– ఆర్ధికశాఖ మాజీ కార్యదర్శి సత్యనారాయణ రూటేవేరప్పా
– విజిలెన్స్, డీఓపీటీ విచారణ ఉన్నా బేఫికర్
– నేను వెళ్లిపోతున్నానంటూ లేఖ ఇచ్చి ఢిల్లీకి జంప్
– డెప్యుటేషన్ అయిపోయిందని లేఖ ఇచ్చి నిష్క్రమణ
– తాజాగా ఆయనపై డిఓపీటీకి ఎంపి సీఎం రమేష్ ఫిర్యాదు
– ఆ ఇద్దరు ఐఏఎస్‌లే క్షేమంగా పంపించేశారట
– సీఎంఓలో ఒక కీలక అధికారి అభయం?
– సీఎస్ అడ్డుకున్నా సతె్తన్నను సాగనంపిన సీఎంఓ పెద్దాఫీసరు
– మొన్న విజయ్‌కుమార్‌రెడ్డి.. వాసుదేవరెడ్డి.. రామకృష్ణ.. నిన్న సత్యనారాయణ
– ధర్మారెడ్డిని వదిలేసినట్లేనా?
– వాసుదేవరెడ్డి ఉన్నారా? పారిపోయారా?
– స్వేచ్ఛగా ఎగిరిపోతున్న ‘ఆఫీసరు పావురాలు’
– విచారణ విజయవంతంగా అటకెక్కుతున్న వైనం
– వారికి అభయమిస్తున్న అదృశ్య శక్తులెవరు?
– ఇలాగైతే ఇక కూటమికి భయపడేదెవరు?
– కూటమిలో అసంతృప్తి కల్లోలం
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్ జమానాలో ఆకాశమే హద్దుగా జగనన్న అండతో రెచ్చిపోయి.. అడ్డదారులు తొక్కిన ఐఏఎస్ అధికారులు, కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం భయపడకుండా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారు. కూటమి సర్కారుతో తమకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న సదరు అధికారులపై.. అటు కూటమి సర్కారు కూడా కొరడ ఝళిపించలేక, చేతులెత్తేస్తున్న వైనం, కూటమిలో అసంతృప్తి కల్లోలానికి కారణమవుతోంది. ఫలితంగా ప్రభుత్వంలో ఎన్ని అడ్డగోలు పనులు చేసినా శిక్షలు ఉండవన్న సంకేతాన్ని మిగిలిన అధికారులకు విజయవంతంగా పంపిస్తున్నట్లయింది.
జగన్ ఐదేళ్ల కాలంలో సచివాలయం బ్లాక్ నుంచి.. గ్రామాల్లో మంచినీటి ట్యాంకర్లు, గ్రామ సచివాలయ భవనాలను సైతం అవలీలగా తాకట్టుపెట్టి, అప్పులు తెచ్చిన నాటి ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు నిజానికి సతె్తన్న సారుకు గత టీడీపీ హయాంలోనే, అభిమానంతో ‘కాపు’కాసింది ఇప్పటి ఓ మంత్రిగారే. రైల్వేస్ నుంచి ఆయనను డెప్యుటేషన్ మీద తీసుకువచ్చింది ఆ మంత్రిగారే. తమ వారికి ‘కాపు’కాయడంలో సిద్ధహస్తుడైన ఆ మంత్రి కార్యాలయంలో, మెజారిటీ సిబ్బంది వారే కనిపిస్తుంటారన్న ప్రచారం ఉంది. ఈ మధ్య తన శాఖలో వివిధ ఆరోపణలున్న ఐఏఎస్ అధికారికి ‘కాపు’కాసి, ఏరి కోరి మరీ ఆయనను నియమించుకున్నారన్న ప్రచారం లేకపోలేదు. అది వేరే విషయం.
జగన్ జమానాలో ఆర్ధిక శాఖను వెలిగించిన సత్యనారాయణపై, కూటమి నేతలు లెక్కలేనన్ని ఆరోపణలు కురిపించారు. మొదట వచ్చిన వారికి కాకుండా, నాటి సీఎంఓ కార్యదర్శి ధనంజయరెడ్డి చెప్పిన వారికే బిల్లులు ఇస్తున్నారని కూటమి విరుచుకుపడింది. 14 శాతం కమిషన్లు తీసుకుని బిల్లులు ఇస్తున్నారని ఆరోపించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సత్యనారాయణను తప్పించి, ఆయనపై విచారణ నిర్వహించి జైలుకు పంపిస్తారన్న ప్రచారం-అంచనాలు కూటమి వర్గాల్లో ఉధృతంగా సాగాయి.
