– డిమాలిషన్ మ్యాన్ గా రేవంత్ రెడ్డి
– ఇంకా 30 శాతం మేర కూడా రుణమాఫీ పూర్తికాలేదు
– తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి దారుణం
– కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఊపర్ శేర్వానీ-అందర్ పరేషానీ
– జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం మేర బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లుగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామిక ప్రభుత్వం వస్తుందని ఆశించిన ప్రజలకు.. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లుగా మారింది. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలనే అబద్ధపు నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెట్టింది. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి అగ్నిగుండంలో పడ్డట్లు మారింది.
కాంగ్రెస్ పార్టీ గతంలో మోసపూరిత, అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో అబద్ధపు హామీల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించింది. దేవుళ్ల మీద ప్రమాణం చేసి మరీ కాంగ్రెస్ నాయకులు 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నరు.
మహాలక్ష్మి కింద మహిళలకు రూ. 2500 జాడలేదు. రూ. 500 గ్యాస్ సిలిండర్ అడిగే దిక్కులేదు. ఉచిత బస్సు ప్రయాణం అరకొరగా నడిచినా ఆ భారమంతా మోసేది ఆర్టీసీ కార్పొరేషనే. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 3 వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి బకాయిపడింది. రైతు భరోసా కింద రూ. 15 వేలు దేవుడెరుగు. ఉన్న రూ. 10 వేల రైతుబంధు ఊసేలేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు తప్పితే.. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా లేదు.. రైతుబంధు ఊసులేదు.
కౌలు రైతులకు రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు దిక్కులేదు. గృహ జ్యోతి కింద ఉచిత కరెంటు పేరుకు మాత్రమే.. మధ్యతరగతి ప్రజలు కరెంటు బిల్లుల మోతతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ అన్నరు.. రాష్ట్రంలో ఇంకా 30 శాతం మేర కూడా రుణమాఫీ పూర్తికాలేదు. చేయూత కింద వృద్ధులు, వితంతువులకు రూ. 4 వేల చొప్పున పెన్షన్ అమలు కాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో నేడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి దారుణంగా మారింది. కనీసం భూమి వైపు చూసేందుకు ప్రజలకు ధైర్యం చాలట్లేదు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఐరన్ లెగ్ లా మారింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరు. డిమాలిషన్ మ్యాన్ గా రేవంత్ రెడ్డి మారారు. రాష్ట్రంలో రోజుకు నాలుగిండ్లు కూల్చనిదే ఆయన నిద్రపోడు.
పార్లమెంటు ఎన్నికల తర్వాత 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. హర్యానాలో 50 శాతం పైగా ఓట్లతో బిజెపి గెలిచింది. మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందని విధంగా స్వతహాగా 134 సీట్లు సాధించి, విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జార్ఖండ్, జమ్ము కశ్మీర్ లోనూ బిజెపి ఓటుశాతం మెరుగుడింది. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని కలిపి స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు కూడా దాటలేదు. కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీ పట్ల ప్రజల విశ్వాసం పోయింది. కాంగ్రెస్ పార్టీ ఉచిత పథకాల ప్రకటనలన్నీ ఉత్తర ప్రగల్భాలే అని ప్రజలు తిరస్కరించారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రానున్నది బిజెపి ప్రభుత్వమే. బిజెపి ప్రజలకు చెప్పిందే చేస్తుంది.. చేసేదే చెప్తుందని నిరూపితమైంది. భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. డిసెంబరు 15లో కులగణన పూర్తిచేసి జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం మేర బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. కాని నిబద్ధతతో వ్యర్థాలను మళ్లించేలా శుద్ధీకరణ పూర్తిచేయాలి. నిర్వాసితులకు సరైన న్యాయం చేసి మూసీ ప్రక్షాళన-సుందరీకరణ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఊపర్ శేర్వానీ-అందర్ పరేషానీ అన్నట్లుగా ఉంది.