశ్చర్యపరిచేదే.
పైగా అక్కడ ఉండే తమ పార్టీ ప్రత్యర్థి మీడియా విలేకరిని పిలిచి మరీ ప్రశ్నలు వేయమని చెప్పి, ర్యాగింగ్ చేసిన తీరు మరో అబ్బురం. అదే జగన్ ‘మీ పేపర్‌ను మేం పిలవలేదు కదా? మీరు ఇక్కడకు ఎందుకొచ్చారు’ నిర్మొహమాటంగా అడిగిన సందర్భాలు లేకపోలేదు. కానీ లోకేష్ మాత్రం అందుకు భిన్నంగా, సాక్షి-టీవీ9 రిపోర్టరును పిలిచి మరీ మాట్లాడటమే విశేషం. ఎక్కడా తడబడకుండా, తొట్రుపాటుకు గురికాకుండా మాట్లాడుతున్న తీరు చూస్తే.. జగన్ ఆయనను చూసి నేర్చుకోవాలనిపించక తప్పదు.
నిజానికి జగన్‌తో పోలిస్తే లోకేష్ రాజకీయ అనుభవం తక్కువే. జగన్ కడప ఎంపీగా కూడా పనిచేశారు. తర్వాత విపక్ష నేత, సీఎంగా పనిచేసినప్పటికీ జగన్‌కు ఇప్పటికీ మీడియా అంటే భయమే. లోకేష్ తండ్రి సీఎం అయినప్పటికీ, లోకేష్ మీడియా ముందుకొచ్చి మాట్లాడే అంశాలు అప్పట్లో లేవు. మంత్రిగా తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ అవమానాల తర్వాతనే లోకేష్ బాగా రాటుతేలినట్లు కనిపించింది.
ఉమ్మడి రాష్ట్రం, విభజిత రాష్ట్రంలో లోకేష్‌ను చాలాసార్లు కలిసినప్పటికీ, ఇప్పటి ఆయనలోని పరిణతి ఎప్పుడూ చూడలేదు. చాలాకాలం తర్వాత లోకేష్‌ను కొద్దిరోజుల క్రితం కలిసిన సందర్భంలో, ఆయనలో తొణికిసలాడే ఆత్మవిశ్వాసం చూసి ఆశ్చర్యపోవలసి వచ్చింది. అందరికీ అనుభవాలే పాఠాలు చెబుతాయంటే ఇదేనేమో?! కానీ ఈ అనుభవాలు జగన్‌కు మాత్రం, పాఠాలు.. కనీసం గుణపాఠాలుగా కూడా కాకపోవడమే విచిత్రం! లోకేష్ కూడా జగన్ మాదిరి ఇంగ్లీషు మీడియమే. కానీ ఆయనలా.. ఈయనిలా!
ఇక జగన్ చెల్లి- ఏపీపీసీసీ చీఫ్ అయిన షర్మిలది అన్నయ్యకు భిన్నమైన తీరు. షర్మిల కూడా ఇంగ్లీషు మీడియంలో చదివినా, తండ్రి వైఎస్ మాదిరి తెలుగు స్పష్టంగా మాట్లాడతారు. తెలుగు సామెతలు ఆమె మాటల్లో తరచూ దొర్లుతుంటాయి. షర్మిల మాటలు విన్న వారికి, ఆమె తెలుగు మీడియంలో చదివారా అనిపిస్తుంటుంది.
ప్రెస్‌మీట్లలో ఏ ప్రశ్నకూ ఆమె తడుముకున్న దాఖలాలు కనిపించవు. అన్న జగన్ మాదిరిగా జర్నలిస్టులను ‘మీరు ఏ మీడియా అన్నా’ అని అడగరు. ఏ మీడియా అయినా సరే.. వేసిన ప్రశ్నకు తడుముకోకుండా జవాబు ఇచ్చేస్తారు.
ఆమె ప్రసంగం-మాటలు.. తండ్రిని ఇమిటేట్ చేస్తున్నట్లు కనిపించినప్పటికీ, జగన్‌తో పోలిస్తే ఆమెకే విషయ పరిజ్ఞానం ఎక్కువ. జగన్ ప్రసంగం చప్పగా ఉంటుంది. ఎక్కడా పంచ్‌లు ఉండవు. కానీ షర్మిల తీరు వేరు. ఆమె ప్రసంగంలో పంచ్‌లు అలా పడుతూనే ఉంటాయి. జగన్ స్పీచ్ కాపీ చూసి మాట్లాడతారు. స్పీచ్‌కాపీ లేకపోతే మాట్లాడలేరు. చాలాసార్లు చూసి కూడా తప్పులు దొర్లి, సోషల్‌మీడియాకు దొరికిపోయిన సందర్భాలు కోకొల్లలు. సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రసంగాలు, సగానికిపైగా ట్రోలింగ్‌కు గురైనవే కావడం గమనార్హం.
కానీ షర్మిల మాత్రం నోట్స్ చూడకుండానే మీడియాతో మాట్లాడతారు. జగన్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు ముందు గంటకుపైగా ప్రిపేర్ అవుతారు. ఏకపాత్రాభినయంతో రిహార్సల్ చేస్తారు. కానీ షర్మిల మాత్రం నోట్స్ లేకుండా, పేపర్ చూడకుండానే ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుంటారు. జగన్ ప్రసంగం ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తే.. షర్మిల ప్రసంగం మాత్రం, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంటుందనేది నిర్వివాదం.
నిజానికి అన్న జగన్ అరెస్టుకు ముందు వరకూ షర్మిలకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తిలేదు. పాదయాత్ర కూడా అన్న కోసం చేసిందే. అప్పటికి ఆమెకు ‘రాజకీయభాష’ గురించి ఏమాత్రం తెలియదు. తెలుగుపై పెద్దగా పట్టు లేదు. అంతకుముందు ఏ వేదికపైనా మాట్లాడిన అనుభవం కూడా లేదు. అనివార్యమైన పరిస్థితిలో బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, ఇప్పుడు ఏపీలో ఒక జనాకర్షణ నేతగా మారారు.
నిజంగా.. జగన్-భారతి తన బెంగళూరు నివాసంలో షర్మిలకు సూచించినట్లు… ‘నేను రాజకీయాల్లో ఉంటా. నువ్వు వ్యాపారాలు చూసుకో’ అని చెప్పినట్లుగా, ఆమెకు వ్యాపారాలు అప్పగించి ఉంటే, షర్మిల రాజకీయాల్లోకి వచ్చి ఉండేవారు కారేమో?! జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి.. ఆమెకు సాక్షి, భారతి సిమెంట్స్ వ్యాపారాలు అప్పగించి ఉంటే, పరిస్థితి మరోరకంగా ఉండేదేమో?! అందుకు భిన్నంగా వ్యవహరించి ‘చెల్లిని కూడా మోసం చేశార’న్న పేరు తెచ్చుకున్నారు.