అటు సతె్తన్న సారు కూడా.. ఇక తాను ఇక్కడ ఉంటే ప్రమాదమని భావించి, తన మాతృశాఖకు వెళ్లే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకపోయినా మాతృశాఖకు వెళ్లిన ఆయనకు.. మీ ప్రభుత్వం నుంచి రిలీవింగ్ ఆర్డరు తెచ్చుకోమని అక్కడి అధికారులు చెప్పడంతో, విధి లేక వెనక్కి వచ్చారు. అయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ఆయనపై చర్యల కొరడా ఝళిపించడానికి బదులు.. ‘సత్తిసారు లేకపోతే ఆర్ధికశాఖలో నిమిషం జరగదు. ఆయన లేకపోతే జీతాలు ఎలా ఇస్తాం. సారు చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయ’ని ఆయన ఘనత గురించి గొప్పగా చెప్పడంతో… సారును అక్కడే కొనసాగించారు. కాకపోతే ముఖ్యకార్యదర్శి ఓఎస్డీగా హోదా మార్చారు.
మిగిలినదంతా సేమ్ టు సేమ్. ఆర్ధికశాఖలో ఆయన హవా ఏమాత్రం తగ్గలేదు. ఆ శాఖ ‘పెద్దాఫీసరు’ కూడా, సత్తిసారుకు బాగా అనుభవం ఉండటంతో అంతా ఆయనపైనే వదిలేశారు. ఆ క్రమంలోనే పులివెందులలో వైసీపీ కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ చేశారు. నిజానికి అంతకుముందు.. ఆ పెండింగ్ బిల్లుల కోసమే, జగన్‌ను పులివెందులలో కాంట్రాక్టర్లు నిలదీశారు. ఆ తర్వాతనే అన్ని పెండింగ్ బిల్లులు క్లియరవడం విశేషం. వాటి విలువ 86 కోట్లు. ఒక విడత బిల్లులు క్లియర్ చేశారన్న వార్త.. మీడియాకు పొక్కిన తర్వాత, టీడీపీ సోషల్‌మీడియా సైన్యం ప్రభుత్వ అసమర్ధతపై విరుచుకుపడింది. ఆ తర్వాతయినా జాగ్రత్తపడాల్సింది పోయి, రెండోవిడతలో వైసీపీ కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం, పార్టీ కార్యకర్తలను ఆగ్రహానికి గురిచేసింది. సతె్తన్నతో అట్లుంటది మరి!
సత్యనారాయణ రైల్వే నుంచి డెప్యుటేషన్ వచ్చి ఏడేళ్లు ముగిసింది. అయితే ఆయనపై అంతకుముందు విజిలెన్స్ విచారణ పెండింగ్‌లో ఉంది. తాజాగా బిల్లుల చెల్లింపులో సత్యనారాయణ అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించారంటూ, బీజేపీ ఎంపి సీఎం రమేష్ డీఓపీటీకి ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కూడా అందచేశారు. కాగా కొద్దిరోజుల క్రితం డీఓపీటీ నుంచి కూడా , సత్యనారాయణపై విచారణ ప్రారంభమయిందని సమాచారం.
ఈ నేపథ్యంలో సత్యనారాయణ, చడీచప్పుడు లేకుండా.. ‘నా డెప్యుటేషన్ ముగిసినందున, తన మాతృశాఖకు వెళ్లిపోతున్నానోచ్’ అంటూ, ఒక లేఖ రాసి రైల్వేస్‌కు చెక్కేశారు. ఇది తెలిసిన సీఎస్ అగ్గిరాముడయ్యారట. నిజానికి సత్తిసారుపై సీఎస్ సీరియస్‌గా ఉన్నప్పటికీ.. సీఎంఓలోని ఒక కీలక అధికారి, ఆర్ధిక శాఖలోని మరో పెద్దసారు ఇద్దరూ సత్తిసారుకు అభయహస్తం ఇచ్చి, సాగనంపారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
జగన్ సర్కారులో బాధితులు కాని వారికి, కీలక పదవులు అనుభవించిన వారికి సీఎంఓలో స్థానం ఇచ్చారన్న టీడీపీ వర్గాల అసంతృప్తి నేపథ్యంలో.. సత్యనారాయణ జంపయిపోయారన్న వార్త, కూటమి వర్గాల అసంతృప్తికి కారణమయింది. జగన్ బాధిత అధికారులు సీఎంఓలో ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదన్న వ్యాఖ్యలు కూటమి వర్గాల్లో వినిపిస్తోంది.
నిజానికి సీఎంఓలో ఇప్పుడు పనిచేస్తున్న అధికారుల్లో.. ఒక్కరు కూడా జగన్ బాధితులు కారన్న ప్రచారం, తొలిరోజు నుంచీ జరుగుతున్నదే. జగన్ బాధిత అధికారులకే ఆ కసి-పట్టుదల ఉంటుంది తప్ప.. జగన్ జమానాలో అన్ని అధికారులు అనుభవించిన వారికి , సీరియస్‌నెస్ ఎందుకు ఉంటుందన్న చర్చ, చాలాకాలం నుంచి జరుగుతోంది.
అయితే కొందరు తెలివైన అధికారులు.. తమను జగన్ బెదిరించడంతో, తప్పనిసరి పరిస్థితిలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాల్సి వచ్చిందని, నెపం జగన్‌పై నెట్టేసి సీఎంఓ పీఠం వేసినట్లు అధికార-కూటమి వర్గాల్లో ప్రచారం లేకపోలేదు. జగన్ బాధిత అధికారులు సీఎంఓలో ఉంటే, కూటమి శ్రేణులకు సమస్యలు ఉండేవికావ న్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు విచారణ ఎదుర్కొని.. వణికిపోవలసిన సత్యనారాయణ, బేఫికర్‌గా కేంద్ర సర్వీసుకు తిరిగి వెళ్లిపోయారంటే.. అవినీతి అధికారులకు ఏం సంకేతాలిస్తున్నాం? ఇక అవినీతి అధికారులు- గీత దాటే అధికారులకు ఏం భయం ఉంటుందన్న చర్చకు తెరలేచింది. గతంలో సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేసిన విజయకుమార్‌రెడ్డి, బ్రేవరెజ్‌స్‌ను వెలిగించిన వాసుదేవరెడ్డి, స్టాంప్స్ అండ్ రెవిన్యూలో చక్రం తిప్పిన ఐజి రామకృష్ణ వంటి అధికారులు నిక్షేపంగా వెళ్లిపోవడం కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ఠగా మారిందన్న ఆవేదన అధికారపార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వాసుదేవరెడ్డి సీఐడీ అదుపులోనే ఉన్నారని, ఆయనతో కొందరు ‘మాటా-ముచ్చట’ కొనసాగిస్తున్నారన్న ప్రచారం, సోషల్‌మీడియాలో జోరుగా సాగింది. మళ్లీ ఆ తర్వాత వాసుదేవరెడ్డి ముచ్చట అంతా మర్చిపోవడం విశేషం.
టీటీడీలో అంతా తానై.. అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న మాజీ జేఈఓ ధర్మారెడ్డిపై, ఇప్పటికీ ఈగ వాలకపోవడం విశేషం. ఆయనను ఎవరు రక్షిస్తున్నారన్నదే ప్రశ్న. మద్యం వ్యవహారంలో చక్రం తిప్పిన వాసుదేవరెడ్డిని, జీఏడీకి రిపోర్టు చేయమన్న ప్రభుత్వం.. ఆయనపై వెంటనే సస్పెండ్ వేటు వేయకపోవడంతో..దర్జాగా తప్పించుకుపోయి, కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన వైనం అప్రతిష్ఠ తెచ్చింది. ఆయన పరారైన నెలరోజుల తర్వాత కూడా సస్పెండ్ చేయని, ‘మంచి ప్రభుత్వం’పై టీడీపీ సోషల్‌మీడియా సైన్యం నిప్పులు కురిపించింది.